Begin typing your search above and press return to search.

నోరు పాడు చేసుకోనంటూనే కాంగ్రెస్ పై ఫైర్

By:  Tupaki Desk   |   8 Sep 2018 5:55 AM GMT
నోరు పాడు చేసుకోనంటూనే కాంగ్రెస్ పై ఫైర్
X
ఫుల్ గా లోడ్ చేసిన గ‌న్ ఎలా అయితే తూటాల్ని వ‌రుస‌గా పేలుస్తుందో.. ఇంచుమించు అదే విధానాన్ని అనుస‌రించారు కేసీఆర్‌. ముంద‌స్తుకు వెళుతున్న ఆయ‌న‌.. త‌న తొలి ఎన్నిక‌ల స‌భ‌ను హుస్నాబాద్ లో నిర్వ‌హించారు. స‌భ బాధ్య‌త‌ల్ని హ‌రీశ్‌.. ఈటెల‌కు అప్ప‌జెప్పిన కేసీఆర్ న‌మ్మ‌కాన్ని ఏ మాత్రం వ‌మ్ము చేయ‌ని ఇద్ద‌రూ స‌భ‌కు జ‌నాన్ని భారీ ఎత్తున త‌ర‌లించారు. 60వేల టార్గెట్ కాస్తా ల‌క్ష దాటిపోవ‌టంతో గులాబీ బాస్ లో ఉత్సాహం ఉర‌క‌లెత్తేలా చేసింది.

త‌న తొలి స‌భ‌లోనే నోరు పాడుచేసుకోనంటూనే.. కాంగ్రెస్ పై తీవ్ర‌స్థాయిలో మండిప‌డేందుకు కేసీఆర్ ఏ మాత్రం వెనుకాడ‌లేదు. స‌భా ప్రాంగ‌ణం వ‌ద్ద 45 నిమిషాల పాటు ఉన్న కేసీఆర్‌.. స‌భ‌లో ప్ర‌సంగించింది 35 నిమిషాలు మాత్ర‌మే. త‌న‌దైన రీతిలో కాంగ్రెస్‌పై ఫైర్ అయిన ఆయ‌న త‌మ హ‌యాంలో జ‌రిగిన అభివృద్ధిని ఒక‌వైపు చెబుతూనే.. మ‌రోవైపు కాంగ్రెస్ తీరును తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. త‌న ప్ర‌సంగం మొత్తాన్ని కాంగ్రెస్ ను ఏదోలా టార్గెట్ చేస్తూనే ఉండ‌టం గ‌మ‌నార్హం.

కేసీఆర్ ప్ర‌సంగంలోని ముఖ్యాంశాల్ని చూస్తే..

+ తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులకు ఢిల్లీ పేరు తలవగానే లాగులు తడుస్తాయి.

+ పైరవీలు - పదవులు - టికెట్ల కోసం కుక్కతోక లెక్క ఆడించే బతుకులు వాళ్లవి.

+ ఇంకా ఢిల్లీ చక్రవర్తులకు గులాంగిరి చేయడం అవసరమా? ప్రజలను బానిసలుగా మారుస్తారా?

+ పెత్తనాన్ని ఎవరికో ఇస్తారా? ప్రశ్నించిన మాపైనే విమర్శలు చేస్తారా?

+ మీది నోరా!? మోరీనా. ఏం పొడిచారని మాట్లాడుతున్నారు.

+ కాంగ్రెస్‌ నేత జానారెడ్డికి నిజాయితీ ఉంటే గులాబీ కండువా కప్పుకోవాలి.

+ 24 గంటల నిరంతర విద్యుత్తు ఇస్తే గులాబీ కండువా కప్పుకొంటానని నిండు అసెంబ్లీలో జానారెడ్డి ప్రకటించారు.ఆయ‌న త‌న మాట‌ను నిల‌బెట్టుకోవాలి.

