Begin typing your search above and press return to search.

పాల‌న‌లో త‌న గురువును ఫాలో అవుతున్న కేసీఆర్‌..నిజ‌మేనా..!

By:  Tupaki Desk   |   18 Nov 2019 2:30 PM GMT
పాల‌న‌లో త‌న గురువును ఫాలో అవుతున్న కేసీఆర్‌..నిజ‌మేనా..!
X
తెలంగాణలో జ‌రిగిన రెండు ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించిన టీఆర్ ఎస్ అధినేత‌.. త‌న‌దైన శైలిలో రాష్ట్ర ఉద్య‌మాన్ని న‌డిపించారు. త‌నదైన ప్ర‌త్యేక‌మైన హావ భావాల‌తో మాస్‌ ను అమితంగా ఆక‌ట్టుకున్నారు. ఇక‌, త‌న‌కు మాత్ర‌మే చేత‌న‌వుతుందా ? అనే రేంజ్ లో ప్ర‌తిప‌క్షాల‌పై విసిరిన పంచ్‌ లు భారీ ఎత్తున ప్ర‌జ‌ల‌ను ఆక‌ర్షించాయి. దీంతో రాజ‌కీయంగా కేసీఆర్ తిరుగులేని శ‌క్తిగా అవ‌త‌రించార‌నే పేరు తెచ్చుకున్నారు. అయితే, ఉద్య‌మ కాలం నుంచి నేడు పాల‌న వైపు కేసీఆర్ ప‌రుగు పెట్టారు.

ఈ నేప‌థ్యంలో ఆయ‌న అనుస‌రి స్తున్న వైఖ‌రిపై అనేక కోణాల నుంచి విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. గ‌తంలోని ఐదేళ్ల కాలంలో కేసీఆర్ అనుస‌రించిన పంథాకు - ఇప్పుడు రెండో సారి రాష్ట్ర ప‌గ్గాలు చేప‌ట్టి చేస్తున్న పాల‌న‌కు మ‌ధ్య చాలా వైరుధ్యం ఉంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. తొలి ఐదేళ్ల కాలంలో కేసీఆర్‌ లో ఒక‌విధ‌మైన దాన‌గుణం.. జాలి గుణం.. రాష్ట్ర ప్ర‌జ‌ల ప‌ట్ల‌ - స‌మ‌స్య‌ల‌ ప‌ట్ల ఒక‌విధ‌మైన పాజిటివ్ కోణం క‌నిపించాయ‌నేది నిర్వివాదాంశం. అయితే, త‌ర్వాత రెండో సారి అధికారంలో కి వ‌చ్చే స‌రికి పూర్తిగా కేసీఆర్‌ లో ఈ గుణాలన్నీ మ‌టుమాయం అయిపోయాయ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

ముఖ్యంగా కేసీఆర్ పాల‌న‌.. గ‌తంలో త‌న రాజ‌కీయ గురువు చంద్ర‌బాబు పాల‌న‌ను పోలి ఉంద‌ని చెబుతున్నారు. ఆర్టీసీ కార్మికుల స‌మ్మె విష‌యం కానీ.. మ‌రే విష‌య‌మైనా కూడా పూర్తిగా చంద్ర‌బాబు వైఖ‌రినే కేసీఆర్ ఆదేశాలు - పాల‌న కూడా త‌ల‌పిస్తున్నాయ‌ని అంటున్నారు. ఒక్క ఆర్టీసీ విష‌యాన్ని తీసుకుంటే.. కార్మిక సంఘాల‌తో ప‌నిలేద‌ని కేసీఆర్‌ వ్యాఖ్యానించారు. అదే స‌మ‌యంలో ప్రైవేటీక‌ర‌ణ విష‌యంలోనూ వెన‌క్కి త‌గ్గేది లేద‌న్నారు.

ఈ రెండు విష‌యాల్లోనూ గ‌తంలో చంద్ర‌బాబు కూడా ఇదే విధంగా వ్య‌వ‌హ‌రించారు. నాడు చంద్రబాబు కార్మికులకు సంఘాలు ఉండాల్సిన అవసరంలేదన్నారు. ప్రైవేటీక‌ర‌ణ ద్వారానే ఉద్యోగుల్లో బాధ్య‌త పెరుగుతుంద‌ని వాదించిన వ్య‌క్తి కూడా బాబే. అదే స‌మ‌యంలో ప్ర‌తి విష‌యానికీ అధికారుల‌తో గంట‌ల త‌ర‌బ‌డి చ‌ర్చ‌లు జ‌ర‌ప‌డం - విప‌క్షాల‌ను తిట్టడం - లేనిపోని స్వొత్కర్షల‌కు ప్రాధాన్యం ఇవ్వ‌డం - అస‌లు ప్ర‌తిప‌క్షాలు అవ‌స‌ర‌మా? అని చెప్ప‌డం వంటివి గ‌త చంద్ర‌బాబు పాల‌న‌లో అనేక వింత పోకడ‌లు. ఇప్పుడు అచ్చు వీటినే అనుస‌రిస్తున్నారు కేసీఆర్‌..

ఎన్ని ర‌కాలుగా ప్ర‌జ‌లు త‌మ స‌మ‌స్య‌లు చెప్పుకొవాల‌ని భావిస్తే.. అన్ని ర‌కాలుగానే ఆయ‌న అణ‌చివేత ధోర‌ణిలోనే ముందుకు సాగుతున్నారు. దీంతో రాష్ట్రంలో సామాన్యుల నుంచి అసామాన్యుల వ‌ర‌కు కూడా కేసీఆర్ పాల‌న‌కు గ‌త చంద్ర‌బాబు పాల‌న‌కు తేడాలేద‌నే వాద‌న వినిపిస్తోంది. మ‌రి దీనిని టీఆర్ ఎస్ నాయ‌కులు ఎలా చూస్తారో ? చూడాలి.