Begin typing your search above and press return to search.

ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ డబుల్ గిఫ్ట్

By:  Tupaki Desk   |   29 Dec 2020 6:20 PM GMT
ప్రభుత్వ ఉద్యోగులకు కేసీఆర్ డబుల్ గిఫ్ట్
X
ఎన్నాళ్లుగానే వేచిన ఉదయం ఈ రాత్రి ఉదయించినట్టైంది. కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్న తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల ఆశలు నెరవేరాయి. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తాజాగా ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్ తెలిపారు. వారికి నూతన సంవత్సర కానుక ప్రకటించారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఉద్యోగులు వేతనాలు పెంచడంతోపాటు.. ఉద్యోగ విరమణ వయసును కూడా పెంచాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.

ప్రభుత్వ ఉద్యోగులు, గ్రాంట్ ఇన్ ఎయిడ్, చార్ట్ డ్, డెయిలీ వేజ్, ఫుల్ టైమ్ కాంటింజెంట్, పార్ట్ టైం కాంటిజెంట్ ఉద్యోగులతోపాటు హోంగార్డులు, అంగన్ వాడీ వర్కర్లు, కాంట్రాక్టు ఉద్యోగులు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆశావర్కర్లు, విద్యావలంటీర్లు, సెర్ఫ్ ఉద్యోగులు, గౌరవ వేతనాలు అందుకుంటున్న వారు పింఛన్ దారులు ఇలా అందరికీ ప్రయోజనం కలిగించేలా వేతనాల పెంపు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. అన్నిరకాల ఉద్యోగులు కలిపి తెలంగాణలో 9,36,976 మంది ఉంటారని.. అందరికీ వేతనాలు పెంపు వర్తిస్తుందని కేసీఆర్ తెలిపారు.

రాష్ట్రంలోని అన్ని శాఖల్లోని ఉద్యోగుల వేతనాలతోపాటు పింఛనుదారులకు ఇచ్చే పింఛన్ ను సైతం పెంచేందుకు సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపారు. ఇక ప్రభుత్వ ఉద్యోగాలతోపాటు తక్కువ వేతనాలు ఉండే ఆర్టీసీ ఉద్యోగులకు కూడా వేతనాలు పెంచాలని కేసీఆర్ నిర్ణయించారు.

ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలను భర్తీ చేసే ప్రక్రియను కూడా ప్రారంభించాలని కేసీఆర్ ఆదేశించారు. మొత్తంగా తనపై వ్యతిరేకంగా ఉండి దుబ్బాక, జీహెచ్ఎంసీ ఎన్నికల్లో ఓడించిన యువత, నిరుద్యోగులు, ఉద్యోగులను మచ్చిక చేసుకునే పనిలో కేసీఆర్ పడ్డట్టు తెలుస్తోంది.