+ నిరంతర విద్యుత్తుతోపాటు వ్యవసాయానికి కూడా ఉచితంగా 24 గంటల విద్యుత్తు ఇస్తున్నాం. మా పని మేం చేశాం. ఇక ఆయన పనే మిగిలి ఉంది

+ పంటికి అంటకుండా లంచాలు మింగిన చరిత్ర కాంగ్రెస్ నేత‌ల‌ది.

+ మంత్రి హరీశ్‌, ఎంపీ వినోద్‌, ఎమ్మెల్యే సతీశ్‌ కృషితో పనులు వేగవంతమయ్యాయని, త్వరలోనే 1.60 లక్షల ఎకరాలకు నీళ్లందుతాయి.

+ ప్రాజెక్టుల‌కు నేనే రీ డిజైన్‌ చేశాను. రైతుల శ్రేయస్సు కోసం రీడిజైన్‌ చేయడం కూడా కాంగ్రెస్‌ నేతలకు ఇష్టంలేదు. దీనిని పెద్ద తప్పుగా వాళ్లు విమర్శలు చేస్తున్నారు. వాళ్ల కాలంలో ప్రాజెక్టుల పేరిట, పనుల పేరిట పంటికి కూడా అంటకుండా లంచాలు మింగారు.

+ కాంగ్రెస్‌ పార్టీకి ఓటు వేస్తే అంతా కిందమీదవుతుంది. పైసా పైసా కూడబెడుతూ రాష్ట్రంలో ఉన్న ఆదాయ వనరుల ఆధారంగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు చేశాం. కాంగ్రెస్‌ వాళ్లకు రాష్ట్రాన్ని అప్పగిస్తే ఆగమాగం చేస్తారు.

+ ఎన్నికలు వస్తున్నందున మళ్లీ ఓట్ల కోసం కాంగ్రెస్‌ నేతలు వస్తున్నారు. వెలుగులు నిండిన తెలంగాణను చీకటి చేయడమే తప్ప వాళ్లు ఒరగబెట్టేదేమీ లేదు.

+ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని కించపరిచేలా కాంగ్రెస్ నేత‌లు వ్యవహరిస్తున్నారు. తొలి సభ కావడంతో నోరు పారేసుకోవడం లేదని.. మిగతా సభల్లో దూకుడే ఉంటుంది.

+ టీఆర్ఎస్‌ సర్కారును మరోసారి రెన్యువల్‌ చేసి అధికారాన్ని ఇవ్వాలి. ఎలాంటి ధర్నాలు, దరఖాస్తులు లేకుండానే సంక్షేమ పథకాలు చేపట్టాం.

+ సమైక్యాంధ్ర పాలనలో భయంకరమైన సీన్లు చూసిన తెలంగాణ ప్రజలకు భద్రత, భరోసా కల్పించాం. మరోసారి అవకాశం ఇస్తే తెలంగాణను కోటి ఎకరాల పచ్చని సస్యశ్యామల మాగాణిగా తీర్చిదిద్దుతా.

+ చావు నోట్లో తల పెట్టి రాష్ట్రాన్ని సాధించా. ప్రజలకు ఏంచేయాలో తెలుస. ప్రజల ఆశీర్వాదం మాపై ఉంది. మరోసారి విజయం సాధిస్తామనే ధీమా కనిపిస్తోంది.

+ గత ఎన్నికల సందర్భంలోనూ హుస్నాబాద్‌ నుంచే ప్రచారం మొదలుపెట్టాం. మరోసారి ఇక్కడి ప్రజల దీవెనతోనే విజయం సాధిస్తామ‌న్న న‌మ్మ‌కం ఉంది. అందుకే శ్రావణ శుక్రవారం పూట మంచి రోజు చూసుకొని మీ దర్శనానికి వచ్చా. కేవలం మూడు రోజుల వ్యవధిలోనే పెద్ద సంఖ్యలో ప్రజలు సభకు రావడం గొప్ప విషయం.