Begin typing your search above and press return to search.

ఆ అధికారుల‌పై కేసీఆర్ కు కోపం వ‌చ్చింది

By:  Tupaki Desk   |   5 Oct 2017 5:33 AM GMT
ఆ అధికారుల‌పై కేసీఆర్ కు కోపం వ‌చ్చింది
X
తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ కు కోపం వ‌చ్చింది. ఆయ‌న‌కు వ‌చ్చిన కోపం అలాంటి ఇలాంటిది కాదు. అవ‌స‌ర‌మైతే.. అడ‌వుల సంర‌క్ష‌ణ చేప‌ట్టాల్సిన ఐఎఫ్ఎస్ స‌ర్వీసు అధికారుల్ని సైతం మార్చేసి వేరే వారికి అప్ప‌చెబుదామ‌నే వ‌ర‌కూ వెళ్లింది. ఎందుకిలా జ‌రిగింది? కేసీఆర్‌ కు ఉన్న‌ట్లుండి అంత కోపం ఎందుకు?

ఆయ‌న ఆరోపిస్తున్న‌ట్లుగా ఇటీవ‌ల కాలంలో అట‌వీశాఖాధికారులు వ‌రుస‌గా త‌ప్పులు చేస్తున్నారా? వారి కార‌ణంగా రాష్ట్ర స‌ర్కారుకు చెడ్డ‌పేరువ‌స్తుందా? అన్న‌ది ప్ర‌శ్న‌. ఇంత‌కూ అట‌వీశాఖాధికారుల‌పై కేసీఆర్ ఎందుకు ఫైర్ అయ్యారు? సాత్వికంగా మాట్లాడుతూ.. సూచ‌న‌లు చేసేలా వ్య‌వ‌హ‌రించే సీఎంకు అంత కోపం ఎందుకు వ‌చ్చేసింది? అన్న‌ది చూస్తే ఆస‌క్తిక‌ర ముచ్చ‌ట్లు బ‌య‌ట‌కు వ‌స్తాయి. అధికారుల తీరుపై ఆయ‌న తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌ట‌మే కాదు.. అస‌లేం చేస్తున్నారు? అడ‌వుల సంర‌క్ష‌ణ వ‌దిలేసి త‌లాతోక లేని నిర్ణ‌యాలు తీసుకుంటున్నారే అంటూ క‌డిగిపారేసిన వైనం చూస్తే.. కేసీఆర్ కోపం వెనుక చాలానే లెక్క ఉంద‌న్న విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతుంది.

ఇంత‌కీ అట‌వీశాఖాధికారుల త‌మ ప‌ద్ధ‌తి మార్చుకోకుంటే ఏం చేస్తాన‌ని కేసీఆర్ చెప్పారో చూస్తే.. "ప‌ద్ధ‌తి మార్చుకుంటే స‌రి. లేకుంటే చ‌ర్య‌ల‌కు సైతం వెనుకాడేది లేదు సుమా" అంటూ వార్నింగ్ కూడా ఇచ్చేశారు. అట‌వీశాఖ బాధ్య‌త‌ల్ని త‌న కార్యాల‌యంలోనే ముగ్గురు ఉన్న‌తాధికారుల‌కు ప‌నులు అప్ప‌గించాన‌ని.. అట‌వీశాఖాధికారులు ఏం చేస్తున్నార‌న్న విష‌యాన్ని కేసీఆర్ వెల్ల‌డిస్తూ.. అడ‌వుల్ని సంర‌క్షించ‌టం మానేసి.. ప్ర‌భుత్వ కార్య‌క‌లాపాల‌కే ఆటంకం క‌లిగిస్తున్న వైనాన్ని బ‌య‌టపెట్టి మ‌రీ మండిప‌డ్డారు.

కేసీఆర్ మాన‌స‌పుత్రిక అయిన హ‌రిత‌హారం అనుకున్న‌ట్లుగా జ‌ర‌గ‌టం లేద‌ని.. క్షేత్ర స్థాయికి వెళ్ల‌కుండా ఆఫీసుల్లో కూర్చొంటున్నార‌న్న ఆయ‌న‌.. అవ‌స‌ర‌మైతే ఐఎఫ్ ఎస్ ల నుంచి అట‌వీ సంర‌క్ష‌ణ బాధ్య‌త‌ల్ని త‌ప్పించి.. స‌మ‌ర్థంగా ప‌ని చేసే ఇత‌రుల‌కు ఇస్తామ‌న్న వార్నింగ్ ఇచ్చేశారు. పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ‌ను ఐఏఎస్ అధికారులు ప‌ర్య‌వేక్షించే విధానానికి తెర దించి.. ఐపీఎస్ అధికారికి అప్ప‌జెప్ప‌టం.. కొద్ది నెల‌ల్లోనే ఆ శాఖ ప‌ని తీరులో విశేష‌మైన మార్పు వ‌చ్చిన నేప‌థ్యంలో.. కేసీఆర్ తాజా వ్యాఖ్య చేశార‌ని చెప్పాలి.

