Begin typing your search above and press return to search.

లక్కీ నెంబర్ కాకున్నా 31 జిల్లాలకే ఫిక్స్

By:  Tupaki Desk   |   6 Oct 2016 5:15 AM GMT
లక్కీ నెంబర్ కాకున్నా 31 జిల్లాలకే ఫిక్స్
X
నమ్మకాలకు పెద్దపీట వేస్తారన్న పేరున్న తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో తన లక్కీ నెంబర్ ‘‘6’’ ఉండాలని కోరుకోవటం లేదన్న విషయాన్ని తన చేతలతో చెప్పేశారు. కొత్త జిల్లాల్ని ఒకటి తర్వాత ఒకటిగా పెంచుకుపోతూ.. అంతా అయిపోయిందన్న వేళ.. మరో నాలుగు కొత్త జిల్లాల ఏర్పాటుకు పచ్చజెండా ఊపిన వైనం తెలిసిందే. పండగపూట అందరూ హ్యాపీగా ఉండాలని.. పది మందిలో ఎనిమిది మంది పండగ చేసుకుంటుంటే.. ఇద్దరు ఏడుస్తూ ఉండటం నచ్చదని.. అందరికి పండగ్గా మారాలన్న తన ఉద్దేశ్యాన్ని చెబుతూ.. కొత్తగా నాలుగు జిల్లాల్ని తెర మీదకు తీసుకురావటం.. కేసీఆర్ మాటలతో మరిన్ని జిల్లాల డిమాండ్లు తెర మీదకు రావటం తెలిసిందే.

దీనికి తోడు కేసీఆర్ లక్కీ నెంబరు ‘‘6’’ అని.. అందుకు జిల్లాల సంఖ్యను ‘‘31’’ నుంచి ‘‘33’’కు పెంచుతూ నిర్ణయం తీసుకోనున్నారన్న వార్తలు జోరందుకున్నాయి. ఇలాంటి వాదనలకు పుల్ స్టాప్ పెట్టేలా కేసీఆర్ జిల్లాల విషయంలో ఫుల్ క్లారిటీ ఇచ్చేశారు. కొత్తవి 21 జిల్లాలు మాత్రమేనని.. మొత్తంగా 31 జిల్లాల్ని ఫిక్స్ చేసేసినట్లు చెప్పేశారు. గతంలో అనుకున్న 27 జిల్లాలకు కొత్తగా తెరపైకి వచ్చిన నాలుగు జిల్లాలు మినహా.. మరే జిల్లాను ప్రకటించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదన్న విషయాన్ని ఆయన చెప్పేశారు.

కొత్త జిల్లాల ఏర్పాటుకు సంబంధించి ‘‘21’’ జిల్లాలతోనే పనులు చేపట్టాలే తప్ప కొత్తగా తెర మీదకు వచ్చే డిమాండ్లను పట్టించుకోవాల్సిన అవసరం లేదని అధికారులకు కేసీఆర్ స్పష్టం చేశారు. కొత్త జిల్లాలపై తాజాగా హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి తెర మీదకు తెచ్చిన నల్గొండ జిల్లా దేవరకొండ ప్రతిపాదనపై సీఎం కేసీఆర్ సీరియస్ అయినట్లుగా చెబుతున్నారు. దేవరకొండ ప్రతిపాదనను తన దగ్గరకు తీసుకొచ్చిన నాయినిపై కాస్తంత ఆగ్రహాన్ని వ్యక్తం చేసి.. అనంతరం ఆయన్ను అనునయించారని తెలుస్తోంది.

కొత్త జిల్లాలకు సంబంధించి రోజుకో డిమాండ్ తెర మీదకు రావటం.. కొత్త జిల్లాల డిమాండ్ల విషయంలో ముఖ్యమంత్రి కటువుగా వ్యవహరించకుండా.. ఒత్తిడికి తగ్గట్లుగా తన నిర్ణయాన్ని మార్చుకుంటున్న వైనంతో కొంత గందరగోళం చోటు చేసుకోవటంతో పాటు.. మళ్లీ కొత్త జిల్లాల ఏర్పాటుకు సీఎం ఓకే చెబితే చాలా ఇబ్బందన్న అభిప్రాయాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. ఈ వాదన కేసీఆర్ దృష్టికి వెళ్లటం.. పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన.. కొత్త జిల్లాల ఏర్పాటు విషయంలో ఇక మార్పులేమీ ఉండవని.. ఫైనల్ గా చేపట్టాల్సిన పనులు వెంటనే పూర్తి చేయాలని ఆయన ఆదేశించినట్లుగా చెబుతున్నారు. కొత్త జిల్లాలకు సంబంధించిన ఎలాంటి మార్పులు చేర్పులు ఉండవని.. ‘‘31’’ జిల్లాలే ఫైనల్ కానున్నాయన్న విషయాన్ని కేసీఆర్ తన తాజా మాటతో తేల్చేశారు. సో.. తెలంగాణ జిల్లాలు ‘‘31’’గా లాక్ చేసేసినట్లే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/