Begin typing your search above and press return to search.

వాళ్ల‌ని అణిచివేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   29 Dec 2016 6:50 AM GMT
వాళ్ల‌ని అణిచివేస్తామ‌ని చెప్పిన కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ మ‌రోమారు ఉగ్ర‌రూపం దాల్చారు. అసెంబ్లీలో ఆయ‌న మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం పచ్చబడేందుకు తాము రూపకల్పన చేసిన ప్రాజెక్టులకు అసాంఘిక శక్తులు - కొన్ని దిక్కుమాలిన పార్టీలు అడ్డుపడుతున్నాయ‌ని తెలిపారు. అయితే అలాంటి చూస్తూ కూర్చోం.. వాటి పీచమణచి - ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా ముందుకు సాగుతాం’ అని హెచ్చరించారు. భూసేకరణ జరపకుండానే నాగార్జునసాగర్ - శ్రీశైలం - శ్రీరామ్‌ సాగర్ ప్రాజెక్టులను నిర్మించారా? అలాంటప్పుడు మల్లన్నసాగర్ నిర్మాణాన్ని ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రతిపక్షాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

భూసేకరణ బిల్లును శాసనసభలో విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకించడాన్ని కేసీఆర్ తప్పుప‌ట్టారు. కేంద్రం తీసుకొచ్చిన భూసేకరణ చట్టానికి తాము ఒక్కరమే సవరణలు చేసినట్టు చిత్రీకరించవద్దనీ, గుజరాత్ - రాజస్తాన్ సహా ఏడెనిమిది రాష్ట్రాలు సవరణలు చేశాయని ఆయన గుర్తు చేశారు. ‘బహుళార్ధ సాధక ప్రాజెక్టులను నిర్మించినప్పుడు ఎంతో కొంత నష్టం జరగడం సహజం. అంతమాత్రాన ప్రాజెక్టులు చేపట్టకపోతే అభివృద్థి ఎలా సాధ్యమవుతుంది? ప్రపంచంలో అతి పెద్ద కమ్యూనిస్టు దేశమైన చైనాలోనే 35 వేల మెగావాట్ల జల విద్యుత్ ప్రాజెక్టు కోసం 12 లక్షల కుటుంబాలు నిర్వాసితులు కాలేదా? తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమంలో మా టాగ్ లైనే నీళ్లు - నిధులు - నియామకాలు అయినప్పుడు నీటిపారుదల ప్రాజెక్టులు కట్టుకోకుండా ఎలా ఉంటాం? గోదావరి జలాలతో 2018 నాటికి ఉత్తర తెలంగాణ జిల్లాలను తడిపి గోదావరి జిల్లాల మాదిరిగా మార్చడంలో భాగంగా మల్లన్నసాగర్‌ కు రూపకల్పన చేస్తే ఆ ప్రాజెక్టు నీళ్లన్నీ నా ఇంటికే వస్తున్నట్టు, వాటిని నేను ఒక్కణ్నే తాగుతున్నట్టు కొన్ని శక్తులు పనిగట్టుకొని రాద్ధాంతం చేస్తున్నాయి" అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

"మల్లన్నసాగర్ ప్రాజెక్టుకు 70 శాతం మంది రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి తమ భూములు ఇచ్చారు. కానీ కొన్ని పార్టీలు - శక్తులు ఎక్కడి నుంచో వచ్చి స్థానికులను రెచ్చగొట్టి దుబాయిలో ఉన్నవాళ్ల పేరు మీద, లేనోళ్ల (చనిపోయిన) పేర్ల మీద కోర్టులకు వెళ్లి కేసుల మీద కేసులు వేశారు. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్లు రైతులను, స్థానికులను రెచ్చగొడుతుంటే, అలాంటి అసాంఘిక శక్తులను నిరోధించడానికి కర్ఫ్యూ విధించాలని నేనే ఆదేశించాను. సీపీఎం అనే దిక్కుమాలిన పార్టీకి ఒక పాలసీ ఉంది.. ప్రజలను రెచ్చగొట్టడమే వాళ్ల పని. ఆ పార్టీకి గుండు సూది విభాగమనీ, దబ్బనం విభాగమనీ కొన్ని విభాగాలుంటాయి.. వాళ్లు పోలీసులను సూదులతో, దబ్బనాలతో గుచ్చి కాల్పులు జరిపేలా రెచ్చగొట్టడమే వాళ్ల పని. అలాంటి పార్టీలు మల్లన్నసాగర్‌లో ప్రవేశించి పరిస్థితిని కాల్పులవరకు తీసుకెళ్లాలని కుట్ర పన్నినట్టు సమాచారం అందడంతో అక్కడికి బయటివారిని వెళ్లకుండా నిరోధించడానికే పోలీస్ పికెట్ - కర్ఫ్యూ విధించాల్సి వచ్చింది" అని కేసీఆర్ వివరించారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/