Begin typing your search above and press return to search.

బాబు నిర్ణయాన్ని కేసీఆర్ ఫాలో అయ్యారు

By:  Tupaki Desk   |   1 Aug 2016 5:12 AM GMT
బాబు నిర్ణయాన్ని కేసీఆర్ ఫాలో అయ్యారు
X
ఈ మధ్యన వాట్సప్ లో ఒక మెసేజ్ పలువురి దృష్టిని ఆకర్షించింది. రెండు తెలుగు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులైన ఇద్దరు చంద్రుళ్ల పేర్లు మాత్రమే కాదు.. వారి పాలన కూడా ఇంచుమించు ఒకేలా ఉంటుందని అందులో ఎలాంటి తేడా లేదంటూ ఉదాహరణలతో కూడిన ఒక పోలికతో ఉన్న పోస్టింగ్ పెట్టారు. ఇది విపరీతంగా షేర్ అయ్యింది. నిజానికి.. రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల నిర్ణయాలు ఇంచుమించు ఒకేలా ఉంటాయని చెప్పాలి. చాలా సందర్భాల్లో కుడి ఎడంగా ఒకేలాంటి నిర్ణయాలు కనిపిస్తాయి.

ఇటీవల సెల్ ఫోన్ల మీద వసూలు చేస్తున్న 14.5 వ్యాట్ ను ఐదు శాతానికి తగ్గిస్తూ కేసీఆర్ సర్కారు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే. ఏపీతో సహా పలు దక్షిణాది రాష్ట్రాలు మొబైల్స్ మీద 5 శాతం పన్ను విధిస్తే.. తెలంగాణ రాష్ట్రం మాత్రం 14.5 శాతం వ్యాట్ ను వసూలు చేస్తున్న పరిస్థితి. ఇలాంటి నిర్ణయంతో తెలంగాణ ప్రభుత్వం ఆదాయాన్ని కోల్పోతుందన్న విషయాన్ని గుర్తించిన కేసీఆర్.. ఎట్టకేలకు పన్ను తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు.

తెలంగాణ రాష్ట్ర ఆదాయాన్ని పెంచేందుకు అవసరమైన మరిన్ని నిర్ణయాలపై కేసీఆర్ దృష్టి పెట్టినట్లుగా కనిపిస్తోంది. పాలనా పరంగంలో ఇప్పటికే జరిగిన తప్పుల్ని సరిదిద్దుకునే కార్యక్రమం మీద దృష్టి పెట్టిన తెలంగాణ ముఖ్యమంత్రి తెలంగాణ రాష్ట్రానికి మరింత ఆదాయాన్ని పెంచే నిర్ణయాల్ని చకచకా తీసుకుంటున్నారు. ఏవియేషన్ రంగానికి ప్రోత్సాహాన్ని కల్పించేలా అప్పుడెప్పుడో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయం తీసుకోవటం తెలిసిందే.

విమానాలకు వినియోగించే ఇంధనంపై వ్యాట్ ను 16 శాతం నుంచి ఒక శాతానికి తగ్గిస్తూ ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో.. పెద్ద ఎత్తున విమానాలు ఏపీకి వెళుతున్న పరిస్థితి. ఫ్యూయల్ ఫిల్లింగ్ కు శంషాబాద్ లో అవకాశం ఉన్నా.. పన్నులో వచ్చే 15 శాతం వ్యత్యాసం నేపథ్యంలో ఏపీ వైపు మొగ్గు చూపే పరిస్థితి. దీని కారణంగా.. ఈ రంగంలో పెద్ద ఎత్తున ఆదాయాన్ని తెలంగాణ ప్రభుత్వం కోల్పోతోంది. ఈ అంశంపై తెలంగాణ ప్రభుత్వ వైఖరి సరిగా లేదంటూ విమర్శలువచ్చినా పట్టించుకోని కేసీఆర్ సర్కారు.. తాజాగా దిద్దుబాటు చర్యల్ని చేపట్టటం తోపాటు.. ఇప్పటివరకూ 16 శాతంగా ఉన్న వ్యాట్ ను ఒక శాతానికి తగ్గిస్తూ నిర్ణయం తీసుకున్నారు. నిజానికి ఈ నిర్ణయాన్ని గతంలోనే తీసుకోవాల్సింది. మరింత కాలం ఎందుకు పట్టించుకోలేదో కేసీఆర్ సర్కారుకే తెలియాలి.