Begin typing your search above and press return to search.

బాబు...నీ ప‌ని నీది...నా ప‌ని నాదిః కేసీఆర్‌

By:  Tupaki Desk   |   14 Sep 2017 11:30 PM GMT
బాబు...నీ ప‌ని నీది...నా ప‌ని నాదిః కేసీఆర్‌
X
తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు స‌ఖ్య‌త మ‌రియు శాంతి మంత్రాన్ని జ‌పించారు. ఇరుగుపొరుగు రాష్ర్టాల విష‌యంలో పంచాయ‌తీలు అవ‌స‌రం లేద‌ని కేసీఆర్ తేల్చిచెప్పారు. పొరుగు రాష్ట్ర ముఖ్య‌మంత్రిగా బాబు ఆ రాష్ట్ర ...తెలంగాణ సీఎంగా త‌న ప‌ని తాను చేసుకోవ‌డం ఉత్త‌మ‌మ‌ని ప్ర‌క‌టించారు. ఈ విష‌యాన్ని త‌న రాష్ట్ర మంత్రులు, అధికారుల‌తో సీఎం కేసీఆర్ తెలియ‌జెప్పారు. తెలంగాణ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య ఆర్టీసీ ఆస్తుల పంపకానికి సంబంధించి శుక్రవారం విజయవాడలో సమావేశం జరగనున్న నేపథ్యంలో ఈ సమావేశంలో తెలంగాణ వైఖరిని ఖరారు చేయడానికి గురువారం సన్నాహక సమావేశం జరిగింది.

ఇరుగు పొరుగు రాష్ట్రాలతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగించాలనే తెలంగాణ రాష్ట్ర మౌలిక విధానానికి అనుగుణంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో విభజన సమస్యలను విజ్ఞతతో పరిష్కరించుకుంటామని తెలంగాణ‌ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు ఈ సంద‌ర్భంగా స్పష్టం చేశారు. ‘‘దేశంలో ఇతర రాష్ట్రాలు విడిపోయి కొత్త రాష్ట్రాలు ఏర్పడినప్పుడు ఏ నిబంధనలు అమలు చేశారో, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన సందర్భంగా కూడా అవే పాటించారు. ఏమైనా సమస్యలు తలెత్తితే రెండు రాష్ట్రాలు పరస్పర అంగీకారంతో పరిష్కరించుకోవాలి. అలా సాధ్యం కాని పక్షంలో కేంద్రం జోక్యం చేసుకుంటుంది.`` అని స్ప‌ష్టం చేశారు. అయినా వివాదం పరిష్కారం కాకుంటే ఏం చేయాలనే విషయంలో కూడా సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఇచ్చిందని కేసీఆర్ పేర్కొన్నారు. దేశ అత్యున్నత చట్టసభ అయిన పార్లమెంటు చేసిన విభజన చట్టం మేరకే ఏ వివాదమైనా పరిష్కారం కావాలని ఆయ‌న అన్నారు.

``ఆంధ్రప్రదేశ్ విభజన అనేది ఒక వాస్తవం. ముందు ఈ వాస్తవాన్ని అంతా అంగీకరించాలి. విజ్ఞతతో ఎవరి పాలన వారు చేసుకోవాలి. ఎవరి సంస్థలు వారు నడుపుకోవాలి. తెలంగాణ రాష్ట్రం విభజన నేపథ్యంలోనే ఏపీఎస్ఆర్టీసీ విభజన కూడా జరుగుతుంది. రాష్ట్ర విభజనకు వర్తించిన నిబంధనలే ఆర్టీసీ విభజనకు వర్తిస్తాయి. పార్లమెంటు చేసిన చట్టానికి లోబడే పంపకాలు జరుగుతాయి. ఇందులో బోర్డు చేతిలో ఎలాంటి అధికారం లేదు’’ అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ఇదే వైఖరిని విజయవాడలో జరిగే సమావేశంలో వెల్లడించాలని అధికారులకు సూచించారు.