Begin typing your search above and press return to search.

గవర్నర్ పై కేసీఆర్ పోరాటం.. ఇదో దేశవ్యాప్త సంచలనం

By:  Tupaki Desk   |   30 Jan 2023 10:37 AM GMT
గవర్నర్ పై కేసీఆర్ పోరాటం.. ఇదో దేశవ్యాప్త సంచలనం
X
రిపబ్లిక్ టీవీకి ఎక్కి తెలంగాణ పరువును జాతీయస్థాయిలో తీసేసిన గవర్నర్ తమిళిసైని ఊరికే వదిలిపెట్టవద్దని తెలంగాణ ప్రభుత్వం డిసైడ్ అయ్యింది.ఈ మేరకు సీఎం కేసీఆర్ ఢిల్లీ నుంచి ప్రముఖ న్యాయవాది దుశ్యంత్ దవేను రంగంలోకి దింపారు. ఆయన న్యాయసలహాతో సంచలన అడుగులు వేస్తున్నట్టు బీఆర్ఎస్ నుంచి గుసగుసలు వినిపిస్తున్నాయి.

గవర్నర్ తో న్యాయపోరాటం చేయాలని కేసీఆర్ డిసైడ్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే బడ్జెట్ ను గవర్నర్ కు పంపి ఆమోదించమని కోరింది. ఫిబ్రవరి తొలి వారంలో అసెంబ్లీ బడ్జెట్ కు ఏర్పాట్లు చేస్తోంది. గవర్నర్ ఆమోదం తర్వాతనే సభలో ప్రవేశపెట్టాలి. దీంతో పాతపగలన్నీ మనసులో పెట్టుకున్న తమిళిసై అస్సలు ఆమోదించడం లేదు. స్పందించడం లేదు.

వచ్చే ఆర్థిక సంవత్సర (2023-24) బడ్జెట్‌ను శాసనసభ, మండలిలో శుక్రవారం ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు చేస్తుండగా... దానికి రాష్ట్ర గవర్నర్‌ తమిళిసై ఇంకా ఆమోదం తెలపకపోవడంతో అధికార వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.

మరో నాలుగు రోజులే సమయం ఉండటంతో దీనిపై సోమవారం హైకోర్టును ఆశ్రయించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ వేయనుంది. ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది దుష్యంత్‌ దవే వాదనలు వినిపించనున్నారు.

గవర్నర్‌ సమ్మతి తర్వాతే బడ్జెట్‌ను మంత్రిమండలి ఆమోదిస్తుంది. అనంతరం శాసనసభ, మండలిలో ప్రవేశపెడతారు. ముసాయిదా బడ్జెట్‌ ప్రతులను మూడురోజుల క్రితమే ప్రభుత్వం గవర్నర్‌ కార్యాలయానికి పంపించింది. ఇప్పటి వరకు గవర్నర్‌ ఆమోదం తెలపలేదని ప్రభుత్వ వర్గాలు చెప్పాయి.

ఇప్పటివరకూ ఏ ప్రభుత్వం కూడా రాజ్యాంగాధినేత అయిన గవర్నర్ పై ఇలా న్యాయపోరాటానికి వెళ్లింది లేదు. దీంతో కేసీఆర్ వెళితే అది దేశవ్యాప్తంగా సంచలనం అవుతుంది. ప్రజా ప్రభుత్వాన్ని గవర్నర్ నియంత్రిస్తున్నారన్న ప్రచారం దేశమంతా సాగుతుంది. అది బీజేపీ పరువుకే ఎసరు వచ్చే ప్రమాదం ఉంది. కేసీఆర్ అడుగులు సంచలనంగా మారడం ఖాయమని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.