Begin typing your search above and press return to search.

శ్యామలకు ఇచ్చిన మాట నిలుపుకొన్న కేసీఆర్

By:  Tupaki Desk   |   20 May 2016 6:33 AM GMT
శ్యామలకు ఇచ్చిన మాట నిలుపుకొన్న కేసీఆర్
X
నటిగా అవకాశాలు లేక ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్న సీనియర్ నటి పావలా శ్యామలను తెలంగాణ సీఎం కేసీఆర్ ఆదుకున్నారు. ఆమెకు నెలకు రూ.10 వేలు పింఛను మంజూరు చేశారు. గతంలో తనను ఆదుకోవాలంటూ కోరిన పావలా శ్యామలకు అప్పట్లో ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ ఈ సహాయం చేయడం విశేషం. కాగా... వృద్ధాప్యం - అనారోగ్యం... మరోవైపు అవకాశాలు లేకపోపవడంతో పావలా శ్యామల పూర్తిగా ఆర్థికంగా దెబ్బతిన్నారు. ఆమె ఆర్థికంగా పడుతున్న ఇబ్బందులపై ఇటీవల కథనాలు వెలువడ్డాయి. అవి ముఖ్యమంత్రి దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించారు. ప్రతి నెలా 10 వేల రూపాయలు పింఛన్ ఇవ్వాలని గతంలో సాంస్కృతిక శాఖకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలో సాంస్కృతిక శాఖ సంచాలకులు మామిడి హరికృష్ణకు ఆ బాధ్యతలను అప్పగించారు. గురువారం హరికృష్ణ మార్చి - ఏప్రిల్ నెలల పింఛన్ పావలా శ్యామలా బ్యాంకు ఖాతాలో వేశారు.

కాగా తెలంగాణ ప్రభుత్వం పింఛను మంజూరు చేయడంతో పావలా శ్యామల కేసీఆర్ కు ధన్యవాదాలు తెలిపారు. ఆయన రుణం తీర్చుకోలేదని వ్యాఖ్యానించారు. తన పట్ల తెలంగాణ సర్కార్ చూపిన చొరవను మరువలేనని, తనలాంటి ఎంతో మంది కళాకారులకు ప్రభుత్వం దారి చూపుతోందని అన్నారు. ఇచ్చిన మాటలను నిలబెట్టుకున్న కేసీఆర్ పై ఆమె ప్రశంసలు కురిపించారు.

కాగా పాతతరం నటులు - అనారోగ్యం బారినపడిన నటులు కొందరు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారు. అలాంటివారిని గుర్తించి ఇలా ఎంతోకొంత సహాయం చేయడమో.. పింఛను రూపంలో నెలనెలా ఆదాయం అందే ఏర్పాటు చేయడమో చేస్తే బాగుంటుందన్న సూచనలు వస్తున్నాయి.