Begin typing your search above and press return to search.

టీ మంత్రులకు కేసీఆర్ క్లాస్

By:  Tupaki Desk   |   15 Aug 2015 11:34 AM GMT
టీ మంత్రులకు కేసీఆర్ క్లాస్
X
తెలంగాణను విశ్వనగరంగా తీర్చుదిద్దుతానని ప్రకటించిన ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ క్రమంలో ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. అంతర్జాతీయ స్థాయి నగరం అంటే అందుకు తగ్గ నైపుణ్యాలు ఉండటం కూడా తప్పనిసరి అని గమనించిన కేసీఆర్ ముందుగా తన టీమ్ సభ్యులను సెట్ రైట్ చేస్తున్నారు. ఇందులో భాగంగా ఇంగ్లిష్ భాష, కంప్యూటర్ వాడకంపై పట్టు తెచ్చుకోవాల్సిందిగా కేబినెట్ మంత్రులకు కేసీఆర్ ఆదేశించారు.

తను, తన కుమారుడు కేటీఆర్ కి తప్ప మంత్రులు ఎవ్వరికీ ఇంగ్లిష్ భాషలో నైపుణ్యం లేదని కేసీఆర్ గుర్తించారు. అందువల్లే పరిపాలన పరమైన సమస్యలు ఎదురవడంతో పాటు ఇతరత్రా ఇబ్బందులు పడుతున్నట్లు ఆయన గమనించారు. పరిపాలన అంశాల్లో కేవలం అధికారులపైనే అధారపడకుండా సొంతంగా తమ తమ శాఖలపై పట్టు పెంచుకునేందుకు ఇంగ్లిష్ లో నైపుణ్యం సాధించడం ఒక్కటే మార్గమని కేసీఆర్ డిసైడయిపోయారు. మరోవైపు ప్రస్తుత టెక్నాలజీ యుగంలో కంప్యూటర్ వాడకంలోనూ అవగాహన కలిగి ఉండాలని కేసీఆర్ గమనించారు. దీంతో తన మంత్రివర్గ సహచరులందరికీ ఈ మేరకు వాటిల్లో నైపుణ్యం సంపాదించాలని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి ఆదేశాల నేపథ్యంలో మంత్రులు కదిలారు.

ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ సహా, మంత్రులు నాయిని నర్సింహ్మారెడ్డి, జోగు రామన్న, జి.జగదీశ్ రెడ్డి, అజ్మీరా చందులాల్ వ్యక్తిగతంగా ట్యూషన్లు పెట్టించుకున్నారట. ఇంగ్లిష్ వాడకం, కంప్యూటర్ ఉపయోగం వంటి అంశాల్లో సదరు ట్యూటర్లతో రోజు శిక్షణ ఇప్పించుకుంటున్నారట. తద్వారా తమ ఆంగ్ల భాషా పటిమను పెంపొందించే పనిలో పడ్డారని సమాచారం.

కొసమెరుపు: తన టీమ్ కు ఆదేశాలు ఇచ్చేముందు తాను కూడా రెడీగా ఉండాలనుకున్న కేసీఆర్ అందుకు తగ్గట్లే రోజూ ఉదయమే మేలుకొని ఇప్పటికే అవగాహన ఉన్న ఇంగ్లిష్ ను మరింత నైపుణ్యం సాధించేందుకు ప్రయత్నిస్తున్నారట. ఈ క్రమంలో బిజినెస్ వర్గాలకు చేరువ అయ్యే భాషా, ఉచ్చారణకు ముఖ్యమంత్రి ప్రాధాన్యం ఇస్తున్నారని ఆయన సన్నిహిత వర్గాలు వివరిస్తున్నాయి.