Begin typing your search above and press return to search.

రాముడు.. ధర్మరాజు.. కేసీఆర్..?

By:  Tupaki Desk   |   28 Dec 2015 3:59 AM GMT
రాముడు.. ధర్మరాజు..  కేసీఆర్..?
X
అయుత చండీయాగం ఫలం సంగతి తర్వాత.. ఈ యాగాన్ని నిర్వర్తించిన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారీగా ప్రశంసల్ని పొందారనే చెప్పాలి. ఎంత పెద్ద కార్యక్రమాన్ని నిర్వహించినా దొరకని రీతిలోప్రశంసలు.. రుత్వికుల నోట.. బ్రాహ్మణోత్తముల నోట వినిపించటం విశేషం. మిగిలిన వారు పొగడటానికి.. బ్రాహ్మణోత్తములు పొగిడే పొగడ్తలు కాస్త భిన్నంగా ఉంటాయి.

అయుత చండీయాగాన్ని సంపూర్ణం అయిన నేపథ్యంలో కేసీఆర్ మాట్లాడటం.. అనంతరం కొందరు ప్రముఖులు మాట్లాడటం జరిగింది. మిగిలిన వారి సంగతి పక్కన పెడితే.. సహస్త్రావధాని మాడుగుల నాగఫణి శర్మ చేసిన వ్యాఖ్యలు పలువురిని ఆకర్షించాయి. మరికొందరిని విస్మయానికి గురి చేశాయి. తన మాటల క్రమంలో ఆయన పోల్చిన పోలికే దీనికి కారణంగా చెప్పాలి. ‘‘రాముడు అశ్వమేథ యాగం.. ధర్మరాజు రాజసూయ యాగం.. ఇప్పుడు ఆ స్థాయిలో కేసీఆర్ అయుత చండీమహా యాగం నిర్వహించారు. యాగం సంపూర్ణమైంది. శాస్త్రోక్తంగా జరిగింది’’ అంటూ ప్రశంసల జల్లును కురిపించారు.

ఎన్ని పనులు చేస్తే మాత్రం ఇలాంటి పొగడ్తలు లభిస్తాయ. కేసీఆర్ చేసిన ఒక్క యాగంతో ఆయన్ను రాముడు.. ధర్మరాజు సరసన చేర్చేయటం కాస్తంత విస్మయాన్ని రేకెత్తించేదే. ఏది ఏమైనా చండీయాగం కేసీఆర్ ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.

ఇక.. యాగంలో విశేష సేవలు అందించిన పలువురు బ్రాహ్మణోత్తములను కేసీఆర్ ఘనంగా సత్కరించారు. కుప్పా గాల వాజపేయయాజులు.. నరహరి సుబ్రహ్మణ్య భట్టు.. టీవీ శివకుమార్.. కుప్పా శివసుబ్రమణ్యం.. ఇలా చెప్పుకుంటూ పోతే చాలామందే ఉన్నారు. మొత్తం 23 మందిని ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనంగా సత్కరించారు. వారి చేతికి బంగారు కంకణాన్ని స్వయంగా తొడగటం.. తెల్ల కవరుతో మొత్తాన్ని (ఎంతన్నది బయటపెట్టలేదు. కాకపోతే కవర్ సైజు మాత్రం భారీగా ఉంది).. పండ్లు.. శాలువాను కప్పి సత్కరించారు. ఇంతమందిని భారీగా సన్మానించటం రుత్వికుల్ని విపరీతంగా ఆకట్టుకుంది.