తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్వహిస్తున్న అయుత చండీయాగం ఇప్పుడు అందరిలో విపరీతమైన ఆసక్తి వ్యక్తమవుతోంది. అత్యంత భారీగా నిర్వహిస్తున్న చండీయాగం చూస్తే.. భవిష్యత్తులో ఇంత భారీగా ఎవరు చేయగలరన్న భావన రావటం ఖాయం. వీవీఐపీలు మొదలు సామాన్యుల వరకూ ఎవరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తున్న ఈ యాగంలో దాదాపు 2వేల మంది రుత్వితులు పాల్గొనటం తెలిసిందే. యాగంలో అందరిని ఆకర్షిస్తున్న అంశం రుత్వితులు ధరించే వస్త్రాలతో పాటు.. యాగశాలలో ప్రవేశించే ప్రముఖులు కూడా.. అవే వస్త్రాల్ని ధరిస్తుండటం అందరిని ఆకర్షిస్తోంది.
యాగం తొలిరోజున పసుపు పచ్చ రంగు ముదురు మెరూన్ రంగుపట్టు అంచున్న పంచె.. ధోవతితో పచ్చ తోరణంగా కనిపించిన యాగశాల.. గురువారం గులాబీ రంగుతో మెరిసిపోతోంది. యాగాన్ని నిర్వహిస్తున్న భ్రాహ్మణులతో పాటు.. యాగశాలలో పూజలు చేసే వారుసైతం ఈ వస్త్రాల్ని ధరిస్తుండటంతో.. ప్రముఖులు సరికొత్తగా కనిపిస్తున్నారు.
మొదటిరోజు పసుపు వర్ణంతో వస్త్రాలు ధరించిన వారు.. రెండోరోజు గులాబీ వర్ణ వస్త్రాల్ని ధరించారు. మరి.. మిగిలిన మూడు రోజుల్లో ఏ రంగు వస్త్రాల్ని ధరిస్తారన్న విషయం మీద ఆసక్తి వ్యక్తమవుతోంది. ఇదే విషయాన్ని రుత్వితులను అడిగితే వారు చెబుతున్న సమాచారం ప్రకారం.. మూడో రోజు (శుక్రవారం) ఎరుపు రంగు వస్త్రాలు.. నాలుగో రోజు (శనివారం) తెలుపు రంగు పంచెలు.. వాటికి బంగారు రంగు పట్టు అంచున్న ధోవతులు.. ఐదో రోజు (శనివారం) పసుపుపచ్చ వర్ణం వస్త్రాలు.. వాటికి ముదురు మెరూన్ రంగు పట్టు అంచున్న దోవతుల్ని ధరిస్తారని చెబుతున్నారు. అంటే.. రానున్న రోజుల్లో మరిన్ని రంగు వస్త్రాలు కనిపించనున్నాయన్న మాట.