Begin typing your search above and press return to search.

ప్రక్షాళన షురూ: కాలేజీల మీద కేసీఆర్ ఫోకస్

By:  Tupaki Desk   |   19 May 2016 5:13 AM GMT
ప్రక్షాళన షురూ: కాలేజీల మీద కేసీఆర్ ఫోకస్
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్టైల్ వేరు. ఆయన ఒక రోజు ఏదైనా అంశం మీద ఫోకస్ పెడితే దాని అంతు చూసే వరకూ నిద్రపోరు. తాజాగా తెలంగాణ రాష్ట్రంలోని విద్యా వ్యవస్థ తీరు మీద దృష్టి పెట్టిన ఆయన.. కొన్ని కాలేజీలు అనుసరిస్తున్న ధోరణి మీద తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేయటమే కాదు.. వాటి మీద కొరడా ఝుళిపించనున్న విషయాన్ని స్పష్టం చేశారు. చిన్నపాటి లోటుపాట్లు ఉంటే ఫర్లేదు కానీ.. కాగితాల్లోనే కాలేజీలు ఉండి.. అధ్యాపకులు.. మౌలిక సదుపాయాలు ఏమీ లేని కాలేజీల్ని చూస్తూ ఊరుకునేది లేదని తేల్చేశారు.

ఈ తరహాలో నిర్వహిస్తున్న కాలేజీలకు సంబంధించి తన దృష్టికి వచ్చిన కాలేజీలపై చర్యలు చేపట్టాలని కేసీఆర్ అధికారులకు స్పష్టం చేశారు. కేవలం ఫీజు రీయింబర్స్ మెంట్ మీద బతికేసే కాలేజీలు తమకు తాము తప్పుకుంటే ఫర్లేదు కానీ.. లేకుంటే కఠిన చర్యలు తప్పవంటూ కేసీఆర్ స్పష్టం చేశారు. కళాశాల కక్కుర్తి మీద కన్నెర్ర చేసిన కేసీఆర్.. కాలేజీలకు సంబంధించిన అన్ని అంశాల్ని ఆన్ లైన్ చేస్తామని చెబుతున్నారు. కేసీఆర్ చెప్పినట్లే కాలేజీల వ్యవహారం మొత్తాన్నిఆన్ లైన్ కు షిఫ్ట్ చేస్తే.. తెలంగాణలో ఇష్టారాజ్యంగా నడుస్తున్న అక్రమ కాలేజీల యవ్వారం ఒక కొలిక్కి రావటం ఖాయమనే చెప్పాలి.

ఇప్పటివరకూ పలు శాఖల మీద దృష్టి సారించిన కేసీఆర్.. విద్యా శాఖ మీద ఆయన పెట్టిన ఫోకస్ కారణంగా విప్లవాత్మక మార్పులు చోటు చేసుకుంటాయన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికికేసీఆర్ అధికారంలోకి వచ్చిన వెంటనే దృష్టి పెట్టిన అంశాల్లో అక్రమ కళాశాలలు ఒకటని చెప్పాలి. అయితే.. ఈ అంశంతో బయటకు కనిపించని ఎన్నో రాజకీయ అంశాలు ఉండటంతో ఒక అడుగు వెనక్కి వేసినట్లుగా వ్యవహరించిన ఆయన.. గడిచిన రెండేళ్లుగా ప్రైవేటు కాలేజీల నిర్వాకాన్ని నిశితంగా పరిశీలిస్తున్నారని చెప్పాలి. ఇప్పుడు పూర్తి అవగాహనతో ప్రక్షాళన కార్యక్రమాన్ని షురూ చేసినట్లు చెప్పక తప్పదు. కేసీఆర్ తాజా ఫోకస్ తో ప్రైవేటు కాలేజీలకు కొత్త కష్టాలు వచ్చినట్లేనని చెప్పక తప్పదు.