Begin typing your search above and press return to search.

జయలలిత ఫార్ములాను ప్రయోగిస్తున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   5 March 2018 5:08 PM GMT
జయలలిత ఫార్ములాను ప్రయోగిస్తున్న కేసీఆర్
X
తమిళనాడు దివంగత సీఎం జయలలిత 2014 ఎన్నికల్లో వరుసగా రెండో సారి అధికారం అందుకుని రికార్డు సృష్టించిన సంగతి అందరికీ గుర్తుండే ఉంటుంది. అయిదేళ్లకోసారి డీఎంకే - అన్నా డీఎంకేల మధ్య అధికారం మారే తమిళనాడులో జయలలిత వరుసగా రెండోసారి గెలవడం అప్పుడు సంచలనంగా మారింది. తమిళనాడులో చాలా సాధారణమైన ఫ్రీ హామీలు ఇవ్వడంతో పాటు జయలలిత మరో రాజకీయ ఎత్తుగడ వేశారప్పుడు. ఇప్పుడు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా అచ్చంగా అదే ఎత్తుగడ వేస్తున్నారు. వైఫల్యాల నుంచి డైవర్ట్ చేస్తూ ఇమేజ్ అమాంతం పెంచుకునే పనిలో పడ్డారు కేసీఆర్. అదే... ఈ జాతీయ రాజకీయాల అడుగులు.

2014 ఎన్నికల సమయంలో తమిళనాడులో ఆనవాయితీ ప్రకారం జయలలిత ఓటమి చెందుతారని అనుకున్నారు. కానీ.. జయ ఎప్పటిలా ఉచిత హామీలివ్వడంతో పాటు తనను అత్యధిక పార్లమెంటు స్థానాల్లో గెలిపిస్తే ప్రధానినవుతానంటూ ప్రచారం మొదలుపెట్టారు. ఆమేరకు తమిళనాడులో ఫ్లెక్సీలు, బ్యానర్లు భారీగా వెలిశాయి. అది ఆమె స్టేచర్‌ను మరింత పెంచడంతో పాటు తమిళ ప్రజల్లో క్రేజ్‌ను పెంచాయి. అమ్మకు మరోసారి అవకాశం ఇవ్వాల్సిందేననిపించేలా చేశాయి. ఆ తరువాత అమ్మ విజయం తెలిసిందే. అసెంబ్లీలో అతిపెద్ద పార్టీగా అవతరించి తమిళనాడు సీఎం కావడమే కాకుండా పార్లమెంటులో అన్నాడీఎంకే మూడో అతిపెద్ద పార్టీగా నిలిచింది. బీజేపీ 282 సీట్లు, కాంగ్రెస్ 44 సీట్లు తరువాత 37 సీట్లు సాధించిన అన్నాడీఎంకేయే మూడో అతిపెద్ద పార్టీ.

ఇప్పుడు కేసీఆర్ కూడా అచ్చంగా అదే స్ట్రాటజీతో వెళ్తున్నారన్న వాదన వినిపిస్తోంది. తెలంగాణ ప్రజల్లో కేసీఆర్ అంటే క్రేజ్ ఉంది. రాష్ట్రాన్ని సాధించిన నేతగా ఆయనపై నమ్మకం ఉంది. అయితే.. నాలుగేళ్ల పాలనలో పరిస్థితులు కొంత మారాయి. కాంగ్రెస్ పుంజుకుంటోంది. వాస్తవాలను గ్రహించిన కేసీఆర్ మరోసారి తన ఇమేజినే అస్త్రంగా మలచుకుంటున్నారు. ప్రధాని పదవిలో కేసీఆర్‌ను ఊహించుకునేలా చేసి మళ్లీ జనాన్ని సమ్మోహితం చేసేందుకే ఈ ఎత్తుగడ వేశారన్న మాట వినిపిస్తోంది.