Begin typing your search above and press return to search.

ఆ 12 సీట్ల‌కు టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ఖ‌రారు!

By:  Tupaki Desk   |   1 Nov 2018 7:29 AM GMT
ఆ 12 సీట్ల‌కు టీఆర్ ఎస్ అభ్య‌ర్థులు ఖ‌రారు!
X
తెలంగాణ అసెంబ్లీని ర‌ద్దు చేసిన‌ప్పుడే 105 స్థానాల‌కు త‌మ అభ్య‌ర్థుల‌ను గులాబీ ద‌ళ‌ప‌తి కేసీఆర్ ప్ర‌క‌టించారు. త‌ద్వారా ప్ర‌చారంలో వారు ప్ర‌చారంలో దూసుకుపోయేందుకు వీలు క‌ల్పించారు. ఆ త‌ర్వాత మ‌రో రెండు స్థానాలు మ‌లక్‌ పేట‌లో స‌తీశ్‌ - జ‌హీరాబాద్ నుంచి మాణిక్యం త‌మ పార్టీ త‌ర‌ఫున బ‌రిలో దిగుతార‌ని కూడా ఆప‌ద్ధ‌ర్మ సీఎం ప్ర‌క‌టించారు. ఇక మిగిలి ఉన్న స్థానాలు కేవ‌లం 12. వాటికి అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌డంలో మాత్రం కేసీఆర్ జాగు చేస్తున్నారు.

మ‌హా కూట‌మి అభ్య‌ర్థుల ప్ర‌క‌ట‌న త‌ర్వాతే అక్క‌డ త‌మ క్యాండిడేట్ల‌ను ప్ర‌క‌టించాల‌ని కేసీఆర్ భావిస్తున్నార‌ని.. కాంగ్రెస్‌ - టీడీపీల్లో సీట్లు ద‌క్క‌ని అస‌మ్మ‌తి నేత‌ల‌ను త‌మ పార్టీలోకి లాక్కొని వారిని కారు గుర్తు త‌ర‌ఫున బ‌రిలో దించాల‌ని ఆయ‌న యోచిస్తున్నార‌ని ఇటీవ‌ల ఎన్నెన్నో విశ్లేష‌ణ‌లు వినిపించాయి.

అయితే, అవ‌న్నీ ఉత్తుత్తి ఊహాగానాలేన‌ని తెలుస్తోంది. పెండింగ్‌ లో ఉన్న 12 నియోజ‌క‌వ‌ర్గాల్లో త‌మ పార్టీ నుంచి ఒక‌రి కంటే ఎక్కువ‌మంది బ‌ల‌మైన అభ్య‌ర్థులు టికెట్ ఆశిస్తుండ‌టం వ‌ల్లే కేసీఆర్ అభ్య‌ర్థుల‌ను ప్ర‌క‌టించ‌లేదని తెలుస్తోంది. తాజాగా ఫ్లాష్ సర్వే నిర్వ‌హించిన గులాబీ బాస్ ఆ 12 స్థానాల అభ్య‌ర్థుల‌పై తుది నిర్ణ‌యం తీసుకున్నార‌ని పార్టీవ‌ర్గాల ద్వారా స‌మాచారం అందుతోంది. అధికారికంగా ప్ర‌క‌టించ‌క‌పోయినా.. ప్ర‌చార ప‌నులు చూసుకోవాలంటే ఆ 12 మంది అభ్య‌ర్థుల‌కు కేసీఆర్ నుంచి స్ప‌ష్ట‌మైన ఆదేశాలు వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది.

* ఖైర‌తాబాద్ నుంచి దానం నాగేంద‌ర్‌ - గ‌త ఎన్నిక‌ల్లో పోటీ చేసి ఓడిన మ‌న్నె గోవ‌ర్ధ‌న్ రెడ్డి - పీజేఆర్ కుమార్తె విజ‌యారెడ్డి టీఆర్ ఎస్ టికెట్ ఆశిస్తున్నారు. వీరిలో దానం వైపే కేసీఆర్ మొగ్గు చూపుతున్నార‌ని తెలిసింది.

* మ‌ల్కాజ్‌ గిరి టికెట్‌ ను త‌న కోడ‌లు విజ‌య‌శాంతికి ఇవ్వాల‌ని తాజా మాజీ ఎమ్మెల్యే చింత‌ల క‌న‌కారెడ్డి కేసీఆర్‌ ను కోరుతున్నారు. అయితే, ఆ సీటును పార్టీ గ్రేట‌ర్ హైద‌రాబాద్ అధ్య‌క్షుడు మైనంప‌ల్లి హ‌న్మంత‌రావుకు ఫైన‌ల్ చేసిన‌ట్లు తెలుస్తోంది.

* గోషామ‌హ‌ల్ నుంచి మూసీన‌ది అభివృద్ధ కార్పొరేష‌న్ ఛైర్మ‌న్ ప్రేమ్‌ సింగ్ రాథోడ్ పేరు ఖాయ‌మైన‌ట్లు స‌మాచారం.

* మేడ్చ‌ల్ నుంచి తాజా మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మ‌రోసారి టికెట్ ఆశిస్తున్నా.. ఆ టికెట్‌ ను ఎంపీ మ‌ల్లారెడ్డి పోటీ చేసేందుకు కేసీఆర్ గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చార‌ని విశ్వ‌స‌నీయ‌వ‌ర్గాలు చెబుతున్నాయి.

* హుజుర్‌ న‌గ‌ర్ సీటును అమ‌ర‌వీరుడు శ్రీ‌కాంతాచారి త‌ల్లి ఆశిస్తున్నా.. ఎన్నారైలు సైదిరెడ్డి అప్పిరెడ్డిల్లో ఎవ‌రో ఒక‌రికి సీటు ద‌క్క‌నున్న‌ట్లు తెలుస్తోంది.

* ఇక చొప్ప‌దండి నుంచి టీఆర్ ఎస్ రాష్ట్ర ఎస్సీ సెల్ నేత సుంకె ర‌విశంక‌ర్ - వ‌రంగ‌ల్ తూర్పు స్థానంలో వ‌రంగ‌ల్ మేయ‌ర్ న‌న్న‌ప‌నేని న‌రేంద‌ర్ - కోదాడ - శ‌శిధ‌ర్ రెడ్డి బ‌రిలో దిగ‌డం దాదాపు ఖాయ‌మే. మిగిలిన స్థానాలు హైద‌రాబాద్‌ పాతబ‌స్తీ ప‌రిధిలో ఉండ‌టంతో అభ్య‌ర్థుల ఎంపిక‌పై కేసీఆర్ పెద్ద‌గా క‌స‌ర‌త్తు చేయ‌డం లేద‌ని తెలిసింది.