Begin typing your search above and press return to search.

కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం.. అంతం కాదు ఆరంభం

By:  Tupaki Desk   |   18 Nov 2021 9:32 AM GMT
కేంద్ర ప్రభుత్వంపై యుద్ధం.. అంతం కాదు ఆరంభం
X
తెలంగాణలో పండిన వరి ధాన్యం కొనుగోలు అంశం రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతోంది. అధికార టీఆర్ఎస్ దీనిపై మరింత దూకుడుగా వెళ్తోంది. ఇప్పటికే ఓ సారి మంత్రులు హైదరాబాద్ ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్ లో ఆందోళన చేశారు. మిగతా మంత్రులు జిల్లాల్లో ఆందోళనల్లో పాల్గొన్నారు. ఇక సీఎం కేసీఆర్ గురువారం ధర్నా చౌక్ లో మహా ధర్నాకు దిగారు. తెలంగాణ ఉద్యమ కారుడిగా ఎన్నో ధర్నాల్లో పాల్గొన్న కేసీఆర్.. సీఎం హోదాలో ధర్నాకు దిగడం ఇదే మొదటిసారి. దీన్నిబట్టే వరి ధాన్యం కొనుగోలు అంశాన్ని టీఆర్ఎస్ ప్రభుత్వం ఏ స్థాయిలో పరిగణిస్తుందో తెలుసుకోవచ్చు. అంతేకాక ఇకపై కేంద్ర ప్రభుత్వంపై యుద్ధమేనని కేసీఆర్ ప్రకటించారు. ఈ ఆందోళన ప్రారంభం మాత్రమేనని స్పష్టం చేశారు. ఇదే సమయంలో కేంద్ర ప్రభుత్వం తెచ్చిన మూడు సాగు చట్టాలపైనా తీవ్రంగా ధ్వజమెత్తారు. సీఎం అయ్యాక తొలిసారిగా ఓ ప్రజా ఆందోళనలో కేసీఆర్.. సాగు చట్టాలపై మాట్లాడడం గమనార్హం.

కొంటారా..? కొనరా? బతకనిస్తారా?

తమ తెలంగాణ రైతుల ప్రశ్న ఒక్కటేనని.. తెలంగాణ ధాన్యం కొంటారా? కొనరా? అని కేంద్ర ప్రభుత్వం చెప్పాలని కేసీఆర్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తమ రైతుల ప్రశ్న సైతం ఇదేనని అన్నారు. కేంద్రం అడ్డగోలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. తెలంగాణలోనే కాదు.. దేశవ్యాప్తంగా రైతులు అరిగోస పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాక, సాగు చట్టాలను వ్యతిరేకిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో ఏడాదిపైగా ధర్నా చేస్తున్న రైతుల గురించి కేసీఆర్ ప్రస్తావించారు. అసలు రైతులను బతకనిస్తారా? లేదా? అని ప్రశ్నించారు. ధాన్యాన్ని కొనబోమని కేంద్రం చెప్పడంతోనే తెలంగాణ రైతులకు వరి వేయొద్దని తాము సూచించినట్లు స్పష్టం చేశారు. తమ ఓపికకూ హద్దు ఉంటుందని, ధాన్యం కొనుగోలు పై స్పష్టత ఇవ్వాలని ప్రధాని మోదీనికి చేతులు జోడించి కోరుతున్నట్టు చెప్పారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులకు తీవ్ర నష్టం

కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో దేశ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని కేసీఆర్ మండిపడ్డారు. ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డాక తెలంగాణ సర్కారు వ్యవసాయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి అనేక చర్యలు తీసుకుందని పేర్కొన్నారు. కానీ, కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలతో తెలంగాణ రైతాంగం తీవ్రంగా నష్టపోతోందని ఆవేదన వ్యక్తం చేశారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న ఉత్తరాద రైతులకు కేసీఆర్ గట్టిగా మద్దతు తెలిపారు. వారి ఉద్యమంలో పాల్గొంటామని ప్రకటించారు.

పునరాలోచించండి.. నల్ల చట్టాలను వెనక్కు తీసుకోండి

కేంద్ర ప్రభుత్వం తమ విధానాలపై పునరాలోచన చేయాలని, సాగు చట్టాలను వెనక్కు తీసుకోవాలని కేసీఆర్ కోరారు. ఇదే సమయంలో మరో కీలక డిమాండ్ కూడా చేశారు. వ్యవసాయ మోటార్లకు మీటర్లు పెట్టాలన్న నిర్ణయాన్ని ఉప సంహరించుకోవాలని కోరారు.

ఏం గుజరాత్ సీఎంగా మోదీ ధర్నా చేయలేదా?

సీఎంగా ఉంటూ ధర్నా చేయడం ఏమిటంటూ వస్తున్న విమర్శలపై కేసీఆర్ అంతే దీటుగా బదులిచ్చారు. ‘‘ఏం గుజరాత్ సీఎంగా ఉన్నప్పుడు 2006లో నరేంద్ర మోదీ ధర్నా చేయలేదా?’’ అని ప్రశ్నించారు. నాడు మోదీ 51 గంటల పాటు ధర్నా చేశారని గుర్తు చేశారు. ‘‘మోదీ అప్పడెలా ఎందుకు చేశారు. అసలు ఇలాంటి పరిస్థితులు తలెత్తకుండా చూసుకోవడం కేంద్ర ప్రభుత్వ బాధ్యత. ’’అని మహా ధర్నాలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.

కేంద్రానికి భయపడతామా?

సాగు చట్టాలపై నిజాలు చెప్పలేక కేంద్రం అడ్డగోలు వాదనలు చేస్తోందని.. దేశ సమస్యలపై పోరాటానికి తెలంగాణ నాయకత్వం వహించాల్సిందేనని కేసీఆర్ అన్నారు. మరో పోరాటం చేయకుంటే దేశానికి విముక్తి ఉండదని వ్యాఖ్యానించారు. సమర్థ నాయకత్వం ఉంటే ఎంతటి సమస్యకైనా పరిష్కారం లభిస్తుందని వ్యాఖ్యానించిన కేసీఆర్.. కేంద్ర భయపెడితే భయపడతామా? అని పేర్కొనడం గమనార్హం.

అసమర్థ పాలనకు చరమగీతం పాడాలి

దేశంలో నాలుగు లక్షల మెగావాట్ల విద్యుత్ ఉంటే.. ఏనాడూ 2 లక్షల మెగావాట్ల కంటే వాడకం ఎక్కువ లేదని సీఎం కేసీఆర్ అన్నారు. ఈ సందర్భంగా అసమర్థ పాలనకు చరమగీతం పాడితేనే దేశానికి విముక్తి వస్తుందన్నారు.