Begin typing your search above and press return to search.

చంద్రులిద్ద‌రికీ గెలుపే కావాలి!

By:  Tupaki Desk   |   30 Sep 2017 7:55 AM GMT
చంద్రులిద్ద‌రికీ గెలుపే కావాలి!
X
టీడీపీ అధినేత నారా చంద్ర‌బాబునాయుడు - టీఆర్ ఎస్ అధినేత క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావు... ఇద్ద‌రి మైండ్ సెట్ దాదాపుగా ఒక‌టేన‌నే వాద‌న‌కు మ‌రింత‌గా బ‌లం చేకూరుతోంది. ఏపీకి సీఎంగా ఉన్న చంద్ర‌బాబుతో తెలంగాణ సీఎంగా ఉన్న కేసీఆర్‌ కు అస‌లు పోలికే లేద‌న్న వాద‌న అప్పుడెప్పుడో వినిపించింది. పార్టీ నేత‌లు - పార్టీ శ్రేయ‌స్సు కోసం ప‌నిచేసే వారికి న్యాయం చేయ‌డంలో చంద్ర‌బాబు నిర్ద‌యంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని ప్ర‌చారం సాగుతుండ‌గా, కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా వ్య‌వ‌హ‌రిస్తార‌ని, పార్టీ శ్రేయ‌స్సుకు పాటు ప‌డిన ప్ర‌తి ఒక్క‌రినీ గుర్తించి మ‌రీ ప్రాధాన్యం ఇస్తార‌ని కేసీఆర్‌ కు పేరుంది. పార్టీ నిర్వ‌హణ తీరులో భిన్న ధృవాలుగా వ్య‌వ‌హ‌రిస్తున్న వీరిద్ద‌రూ ఎన్నిక‌ల విష‌యానికి వ‌స్తే మాత్రం... ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తార‌ని తాజాగా వెల్ల‌డైంద‌న్న వాద‌న వినిపిస్తోంది. అయినా ఆదిలో ఇద్ద‌రూ టీడీపీలోనే ఉన్నారు క‌దా. ఆ మాత్రం సహ‌చ‌ర్యంతో ఈ మాత్రం వారి వైఖ‌రి ఒకేలా ఉండ‌కుండా ఎలా ఉంటుంద‌న్న వాద‌న కూడా లేక‌పోలేద‌నుకోండి.

అయినా ఎన్నిక‌ల విష‌యంలో ఇద్ద‌రు చంద్రుళ్లు ఒకేలా వ్య‌వ‌హ‌రిస్తార‌న్న విష‌యానికి వ‌స్తే... ఇటీవ‌లే క‌ర్నూలు జిల్లా నంద్యాల అసెంబ్లీ స్థానానికి జ‌రిగిన ఉప ఎన్నిక‌ల్లో విజ‌య‌మే ల‌క్ష్యంగా చంద్ర‌బాబు పావులు క‌దిపారు. త‌న మందీ మార్బ‌లాన్ని దింపేసిన చంద్ర‌బాబు... నంద్యాల ప్ర‌జ‌ల‌కు భారీ ఎత్తున తాయిలాలు ప్ర‌క‌టించారు. వేలాది కోట్ల రూపాయ‌ల అభివృద్ధి ప‌నుల‌కు శ్రీ‌కారం చుట్టిన చంద్ర‌బాబు... ఎన్నిక‌ల‌కు కాస్తంత ముందుగా డ్వాక్రా మ‌హిళ‌ల పొదుపు ఖాతాల్లో రూ.4 వేల చొప్పుల జ‌మ చేసేశారు. అయినా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న డ్వాక్రా మ‌హిళ‌లంద‌రికీ ఈ మేర నిధులు ప్ర‌భుత్వం నుంచి విడుద‌ల కావాల్సి ఉంది. అయితే అన్ని ప్రాంతాల మ‌హిళ‌ల‌ను గాలికొదిలేసిన చంద్ర‌బాబు స‌ర్కారు.. కేవ‌లం నంద్యాల‌కు చెందిన డ్వాక్రా మ‌హిళ‌ల పొదుపు ఖాతాల్లోనే డ‌బ్బు జ‌మ చేశారు. ఈ విష‌యాన్ని రాజ‌మండ్రి మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ ప‌క్కా ఆధారాల‌తో స‌హా ఇటీవలే బ‌య‌ట‌పెట్టేశారు. ఉండ‌వ‌ల్లి ఆధారాల‌తో ఉలిక్కిప‌డ్డ చంద్ర‌బాబు స‌ర్కారు ఇప్పటిదాకా ఈ విష‌యంపై అస‌లు నోరు విప్పే ధైర్య‌మే చేయలేదు. అంటే ఎన్నికల్లో గెలుపే ల‌క్ష్యంగా ముందుకు సాగిన చంద్ర‌బాబు... డ‌బ్బుల‌ను కుమ్మ‌రించేసినట్లు దాదాపుగా ఒప్పేసుకున్నట్లేన‌న్న వాద‌న వినిపిస్తోంది.

