Begin typing your search above and press return to search.

ఆర్నెల్లు ముందు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్

By:  Tupaki Desk   |   26 April 2022 7:30 AM GMT
ఆర్నెల్లు ముందు అసెంబ్లీ ఎన్నికలకు కేసీఆర్
X
కలిసి వచ్చే కాలాన్ని ఎవరు మాత్రం విడిచిపెడతారు? అందునా తెలంగాణ రాష్ట్ర సమితి అధినేత.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అలాంటి అవకాశాన్ని అస్సలు మిస్ కారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే.. 2023 చివర్లో తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీని ఎన్నికలు జరగాల్సి ఉంది. 2018లో సైతం షెడ్యూల్ కంటే దాదాపు ఆరు నెలలు ముందుగా ఆయన ఎన్నికలకు వెళ్లడం.. అది కాస్తా కలిసి రావటం తెలిసిందే. తనకు కలిసి వచ్చిన సెమీ ముందస్తు ఎన్నికలకు ఈసారి కూడా ఆయన మక్కువ చూపుతున్నారా? అంటే అవునన్న మాట వినిపిస్తోంది.

దీనికి కారణం లేకపోలేదు. షెడ్యూల్ ప్రకారం చూసినప్పుడు 2023 నవంబరు.. డిసెంబరు మధ్యలో ఎన్నికలు జరగాల్సి ఉంది. అందుకు ఆర్నెల్ల ముందు అంటే.. కర్ణాటక.. మధ్యప్రదేశ్ రాష్ట్రాలతో పాటు తెలంగాణలోనూ అసెంబ్లీ ఎన్నికల్ని నిర్వహించేందుకు వీలుగా గులాబీ బాస్ ప్లానింగ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించిన బ్లూ ప్రింట్ కూడా సిద్ధమైన్నట్లు సమాచారం. మిగిలిన వారి కంటే చాలా ముందుగా.. ఏ పరిణామానికైనా ప్రిపేర్ అయి ఉండే అలవాటు కేసీఆర్ లో కొట్టొచ్చినట్లు కనిపిస్తూ ఉంటుంది.

తాజాగా పీకేతో సుదీర్ఘ చర్చలతో పాటు.. ఐప్యాక్ సంస్థతో ఎన్నికల వ్యూహాల కోసం డీల్ కుదుర్చుకోవటం తెలిసిందే. దీనంతటి వెనుక మాస్టర్ ప్లాన్ వేరే ఉందంటున్నారు. షెడ్యూల్ ప్రకారం చూస్తే దేశ సార్వత్రిక ఎన్నికలు 2024 ఏప్రిల్ - మేలో జరగుతాయన్న సంగతి తెలిసిందే.

అంటే.. ఎన్నికల వేడి 2023 ఆరంభం నుంచే మొదలవుతుంది. దానికి ఆరేడు నెలల ముందే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ పూర్తి చేసుకుంటే.. అప్పటి ప్రజాభిప్రాయానికి తగ్గట్లుగా అడుగులు వేయాలన్నది కేసీఆర్ ప్లాన్ గా చెబుతున్నారు.

ఒకవేళ అన్ని అనుకున్నట్లుగా జరిగి.. ఎన్నికల్లో ఘన విజయాన్ని సాధించి.. ముచ్చటగా మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం వస్తే.. సార్వత్రిక ఎన్నికల్లో మరింత దూకుడుగా వ్యవహరిస్తారని చెబుతున్నారు. అందుకు భిన్నంగా బొటాబొటి మెజార్టీ వచ్చినా.. హంగ్ ఫలితం ఏర్పడినా అందుకు తగ్గట్లుగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయటానికి అవసరమైన ముందస్తు కసరత్తు పీకేతో చేసుకున్న డీల్ తో పూర్తి చేస్తారని చెబుతున్నారు.

రానున్న రోజుల్లో కాంగ్రెస్ పార్టీలో కీలక భూమిక పోషించే అవకాశం ఉన్న పీకే.. ముందస్తుగా కొన్ని ప్రాంతీయ శక్తులను కూడా సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు. అందులో భాగంగానే గులాబీ బాస్ పీకేతో సుదీర్ఘ చర్చలు జరిపినట్లుగా తెలుస్తోంది. ఇప్పుడున్న పరిస్థితుల్ని చూసినప్పుడు.. కర్ణాటక.. మధ్యప్రదేశ్ తో పాటు అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లేందుకే కేసీఆర్ మొగ్గు చూపే అవకాశం ఉందని చెప్పక తప్పదు.