Begin typing your search above and press return to search.

ఆ విషయంలో కిందామీదా పడుతున్న కేసీఆర్

By:  Tupaki Desk   |   5 Nov 2016 8:20 AM GMT
ఆ విషయంలో కిందామీదా పడుతున్న కేసీఆర్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పెద్ద కష్టమే వచ్చింది. రాజకీయంగా ఆయన తన ప్రత్యర్థులకు షాకులిచ్చే విషయంలో ఆయనకు మించిన మొనగాడు మరొకరు లేరనే చెప్పాలి. రాజకీయ వ్యూహాల విషయంలో కేసీఆర్ ను వంకపెట్టే ఛాన్సే లేదు. కాకుంటే.. సమస్య అంతా కీలకాంశాల విషయంలో ఆయన తీసుకునే నిర్ణయాలు ఆయనకు తలనొప్పులు తెచ్చి పెడుతున్నాయని చెప్పాలి. న్యాయ సంబంధమైన ఉదంతాల విషయంలో ఇప్పటికే పలుమార్లు ఎదురుదెబ్బలు తిన్న కేసీఆర్ చూసినప్పుడు.. రాజకీయాంశాల విషయాల్లో ఇంత సమర్థవంతంగా వ్యవహరించే కేసీఆర్.. కోర్టుల చేతిలో ఎందుకిన్ని ఎదురుదెబ్బలు తినాల్సి వస్తోందన్న సందేహం కలగక మానదు.

ఇప్పటివరకూ ఎదురైన దెబ్బలకు.. మరో మూడు రోజు వ్యవధిలో ఆయనకు ఎదురు కానున్న ఇబ్బంది అస్సలు పోలికే లేదని చెప్పాలి. వివిధ పార్టీల నుంచి ఆపరేషన్ ఆకర్ష్ తో జంపింగ్స్ ను ప్రోత్సహించి పార్టీలోకి తీసుకొచ్చిన ప్రజాప్రతినిధుల విషయంలో సుప్రీంకోర్టుకు సమాధానం చెప్పాల్సిన తరుణం దగ్గర పడిన నేపథ్యంలో.. కింకర్తవ్యం ఏమిటన్నది పెద్దప్రశ్నగా మారిందని చెప్పక తప్పదు.

ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో తెలంగాణ స్పీకర్ సమాధానం చెప్పాల్సిన సమయం మరో మూడు రోజులకు వచ్చేసింది. ఈ అంశంపై దేశ అత్యున్నత న్యాయస్థానానికి ఇవ్వాల్సిన సమాధానాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో కసరత్తు చేస్తున్నట్లుగా చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్ర అడ్వకేట్ జనరల్ రామకృష్ణా రెడ్డి తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఫిరాయింపుల ఇష్యూలో సుప్రీంకు ఏం చెప్పాలన్న అంశంపై వారు చర్చించుకున్నట్లుగా తెలుస్తోంది.

ముఖ్యమంత్రిని ఏజీ కలిసిన సమయంలో వారితోమంత్రి హరీశ్ రావు ఉండటం గమనార్హం. ముఖ్యమంత్రితో భేటీ అయిన ఏజీ.. స్పీకర్ తో కూడా భేటీ అయినట్లుగా చెబుతున్నారు. ఫిరాయింపుల విషయంలో ప్రభుత్వానికి నష్టం వాటిల్లకుండా సమాధానం చెప్పాల్సిన నేపథ్యంలో.. ఏ దిశగా అడుగులు వేస్తే మంచిదన్న విషయం మీద చర్చలు జరిగినట్లుగా చెబుతున్నారు. ప్రభుత్వ ఇమేజ్ డ్యామేజ్ కాకుండా సుప్రీంకు సమాధానం చెప్పాలని డిసైడ్ అయినట్లుగా సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. ఈ అంశం మీద మరికొంత సమయం ఉండేలా వాయిదా కోరే వీలుందని తెలుస్తోంది. అయితే.. దీనిపై సుప్రీం ఎలా రియాక్ట్ అవుతుందన్నది ఇప్పుడు ఉత్కంటగా మారిందని చెప్పక తప్పదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/