Begin typing your search above and press return to search.

కేసీఆర్ క్లారిటీ:కేంద్రం డ్రామాలు..ఇక పోరాట‌మే

By:  Tupaki Desk   |   26 Feb 2018 6:26 AM GMT
కేసీఆర్ క్లారిటీ:కేంద్రం డ్రామాలు..ఇక పోరాట‌మే
X
తెలంగాణ ముఖ్య‌మంత్రి, టీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ మ‌రోమారు త‌న వాగ్ధాటి యొక్క‌ విశ్వ‌రూపం ప్ర‌ద‌ర్శించారు. సుదీర్ఘ‌కాలంగా పెండింగ్‌లో ఉన్న‌ జిల్లాల ప‌ర్య‌ట‌న‌కు నేటి నుంచి శ్రీ‌కారం చుట్టిన కేసీఆర్ ఈ రోజు క‌రీంన‌గ‌ర్‌లో ప్ర‌సంగిస్తూ కేంద్ర ప్ర‌భుత్వంపై విరుచుకుప‌డ్డారు. అదే రీతిలో త‌న రాజ‌కీయ ప్ర‌త్య‌ర్థి అయిన కాంగ్రెస్‌పై మండిప‌డ్డారు. రైతును రాజు చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. తెలంగాణ‌ వ్యవసాయానికి సరిపడా భూమి - కరెంట్ ఉంది.. నీళ్లు - ఎరువులు - విత్తనాలు ఉన్నాయని రైతుల సంక్షేమం కోసం తాము ముందుకు సాగుతున్నామ‌ని స్ప‌ష్టం చేశారు.

జాతీయ ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కేంద్రాన్ని ఎన్నోసార్లు కోరామని సీఎం కేసీఆర్ ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. కేంద్రం వైఖరి ఇలాగే ఉంటే దేశంలో రైతుల తిరుగుబాటు వచ్చే పరిస్థితి ఉందన్నారు. కేంద్రం మీద కచ్చితంగా ఒత్తిడి పెంచాలన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో రైతుల పక్షాన పోరాడాలని తమ ఎంపీలను కోరుతున్నానని పేర్కొన్నారు. ఉపాధి హామీ పథకాన్ని వ్యవసాయానికి అనుసంధానం చేయాలని కోరుతూ.. రైతులతో సీఎం ఏకగ్రీవ తీర్మానం చేయించారు. తెలంగాణ వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా.. గోదావరిలో వాటా తేలలేదు అని గుర్తు చేశారు. గోదావరి - కావేరి అనుసంధానం పేరిట కేంద్రం డ్రామాలు ఆడుతుందని సీఎం నిప్పులు చెరిగారు.

తెలంగాణ వస్తే చిమ్మ చీకట్లు అలుముకుంటాయని ఉమ్మడి రాష్ట్రంలో పలువురు అపోహలు కల్పించారని తాము పటాపంచలు చేశామ‌న్నారు. `బీజేపీ అధికారంలో ఉంటే కాంగ్రెస్ ధర్నా.. కాంగ్రెస్ అధికారంలో ఉంటే బీజేపీ ధర్నాలు చేయడం చూస్తూనే ఉన్నాం. టీడీపీ కరెంట్ తేలేదు.. కాంగ్రెస్ కరెంట్ తేలేదు.. కరెంట్ తెచ్చింది గులాబీ జెండానే. జాతీయ పార్టీలైన బీజేపీ - కాంగ్రెస్.. చిల్లర రాజకీయాలు మానుకోవాలి` అని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. రైతాంగాన్ని అన్ని రకాలుగా ఆదుకోవడం పెద్ద కష్టమేమీ కాదన్నారు. కానీ అందరం కలిస్తేనే గమ్యం చేరుకోగలమని చెప్పారు. దేశంలో 40 కోట్ల ఎకరాల భూమి సాగులో ఉందని తెలిపారు. తెలంగాణలో కోటి 60 లక్షల ఎకరాలకు పైగా సాగులో ఉందని వెల్లడించారు. రైతు ఆత్మహత్య చేసుకోవాల్సిన దుస్థితి.. బీజేపీ - కాంగ్రెస్ పార్టీల వల్లే వచ్చిందన్నారు. దేశ రైతులను అర్థం చేసుకోవడంలో బీజేపీ - కాంగ్రెస్ దారుణంగా విఫలమయ్యాయని సీఎం కేసీఆర్ అన్నారు. దేశంలో 70 వేల టీఎంసీల నీరు లభ్యమవుతున్నప్పుడు రైతు రాజు ఎందుకు కాలేదని ప్రశ్నించారు.