Begin typing your search above and press return to search.

ఫెడ‌ర‌ల్ క‌ల క‌రిగిన వేళ సారు ఏం చేస్తున్నారంటే?

By:  Tupaki Desk   |   4 Jun 2019 8:47 AM GMT
ఫెడ‌ర‌ల్ క‌ల క‌రిగిన వేళ సారు ఏం చేస్తున్నారంటే?
X
అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే ఇంకేం ఉంది. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ ఫెడ‌ర‌ల్ ఫ్రంట్ పేరుతో కాస్తంత హ‌డావుడి చేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ ఊసే ఎత్త‌ని విష‌యం తెలిసిందే. ముంద‌స్తు ఎన్నిక‌ల‌తో మొద‌లైన ఎన్నిక‌ల సంద‌డి నేటి వ‌ర‌కూ సాగుతూనే ఉంది తెలంగాణ‌లో. ఒక‌టి త‌ర్వాత ఒక‌టిగా వ‌చ్చిన ఎన్నిక‌లతో.. అవంటేనే విసుగుపుట్టే ప‌రిస్థితి అటు పార్టీల‌కు.. ఇటు నేత‌ల‌కు.

ఇదిలా ఉంటే.. సార్వ‌త్రిక ఎన్నిక‌ల షాక్ నుంచి టీఆర్ ఎస్ అధినేత‌.. తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఇప్పుడిప్పుడే బ‌య‌ట‌కు వ‌స్తున్న‌ట్లు చెబుతున్నారు. లోక్ స‌భ ఎన్నిక‌ల్లో త‌మ బ‌లం త‌గ్గిన వైనంతో ఆయ‌న కంగారు ప‌డిన‌ప్ప‌టికీ.. నిన్న‌టి నిన్న విడుద‌లైన ఎమ్మెల్సీ.. నేడు రిలీజ్ అయిన స్థానిక ఎన్నిక‌ల ఫ‌లితాల‌తో కాస్తంత సంతోషంగా ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

రానున్న రోజుల్లో కేంద్రంలో చ‌క్రం తిప్పే చాన్స్ లేక‌పోవ‌టంతో త‌న వార‌సుడి ప‌ట్టాభిషేక ప్లాన్ ను ప‌క్క‌న పెట్టేసిన‌ట్లుగా తెలుస్తోంది. గ‌డిచిన తొమ్మిది నెల‌లుగా పాల‌న మీద దృష్టి సారించ‌క‌పోవ‌టంతో పెద్ద ఎత్తున ఫైళ్లు పెండింగ్ లో ఉండిపోవ‌టంతో తెలంగాణ‌లో సారు పాల‌న అన్న‌ది లేన‌ట్లుగా మార‌ట‌మే కాదు.. అధికార యంత్రాంగంలో ప‌నితీరు నానాటికి తీసిక‌ట్టుగా మారిన‌ట్లు చెబుతున్నారు.

లోక్ స‌భ ఎన్నిక‌ల త‌ర్వాత కేంద్రంలో చ‌క్రం తిప్పుతాన‌న్న క‌ల‌లు క‌ల్ల‌లు కావ‌టంతో ఇప్పుడు తెలంగాణ రాష్ట్రం మీద మ‌రింత ఫోక‌స్ పెంచాల‌న్న ఆలోచ‌న‌కు కేసీఆర్ వ‌చ్చిన‌ట్లుగా తెలుస్తోంది. ఇందులో భాగంగా పాల‌న మీద దృష్టి పెట్ట‌టంతో పాటు.. జిల్లాల వారీగా రివ్యూలు.. ప‌ర్య‌ట‌న‌ల‌తో అధికారుల్ని ఉరుకులు ప‌రుగులు పెట్టించాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు.

రెవెన్యూ శాఖ‌తో పాటు.. మ‌రికొన్ని ప్ర‌భుత్వ శాఖ‌ల మీద ప్ర‌త్యేకంగా న‌జ‌ర్ పెట్టి కొత్త త‌ర‌హా సంస్క‌ర‌ణ‌ల్ని తీసుకురావాల‌న్న ఆలోచ‌న‌లో కేసీఆర్ ఉన్న‌ట్లు చెబుతుఉన్నారు. సార్వ‌త్రిక ఎన్నిక‌ల వేళ‌.. సారు క‌న్న ఫెడ‌ర‌ల్ క‌ల‌లు మొత్తం క‌రిగిపోయి వాస్త‌వ దృశ్యం ఏమిటో అర్థ‌మైంద‌ని.. తెలంగాణ మీద‌నే త‌న దృష్టిని కేంద్రీక‌రించాల‌న్న కంక్లూజ‌న్ కు కేసీఆర్ సారు వ‌చ్చిన‌ట్లుగా చెబుతున్నారు. దీనికి తోడు ఏపీ ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన జ‌గ‌న్‌.. వేగంగా దూసుకెళుతున్న తీరు కూడా కేసీఆర్ మీద ప్ర‌భావాన్ని చూప‌ట‌మే కాదు.. ఆ స్పీడ్ కు త‌న‌కు నెగిటివ్ గా మార‌కూడ‌ద‌న్న భావ‌న‌తో ఆయ‌న ఉన్న‌ట్లు చెబుతున్నారు.