ఇటీవ‌ల ప్ర‌భుత్వాన్ని చికాకు పెట్టిన గొత్తికోయ‌ల అంశాన్ని కేసీఆర్ ప్ర‌స్తావించిన‌ట్లుగా తెలుస్తోంది. అట‌వీశాఖ అధికారులు గొత్తికోయ‌ల్ని చెట్ల‌కు క‌ట్టేసి అమానుషంగా వ్య‌వ‌హ‌రించ‌టం.. దీనిపై రాజ‌కీయ పార్టీలు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌టం తెలిసిందే. ఈ ఎపిసోడ్ లో తెలంగాణ అధికార‌ప‌క్షం ఇరుకున ప‌డింది. ఈ అంశాన్ని ప్ర‌స్తావించిన కేసీఆర్‌.. గొత్తికోయ‌ల మీద చ‌ర్య‌ల‌కుపాల్ప‌డింది ఎవ‌రు? చ‌ర్య‌లు తీసుకునే ముందు జిల్లా అధికారులు.. రాష్ట్ర అధికారుల్ని సంప్ర‌దించారా? స‌్థానిక పోలీసుల‌కు కానీ ఇత‌ర అధికారుల‌కు కానీ స‌మాచారం ఇచ్చారా? అంటూ ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన ఆయ‌న‌.. ఆ వివ‌రాల్ని త‌న‌కు ఇవ్వాల‌ని.. బాధ్యుల‌పై చ‌ర్య‌లు తీసుకోవాల్సిందేన‌ని తేల్చేశారు.

సీఎం కేసీఆర్ ఆగ్ర‌హం అట‌వీశాఖలో సంచ‌ల‌నంగా మారింది.మ‌రీ.. ముఖ్యంగా త‌మ‌కు సంబంధం లేని అంశాల మీద దృష్టి పెట్టి త‌లా తోక లేని నివేదిక‌లు ఇస్తున్నారంటూ త‌లంటిన‌ట్లుగా చెబుతున్నారు. గోదావ‌రిపై కాళేశ్వ‌రం స‌మీపంలో నిర్మిస్తున్న అన్నారం బ్యారేజీతో ఎల్ మ‌డుగు మొస‌ళ్ల సంర‌క్ష‌ణ‌కు ముప్పు ఉందుంటూ కేంద్ర ప‌ర్యావ‌ర‌ణ శాఖ‌కు అట‌వీశాఖ స‌మాచారం ఇచ్చింద‌ని చెబుతూ.. దీనిపై తీవ్రంగా స్పందించారు.

అన్నారం బ్యారేజీ నీటి నిల్వ 10 కిలోమీట‌ర్లు విస్త‌రిస్తుంటే.. దానికి 14 కిలోమీట‌ర్ల దూరంలో ఉన్న మొస‌ళ్ల సంర‌క్ష‌ణ కేంద్రానికి ముప్పేంది? అంటూ ప్ర‌శ్నించిన కేసీఆర్‌.. ఇటీవ‌ల కాలంలో కేంద్రానికి పంపుతున్న త‌ప్పుడు నివేదిక‌ల‌పై ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. క‌నీస అవ‌గాహ‌న లేకుండా ఎందుకిలా త‌ప్పుడు నివేదిక‌లు పంపుతున్నారు? అంటూ నిల‌దీసిన‌ట్లుగా తెలుస్తోంది. ప్రాజెక్టుల ప‌నులు ముందుకు సాగ‌కుండా వివిధ ప్రాంతాల్లో అట‌వీ శాఖ లేవ‌నెత్తిన అభ్యంత‌రాల‌న్నీ ఇలానే విచిత్రంగా ఉన్న‌ట్లుగా ఆయ‌న వ్యాఖ్యానించిన‌ట్లుగా చెబుతున్నారు.

శ్రీశైలం పులుల అభ‌యార‌ణ్యంతో ఎస్ ఎల్ బీసీ ట‌న్నెల్‌కు అనుమ‌తులు ఆపుతున్నార‌ని.. హైద‌రాబాద్ న‌డిబొడ్డున ఉన్న కేబీఆర్ పార్కు వైల్డ్ లైఫ్ పార్క్ అంటూ అభ్యంత‌రాలు చెబుతున్నారంటూ ఉదాహ‌ర‌ణ‌ల‌తో వాయించేసిన‌ట్లుగా చెబుతున్నారు. అట‌వీశాఖాధికారుల‌పై గ‌తంలో ఎప్పుడూ లేని రీతిలో ఇంత‌లా విరుచుకుప‌డ‌టం వెనుక అస‌లు కార‌ణం.. ఆయ‌న అనుకున్న ప్రాజెక్టుల‌కు అధికారులు కొర్రీలు పెట్ట‌టం వ‌ల్లేన‌ని చెబుతున్నారు. రాజ‌కీయ నాయ‌కులు విమ‌ర్శ‌ల‌కు ఊతం ఇచ్చేలా ఉన్న నివేదిక‌ల్ని కంట్రోల్ చేస్తే.. మొత్తం సెట్ అవుతుంద‌న్న ఆలోచ‌న‌తోనే కేసీఆర్ అంత‌లా ఫైర్ అయిన‌ట్లుగా స‌మాచారం.