Begin typing your search above and press return to search.

ఢిల్లీ సీఎంకు షాక్‌..కేసీఆర్‌ లో క‌ల‌వ‌రం

By:  Tupaki Desk   |   19 Jan 2018 11:30 PM GMT
ఢిల్లీ సీఎంకు  షాక్‌..కేసీఆర్‌ లో క‌ల‌వ‌రం
X
ఔను. దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో జ‌రిగిన నిర్ణ‌యం తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్‌ ను క‌ల‌వర పాటుకు గురిచేస్తోంది. పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేసిన 20 మంది ఆప్ ఎమ్మెల్యేలను ఎన్నికల సంఘం అనర్హులుగా తేల్చడం తెలిసిందే. ఆమ్ ఆద్మీ పార్టీకి షాకిచ్చిన ఈసీ నిర్ణయం తెలంగాణ సర్కార్‌ ను షేక్ చేస్తోందని అంటున్నారు. గతంలో పార్లమెంటరీ సెక్రటరీలుగా చేసిన తమ పార్టీ ఎమ్మెల్యేల‌కు అనర్హత వర్తిస్తుందోమోనన్న ఆందోళనలో ఉంది.

తెలంగాణ ప్రభుత్వం 2014 డిసెంబర్ 12న జీవో 173 ద్వారా ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించింది. టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేలు వినయ్ భాస్కర్ - జలగం వెంకట్రావు - శ్రీనివాస్ గౌడ్ - గాదరి కిశోర్ - సతీష్ - కోవలక్ష్మి భాద్యతలు స్వీకరించి సహాయ మంత్రి హోదా క్యాబినెట్ ర్యాంక్ అనుభవించారు. అయితే రాజ్యాంగంలోని ఆర్టికల్ 164 (1ఏ) ప్రకారం శాసనసభ్యుల్లో 15 శాతానికి మించి మంత్రివర్గంలోకి తీసుకోరాదని స్పష్టం చేస్తోంది. దీనిపైనే ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి - అప్పుడు కాంగ్రెస్‌ లో ఉన్న ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పార్లమెంటరీ సెక్రటరీల నియామకం రాజ్యాంగవిరుద్దమని వాదించారు. దీంతో 2015, మే 2న నియామక జీవోను హైకోర్టు కొట్టివేసింది. ఆ రోజు నుంచి ఆరుగురు ఎమ్మెల్యులుగా కంటిన్యూ అవుతున్నారు. ఆప్ ఎమ్మెల్యేలను అనర్హలుగా చేయవచ్చంటూ ఎన్నికల కమిషన్ రాష్ట్రపతికి సిఫారస్ చేయడంతో తెలంగాణలో చర్చనీయాంశమైంది.

కేసీఆర్ ప్రభుత్వంలో గతంలో పార్లమెంటరీ సెక్రటరీలుగా పనిచేసిన ఎమ్మెల్యేలకు అనర్హత వర్తిస్తుందా అనేదానిపై చర్చ జరుగుతోంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఈసిని అప్రోచ్ అయ్యేందుకు సిద్ధమవుతోంది. న్యాయనిపుణులతో సంప్రదింపులు జరుపుతోంది. పనిచేసిన కాలానికి ఆఫీస్ ఆఫ్ ప్రావిట్ వర్తిస్తోందంటూ 20 మంది ఆప్ ఎమ్మెల్యేలపై ఈసీ వేటు వేయడాన్ని కాంగ్రెస్ పరిశీలిస్తోంది. ఆప్ ఎమ్మెల్యేలకు వర్తించింది ఖచ్చితంగా తెలంగాణ ఎమ్మెల్యేలకు వర్తిస్తోందని వారు విశ్వసిస్తున్నారు.

మ‌రోవైపు ఆప్ సర్కార్ ను అయోమయంలో పడేసిన ఈసీ నిర్ణయం గులాబీ పార్టీలోనూ గుబులు రేపుతోంది. ఈ ప‌రిణామం కార‌ణంగా ఆరుగురు టీఆర్ ఎస్‌ ఎమ్మెల్యేల్లో టెన్షన్ పెరుగుతోంది. దీంతో ఎన్నికల సంఘం నిర్ణయాన్ని అధికార పార్టీ నేతలు కూడా పరిశీలిస్తున్నారు.