నంద్యాల‌లో చంద్ర‌బాబు వ్య‌వ‌హ‌రించిన తీరు మాదిరిగానే ఇప్పుడు కేసీఆర్ కూడా తాయిలాల ప‌ర్వానికి తెర తీశార‌ని చెప్పాలి. ఆ విష‌యం వివ‌రాల్లోకి వెళితే... ఇప్పుడు సింగరేణిలో గుర్తింపు కార్మిక సంఘం ఎన్నిక‌ల‌కు రంగం సిద్ద‌మైపోయింది. అధికార పార్టీ టీఆర్ ఎస్ అనుబంధ కార్మిక సంఘం తెలంగాణ బొగ్గు గ‌ని కార్మిక సంఘం(టీబీజీకేఎస్‌) ప్ర‌స్తుతం అక్క‌డ గుర్తింపు కార్మిక సంఘంగా కొన‌సాగుతోంది. అయితే ఇటీవ‌ల ఈ కార్మిక సంఘం నేత‌ల అవినీతి - టీఆర్ ఎస్ వైపు వీస్తున్న వ్య‌తిరేక ప‌వ‌నాల నేప‌థ్యంలో ఈ కార్మిక సంఘం తాజా ఎన్నిక‌ల్లో గెలిచే ఛాన్సు లేద‌న్న వార్త‌లు వినిపిస్తున్నాయి. దీంతో రంగంలోకి దిగిన కేసీఆర్‌... సింగ‌రేణిలో ఈ ద‌ఫా కూడా టీబీజీకేఎస్ త‌ప్ప‌నిస‌రిగా గెల‌వాల్సిందేన‌ని నిర్ణ‌యించుకున్నారు. ఆ దిశ‌గా ప‌నిచేయాల‌ని కూడా పార్టీ శ్రేణుల‌కు దిశానిర్దేశం చేశారు. ఎంత‌గా ప్ర‌చారం చేసినా... కార్మికుల మదిని దోచేందుకు ఏదో ఒక‌టి చేయాలి క‌దా. అందుకే చంద్ర‌బాబు త‌ర‌హాలోనే కేసీఆర్ కూడా తాయిలాల బాట ప‌ట్టారు.

ఇప్ప‌టికే ద‌స‌రా బోన‌స్‌ ల‌ను కార్మికుల ఖాతాల్లో వేసేసిన కేసీఆర్ స‌ర్కారు... తాజాగా దీపావ‌ళి ఇంకా ఒక నెల ఉండ‌గానే ఆ పండుగ‌కు సంబంధించిన బోన‌స్‌ ల‌ను కూడా కార్మికుల ఖాతాల్లో వేసేసింది. దీనికి అద‌నంగా సంస్థ లాభాల్లో కార్మికుల వాటా మొన్న‌టిదాకా 23 శాతం ఉండ‌గా, దానిని మ‌రో రెండు శాతం పెంచేసి 25 శాతం చేసేశారు. ఈ నిధుల‌ను కూడా నిన్న‌నే కార్మికుల ఖాతాల్లోకి వేసేశార‌ట‌. ఈ మూడు బోన‌స్‌ల‌కు సంబంధించి ఒక్కో కార్మికుడి ఖాతాకు దాదాపుగా లక్ష రూపాయలు జ‌మ అయిన‌ట్లు విశ్వ‌స‌నీయ స‌మాచారం. అయినా ఇందులో త‌ప్పేముందంటారా?... ఏ పండుగ‌కు సంబంధించి ఆ పండుగ స‌మ‌యంలో వేస్తే త‌ప్పు గానీ.. ఎప్పుడో్ నెల త‌ర్వాత వ‌చ్చే పండుగ బోనస్‌ను ఇప్పుడు వేయ‌డంలో ఆంతక్య‌మేమిట‌నేదే ఇప్పుడు పెద్ద ప్ర‌శ్న‌. ఎన్నికలు స‌మీపిస్తున్న నేప‌థ్యంలో మొత్తం మూడు బోన‌స్‌ ల‌ను ఒకేసారి కార్మికుల ఖాతాల్లో వేయ‌డం తాయిలం కాక మ‌రేమ‌వుతుంద‌నేది ఇప్పుడు విశ్లేష‌కుల నోట వినిపిస్తున్న ప్ర‌శ్న‌. అయితే ఇవేవీ ప‌ట్టించుకోని కేసీఆర్‌.. త‌న‌దైన శైలిలో దూసుకుపోతున్నారు. ఎన్నిక‌ల్లో గెలుపే ల‌క్ష్యంగా సాగుతున్న చంద్ర‌బాబు - కేసీఆర్ మ‌ధ్య ఉన్న కొద్దిపాటి తేడా ఏమిట‌న్న విష‌యానికి వ‌స్తే... చంద్రబాబు గుట్టుగా డ్వాక్రా మ‌హిళ‌ల ఖాతాల్లో డ‌బ్బు జ‌మ చేస్తే, కేసీఆర్ మాత్రం బ‌హిరంగంగానే ఆ ప‌ని చేశారు.