Begin typing your search above and press return to search.

సీన్‌ రిపీట్‌; బాబు అనేశారు.. కేసీఆర్‌ కడిగేశారు

By:  Tupaki Desk   |   11 Jun 2015 6:06 AM GMT
సీన్‌ రిపీట్‌; బాబు అనేశారు.. కేసీఆర్‌ కడిగేశారు
X
ఒకలాంటి సంఘటనలు రాజకీయాల్లో కాస్తంత అరుదుగానే జరుగుతాయి. కావాలని చేస్తున్నారో.. లేక.. అలా జరిగిపోతుందో కానీ.. తెలంగాణ.. ఏపీ రాష్ట్రాల ముఖ్యమంత్రులైన చంద్రుళ్ల మధ్య మాటల దాడి ఒకే విధంగా సాగటం గమనార్హం.

రెండు రోజుల కిందట మంగళగిరిలో మహాసంకల్ప దీక్ష పేరిట భారీ బహిరంగ సభ జరగటం.. దీన్లో మాట్లాడిన ఏపీ ముఖ్యమంత్రి ఆవేశంతో ఊగిపోవటం.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌పై తీవ్రస్థాయిలో విరుచుకుపడటం తెలిసిందే. దీనికి ప్రతిగా అన్నట్లుగా బాబు మాట్లాడటం పూర్తి అయిన కాసేపటికే.. వరంగల్‌లోఏర్పాటు చేసిన బహిరంగ సభలో బాబును తన పదునైన మాటలతో కడిగిపారేశారు.

మొత్తంగా ఈ ఇరువురు ముఖ్యమంత్రులు బహిరంగంగా ఒకరిని ఒకరు చాలానే మాటలు అనేసుకున్నారు. ఇదిలా ఉంటే.. బుధవారం సైతం ఇదేరీతిలో సీన్‌ రిపీట్‌ కావటం గమనార్హం. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మీడియాను ఉద్దేశించి మొదట మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్‌పై అంతెత్తు ఎగిరిన బాబు.. మధ్యలో ప్రశ్నలు వేసిన జర్నలిస్టులపై కూడా తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఓ దశలో తనను ప్రశ్నించిన జర్నలిస్టును ఉద్దేశించి నీకు సిగ్గుందా అనే పెద్ద మాటను అనేశారు.

ఢిల్లీలో బాబు తాను చెప్పాల్సింది మీడియాకు చెప్పేసిన తర్వాత.. తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ మీడియా ముందుకు వచ్చారు. తన సహజమైన శైలిలో చంద్రబాబును తీవ్రస్థాయిలో కడిగిపారేశారు. మంత్రివర్గ సమావేశం పూర్తయిన తర్వాత.. క్యాబినెట్‌ నిర్ణయాలు చెప్పే క్రమంలో మాట్లాడుతున్న కేసీఆర్‌ మాటలకు అడ్డు తగులుతూ.. చంద్రబాబుకు సంబంధించిన ఒక ప్రశ్నను ఒక విలేకరి సంధించగా..కాస్త ఆగండి.. ఆ విషయం దగ్గరకు వస్తా అంటూ తనదైన శైలిలో వ్యాఖ్యానించి.. తర్వాత బాబు అంశాన్ని ఒక ఐటెమ్‌గా తీసుకొని దుమ్ము దులిపేయటం తెలిసిందే.

ఇలా రెండు రోజుల వ్యవధిలో రెండుసార్లు బాబు మొదట మాట్లాడితే.. చివరగా మాట్లాడిన కేసీఆర్‌.. ''లాస్ట్‌ ఫంచ్‌ మనదైతే ఆ కిక్కు వేరబ్బా'' అన్న రేంజ్‌లో విరుచుకుపడటం విశేషమే.