Begin typing your search above and press return to search.

కేసీఆర్ రాజకీయం..చంద్రబాబుకే తలపోటు!

By:  Tupaki Desk   |   14 May 2019 5:31 AM GMT
కేసీఆర్ రాజకీయం..చంద్రబాబుకే తలపోటు!
X
అవతల ఢిల్లీలోనేమో చంద్రబాబు నాయుడు మాటకు విలువ పడిపోతున్న దాఖలాలు కనిపిస్తూ ఉన్నాయి. ఎన్నికల ఫలితాలకు ముందే బీజేపీ వ్యతిరేక పక్షాలు అన్నీ సమావేశం అవుతాయని - ప్రధానమంత్రి అభ్యర్ఢిని డిసైడ్ చేస్తాయని చంద్రబాబు నాయుడు ప్రకటించారు ఇప్పటికే. అయితే ఆ సమావేశం జరిగే అవకాశాలు ఇప్పుడు కనిపించడం లేదు. ఫలితాలు వెల్లడి అయ్యాకే అలాంటి సమావేశాలు అంటూ మమతా బెనర్జీ - మాయావతి వంటి వాళ్లు స్పష్టం చేశారట. ఫలితాలు వెల్లడి అయితే రాజెవరో రౌతు ఎవరో తెలుస్తుంది. అప్పుడు ఎవరు మాట్లాడటమూ ఉండదు. వారికి వచ్చే సీట్లే వాళ్ల పవర్ ఏమిటో తేల్చి చెబుతాయి.

దీంతో సీట్ల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఢిల్లీలో అన్ని పార్టీలతో టచ్లో ఉన్న నేతగా.. చక్రం తిప్పాలన్న చంద్రబాబు నాయుడి పథకం పారేలా లేదని విశ్లేషకులు అంటున్నారు.

ఆ సంగతలా ఉంటే.. కేసీఆర్ రాజకీయం చంద్రబాబు నాయుడుకు కొత్త తలపోటుగా మారిందనే అభిప్రాయాలూ వినిపిస్తున్నాయి. దక్షిణాదిన బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితోనూ యాక్సెస్ సంపాదిస్తున్నాడు కేసీఆర్. ఆఖరి కాంగ్రెస్ పార్టీకి దోస్తులుగా ఉన్న వాళ్లతో కూడా కేసీఆర్ సఖ్యత మొదలైంది!

కర్ణాటకలో కాంగ్రెస్ తో కలిసి ప్రభుత్వాన్ని నడుపుతున్న జేడీఎస్ వాళ్లు ఇప్పటికే కేసీఆర్ తో సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తూ ఉన్నారు. జేడీఎస్ వాళ్లకు తనే మార్గదర్శకుడిని అన్నట్టుగా చంద్రబాబు నాయుడు కలరింగ్ ఇస్తూ ఉంటారు. అయితే వాళ్లేమో ఇప్పుడు కేసీఆర్ కు సన్నిహితులు అయిపోయారు!

ఇక తమిళనాట డీఎంకే కోసం చంద్రబాబు నాయుడు ప్రచారం కూడా చేసి వచ్చారు. అయితే ఇప్పుడు డీఎంకే వాళ్ల దగ్గర కూడా కేసీఆర్ మాట మొదలైంది. మొదట క్యాన్సిల్ అయ్యిందనుకున్న స్టాలిన్- కేసీఆర్ ల సమావేశం జరిగింది. ఫలితాల తర్వాత ఉమ్మడిగా అడుగు వేసే ప్రతిపాదన స్టాలిన్ వద్ద పెట్టాడట కేసీఆర్. ఈ ప్రతిపాదనకు స్టాలిన్ ఒప్పుకున్నాడా లేదా అనేది వేరే కథ.

అయితే చంద్రబాబు నాయుడు తనే బీజేపీ వ్యతిరేక పార్టీలన్నింటితోనూ చర్చలు జరిపి వారిని ఒక వేదిక మీదకు తీసుకొచ్చినట్టుగా ప్రచారం చేసుకొంటున్న తరుణంలో.. వారందరితోనూ చర్చల ద్వారా చంద్రబాబుకు కేసీఆర్ కొత్త తలనొప్పిని తెస్తున్నట్టుగా ఉన్నాడని విశ్లేషకులు అంటున్నారు.