Begin typing your search above and press return to search.

ఎర్రగడ్డ.. జింఖానా అయిపోయాయి.. ఇక శిల్పారామం?

By:  Tupaki Desk   |   7 July 2015 5:29 AM GMT
ఎర్రగడ్డ.. జింఖానా అయిపోయాయి.. ఇక శిల్పారామం?
X
తెలంగాణరాష్ట్ర ముఖ్యమంత్రి మహా మొండి మనిషి. ఆ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఏ సందర్భంలోనైనా తనకు సంబంధించిన విషయాన్ని మాయ చేయటానికి ఏ మాత్రం ప్రయత్నించరు. పట్టు వదలని విక్రమార్కుడి మాదిరి ఆయన ఎన్ని ఎదురుదెబ్బలు తగిలినా తన ప్రయత్నాల్ని మాత్రం ఆపరు.

మనసులో ఒకసారి ఫిక్స్‌ అయితే.. దాన్ని ఏదోలా తాను అనుకున్నది సాధించాలన్న అత్రుత కేసీఆర్‌లో స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం ఉన్న సచివాలయాన్ని విడిచి పెట్టేసి.. తన మార్క్‌ ఉన్న సెక్రటేరియట్‌ కొత్తగా నిర్మించాలని.. ఆ ప్రాంగణంలో కొత్త సెక్రటేరియట్‌.. శాసనసభ భవనాలు.. ఆడ్మినిస్ట్రేషన్‌ బిల్డింగ్‌లతో పాటు.. ఉద్యోగుల క్వార్టర్లు ఏర్పాటు చేయాలని ఆయన ఆలోచన.

ఇందుకోసం ఆయన మొదట ఎర్రగడ్డలోని మానసిక చికిత్సాలయ ప్రాంగణాన్ని ఎంచుకున్నారు. దానికి ఏవియేషన్‌ శాఖ మొదలు.. ప్రజాప్రతినిధుల వరకూ అందరూ వ్యతిరేకించారు. కోర్టు సైతం ప్రతికూలంగా స్పందించే అవకాశం ఉండటంతో ఆ ఆలోచనను.. సికింద్రాబాద్‌లోని జింఖానా గ్రౌండ్‌లో ఏర్పాటు చేయాలని భావించారు. దీనికి కేంద్రం అనుమతించలేదు.

అయినప్పటికీ తన ప్రయత్నాల్ని ఆపని కేసీఆర్‌.. తాజాగా మాదాపూర్‌లోని శిల్పారామం వెనుక ఉన్న 60 ఎకరాల మీద దృష్టి సారిస్తున్నట్లు చెబుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే కసరత్తు మొదలైందని.. ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని చెబుతున్నారు. మొత్తానికి సెక్రటేరియట్‌ను మార్చేందుకు మాత్రం భారీగా ప్రయత్నాలు చేస్తున్న కేసీఆర్‌.. ఎందుకంత ఆసక్తి ప్రదర్శిస్తున్నారో ఒక పట్టాన అర్థం కాని పరిస్థితి. ఇప్పటికే.. ట్రాఫిక్‌ ఇబ్బందులు ఎదుర్కొంటున్న హైటెక్‌ సిటీ.. ఒకవేళ సచివాలయం లాంటి భవనాలు అక్కడే నిర్మిస్తే.. రానున్న రోజుల్లో హైటెక్‌ సిటీ ట్రాఫిక్‌ జాంలు మరింత పెరిగేపోయే ప్రమాదం ఉందన్న భావన వ్యక్తమవుతోంది.