Begin typing your search above and press return to search.

బడ్జెట్ పేరుతో మోడీ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పేసిన కేసీఆర్

By:  Tupaki Desk   |   9 Sep 2019 2:30 PM GMT
బడ్జెట్ పేరుతో మోడీ ఫెయిల్యూర్ స్టోరీ చెప్పేసిన కేసీఆర్
X
రాజకీయ ప్రత్యర్థుల్ని తన వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి చేసే అలవాటు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు అలవాటు. అలాంటి ఆయనకు అందుకు భిన్నమైన అనుభవం గడిచిన రెండు నెలలుగా చోటు చేసుకోవటం తెలిసిందే. అదే పనిగా తనను చిరాకు పుట్టిస్తున్న కేంద్రం మీద ఆయన ఎలాంటి వ్యాఖ్యలు చేయకుండా గమ్మున ఉన్న కేసీఆర్.. తాజాగా తనకు వచ్చిన అవకాశాన్ని ఏ మాత్రం వదలుకోలేదు. తాజాగా తెలంగాణ బడ్జెట్ ను అసెంబ్లీలో ప్రవేశ పెట్టిన సందర్భంగా ఆయన ప్రసంగంలో ప్రస్తావించిన అంశాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి.

కేంద్రంలోని మోడీ సర్కారు తీసుకుంటున్న నిర్ణయాలు.. అనుసరిస్తున్న విధానాలతో దేశంలో మాంద్యం పరిస్థితులు నెలకొన్నాయని చెప్పటమే కాదు.. కేంద్రం కారణంగా రాష్ట్రాలు కూడా అలాంటి పరిస్థితులు తప్పవని.. ఇందుకు తెలంగాణ రాష్ట్రం మినహాయింపు కాదన్న మాటను చెప్పుకొచ్చారు.

గడిచిన రెండు నెలలుగా మాత్రమే వినిపిస్తున్న ఆర్థిక మాంద్యం మాటను కేసీఆర్ తనకు అనుకూలంగా మలుచుకోవటంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ లో చూపించిన ఆర్థిక లోటు నొప్పి తెలీకుండా.. అందుకు కారణాలన్ని మాంద్యం ఖాతాలోకి వేసేసిన ఆయన.. గడిచిన ఏడాదిన్నర కాలంగా మాంద్యంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు పేర్కొన్నారు.

గడిచిన ఏడాదిన్నర కాలంగా దేశం తీవ్ర ఆర్థిక మాంద్యానికి గురి అవుతూ వస్తున్నదని.. 2018-19 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ 8 శాతం నమోదైతే.. తర్వాతి నుంచి తగ్గుతూ వచ్చిందన్నారు. రెండో త్రైమాసికంలో 7 శాతానికి.. మూడో త్రైమాసికంలో 6.6 శాతానికి.. చివరి త్రైమాసికానికి 5.8 శాతానికి పడిపోయినట్లు చెప్పారు. ఇదంతా కూడా కేంద్ర గణాంకాల్ని మాత్రమే తాను చెబుతున్నానని చెప్పటం ద్వారా.. కేంద్రం పరిస్థితే బాగోలేనప్పుడు రాష్ట్రం పరిస్థితి ఏం బాగుంటుంది చెప్పు బాస్ అన్నట్లుగా ఆయన ప్రసంగం సాగింది.

అంతేనా.. దేశం ఎదుర్కొంటున్న తీవ్రమైన ఆర్థిక మాంద్యం దేశంలో అనేక వైపరీత్యాలకు దారి తీస్తున్న పరిణామాల్ని తాము చూస్తున్నదేనని.. అన్ని రంగాల మీద తీవ్ర ప్రభావం చూపుతున్నట్లుగా చెప్పారు. ఇందుకు కొన్ని ఉదాహరణలు ప్రస్తావించిన కేసీఆర్.. సొసైటీ ఆఫ్ ఇండియన్ ఆటో మొబైల్ మాన్యుఫాక్చరర్స్ ఇటీవల వెల్లడించిన నివేదిక ప్రకారం దేశ వ్యాప్తంగా వాహనాల ఉత్పత్తి 33 శాతానికి తగ్గిందని.. వాహనాల అమ్మకాలు 10.5 శాతానికి తగ్గినట్లు చెప్పారు. ఇప్పటికే తయారైన వాహనాల్ని కొనేవారు దిక్కులేకుండా పోవటంతో ప్రముఖ కంపెనీలన్నీ తమ వాహన ఉత్పత్తిని తాత్కాలికంగా ఆపేసినట్లు చెప్పారు.

వాహనాల అమ్మకాలతో వచ్చే పన్నులు ఆగిపోయాయని.. దీంతో పెట్రోల్.. డీజిల్.. టైర్లు.. ఇతర అమ్మకాలు పడిపోయి.. వ్యాట్ తగ్గినట్లు చెప్పారు. అన్ని బాగున్నప్పుడు.. కేంద్ర ఆర్థిక పురోగతితో పోలిస్తే.. రాష్ట్ర ఆర్థిక పురోగతి చాలా బాగుందంటూ జబ్బలు చరుచుకున్న కేసీఆర్.. ఇప్పుడు మాత్రం కేంద్రం మీద.. ముఖ్యంగా మోడీ మాష్టారి ఫెయిల్యూర్ మీద గురి చూసి కొట్టినట్లుగా బడ్జెట్ ప్రసంగంలో ప్రస్తావించటం గమనార్హం. మరి.. దీనికి బీజేపీ నేతలు ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.