Begin typing your search above and press return to search.

ఆంధ్రా వార్తలొద్దు.. మీడియాకు కేసీఆర్ వార్నింగ్

By:  Tupaki Desk   |   31 Dec 2018 7:21 AM GMT
ఆంధ్రా వార్తలొద్దు.. మీడియాకు కేసీఆర్ వార్నింగ్
X
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఘనవిజయం సాధించాక కేసీఆర్ మరింత దూకుడుగా రెచ్చిపోతున్నారు. కేసీఆర్ లోని ‘డిక్టేటర్’ మరోసారి నిద్రలేచినట్టు కనిపిస్తున్నారు. అఖండ మెజార్టీతో ‘శక్తివంతమైన అవతార్’గా రూపొంది వ్యవస్థలను శాసించాలని చూడడం అందరినీ కలవరపాటుకు గురిచేస్తోంది.

తెలంగాణ ప్రజలు కేసీఆర్ పై ఎంతో నమ్మకంతో గెలిపించారు. వారికి ఇచ్చి హామీల అమలుపై దృష్టిసారించాల్సిన కేసీఆర్ అది మరిచి ప్రత్యర్థులను దెబ్బతీయడం... కాంగ్రెస్ ను విలీనం చేయడం.. తనకు వ్యతిరేకంగా గడిచిన ఎన్నికల్లో మసులుకున్న మీడియాను టార్గెట్ చేయడం చేస్తున్నారు.

తాజాగా తెలంగాణలో ఆంధ్రా వార్తలు ప్రచురించకూడదని తెలంగాణ మీడియా సంస్థలకు కేసీఆర్ నియంతలా హెచ్చరికలు జారీ చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆంధ్రా వార్తలు.. అక్కడి నాయకులకు లోపలి పేజీల్లో ప్రాధాన్యం ఇస్తే ఫరవాలేదని... కానీ తెలంగాణ సంచికల్లో మొదటి పేజీలో ఆంధ్రా నేతల ఫొటోలు, వార్తలు ప్రచురించవద్దని స్పష్టం చేస్తున్నారట..

శనివారం ప్రగతి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో కేసీఆర్ ఇదే విషయాన్ని ప్రస్తావించారు. తాను ఢిల్లీ నుంచి తెలంగాణ వచ్చాక ఉదయం వార్త పత్రికలు చూస్తే ఆంధ్రలో ఉన్నానా..? తెలంగాణలో ఉన్నానో అర్థం కాలేదని.. తెలంగాణలో ఆంధ్రా నేతల వార్తలు, ఫొటోలు ఏంటని నిలదీశారు. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుతోపాటు ఏపీ వార్తలను తెలంగాణ ఎడిషన్లలో మొదటి పేజీలో పెద్దపెద్దగా ప్రచురించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో తెలంగాణ ప్రజలు ఎందుకు ఆంధ్ర వార్తలను చదివాలని ప్రశ్నించారు.

తాజాగా పత్రికలకు అడ్వటైజ్ మెంట్లు ఇచ్చే విషయంపై సమీక్ష నిర్వహించేందుకు కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారట.. ఆంధ్రా వార్తలు, ఆంధ్ర నేతలను ప్రోత్సహించేలా కథనాలు రాస్తున్న పత్రికలకు ప్రభుత్వ ప్రకటనలు ఇవ్వకూడదని.. తెలంగాణ వార్తలు మాత్రమే ప్రచురించే వాటికి ఇవ్వాలని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం. దీనికి సమీక్షించినట్టు కూడా వార్తలొస్తున్నాయి.

కేసీఆర్ గడిచిన ప్రభుత్వ కాలంలో ఆంధ్రా, తెలంగాణ పత్రికా యాజమాన్యాలకు విరివిగా ప్రభుత్వ , పార్టీ ప్రకటనలు ఇచ్చారు. కోట్ల రూపాయలను వాటికి ఆర్థిక ప్రయోజనం కలిగించారు. తెలంగాణ ప్రభుత్వ విజయాలు, సంక్షేమ పథకాలు దేశవ్యాప్తం కావడానికి ఆంధ్రప్రదేశ్ తో పాటు వివిధ రాష్ట్రాల్లో కూడా తన ఘనత చాటేలా ప్రకటనలు గుప్పించారు. ఇందుకోసం కోట్లు ఖర్చు పెట్టారు. కానీ ఇప్పుడు ఈ ఎన్నికల్లో తన ఓటమికి కంకణం కట్టుకొని పనిచేసిన ఆంధ్రా పత్రికలకు ప్రకటనలు ఇవ్వకూడదని కేసీఆర్ డిసైడ్ అయినట్టు సమాచారం.