Begin typing your search above and press return to search.

సరికొత్త పథకానికి కేసీఆర్ తుదిమెరుగులు

By:  Tupaki Desk   |   20 Sep 2020 8:34 AM GMT
సరికొత్త పథకానికి కేసీఆర్ తుదిమెరుగులు
X
ఓపక్క వెంటాడే ఆర్థిక సమస్యలున్నప్పటికీ.. సంక్షేమ పథకాల్ని ఎప్పటికప్పుడు కొత్తగా తీసుకొచ్చేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రయత్నిస్తూనే ఉంటారు. దేశంలో మరెక్కడా అమలు కానీ పలు పథకాల్ని అమలు చేస్తున్న ఆయన.. తాజాగా సన్న బియ్యంతో సామాన్యుల్ని ఫిదా చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లుగా చెబుతున్నారు. ఇందుకు తగ్గట్లు తాజాగా ఒక పథకాన్ని త్వరలోనే ప్రకటిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే ఈ పథకానికి సంబంధించిన తుది మెరుగులు దిద్దటంతో పాటు.. ప్రభుత్వం మీద పడే భారం.. అందుకు వచ్చే మైలేజీ లెక్కల్ని చెక్ చేస్తున్నట్లుగా సమాచారం.

తాను అధికారంలోకి వచ్చిన తర్వాత.. హాస్ట్ లో ఉండే విద్యార్థులకు దొడ్డు బియ్యానికి బదులుగా.. సన్న బియ్యాన్ని వాడేలా నిర్ణయం తీసుకోవటం.. లక్షలాది మంది మనసుల్ని దోచేయటం తెలిసిందే. తాజాగా అదే సన్నబియ్యంతో ఈసారి మరో వినూత్న కార్యక్రమానికి తెర తీయాలని భావిస్తున్నట్లుగా సమాచారం. రేషన్ షాపుల ద్వారా ప్రజలకు ప్రతి నెలా ఇచ్చే రేషన్ బియ్యం.. దొడ్డువి కాకుండా సన్నాలు ఇవ్వాలన్న యోచనలో కేసీఆర్ ఉన్నట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం ఇస్తున్న దొడ్డు బియ్యాన్ని వినియోగిస్తున్న వారు చాలా తక్కువని.. కేజీ రూపాయికి కొనుగోలు చేసే ఈ బియ్యాన్ని నల్ల మార్కెట్లో కిలో పది చొప్పున కొనుగోలు చేస్తున్న వైనాన్ని కేసీఆర్ సీరియస్ గా తీసుకున్నారు. ఇలాంటి పరిస్థితి ఎందుకన్న ప్రశ్నకు.. దొడ్డు బియ్యాన్ని వాడలేకపోవటమేనని తేల్చారు. దీంతో.. ఈ సమస్య పరిష్కారం కోసం.. దొడ్డు బియ్యం స్థానే.. సన్న బియ్యాన్ని అందజేయాలని భావిస్తున్నారు. అదే జరిగితే.. బియ్యాన్ని నల్లబజారులో అమ్మే అవకాశం ఉండదని.. సన్న బియ్యాన్ని అందరూ తినే వీలుంటుందన్న అంచనాకు వచ్చిన కేసీఆర్.. అందుకు తగ్గట్లు కసరత్తు చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

సన్న బియ్యాన్ని పేదలకు ఇవ్వటం ద్వారా.. నెలసరి వారి మీద ఖర్చు తగ్గించే వీలుందని అంటున్నారు. అదే సమయంలో బ్లాక్ మార్కెట్ ను కట్టడి చేసే వీలుంది. ఈ కారణంతోనే సన్న బియ్యాన్ని అందరికి అందేలా కేసీఆర్ తాజా ప్లానింగ్ నడుస్తుందని.. త్వరలోనే ఈ పథకాన్ని ప్రకటిస్తారని చెబుతున్నారు. అదే జరిగితే.. సన్నాలతో పేదలు ఫిదా కావటం ఖాయమని చెప్పక తప్పదు.