Begin typing your search above and press return to search.

ట్ర‌బుల్స్‌ లో కేసీఆర్ డ‌బుల్ బెడ్‌ రూం డ్రీమ్‌

By:  Tupaki Desk   |   8 Aug 2016 10:32 AM GMT
ట్ర‌బుల్స్‌ లో కేసీఆర్ డ‌బుల్ బెడ్‌ రూం డ్రీమ్‌
X
తెలంగాణలో కేసీఆర్‌ కు ఓట్ల వ‌ర్షం కురిపించిన ఏకైక ప‌థ‌కం డ‌బుల్ బెడ్‌ రూం! పేద‌లేమ‌న్న‌ పాపం చేసిన్రా.. ఆళ్ల‌కి మాత్రం డ‌బుల్ బెడ్‌ రూం ఉంటే త‌ప్పా! గీ ప్ర‌భుత్వం పేద‌ల‌ది. ఆళ్ల‌క్కూడ డ‌బుల్ బెడ్‌ రూం ఇళ్లు క‌ట్టిస్త‌ది- ఇదీ ఎన్నిక‌ల వేళ కేసీఆర్ ప్ర‌క‌ట‌న. అంతేకాదు, హైదరాబాద్‌ ఐడీహెచ్‌ కాలనీలో ఏడు లక్షల రూపాయలతో డబుల్‌ బెడ్‌ రూమ్‌ అపార్ట్‌ మెంట్లను నిర్మించిన టీఆర్‌ ఎస్‌ సర్కారు ...ఇదే తరహాలో రాష్ర్టమంతా నిర్మిస్తామని గ్రేటర్‌ ఎన్నికలకు ముందు ప్ర‌క‌టించింది. దీంతో ఉబ్బిత‌బ్బిబ్బ‌యిన పేద‌లు.. త‌మ ఆనందాన్ని, ఆశ‌ల‌ను ఓట్ల రూపంలో కుమ్మ‌రించారు. దీంతో అన్ని ఉప ఎన్నిక‌లు స‌హా కార్పొరేష‌న్ ఎన్నిక‌ల్లోనూ కారు పార్టీ య‌మ స్పీడుతో దూసుకుపోయింది.

కేసీఆర్ త‌న హామీ మేర‌కు గ‌త ఏడాది ద‌స‌రా నాడు.. తెలంగాణ వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలో ప్రజాప్రతినిధులు డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్లకు శంకుస్థాపనలు చేశారు. ప్ర‌తి జిల్లాలోనూ ఒక్కో నియోజకవర్గానికి నాలుగు వందల ఇళ్ల చొప్పున తొలి విడతగా నాలుగువేల ఇళ్లను మంజూరు చేసింది ప్రభుత్వం.. ఇంత వ‌ర‌కు బాగానే సాగిన య‌వ్వారం ఆ త‌ర్వాత నిమ్మ‌కు నీరెత్తిన త‌ర‌హాగా మారింది. ఈ ఇళ్లు నిర్మించేందుకు కాంట్రాక్ట‌ర్లు ముందుకు రావ‌డం లేదు. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా లో ప‌రిస్థితి మ‌రింత దారుణంగా ఉంది. తెలంగాణ గృహ నిర్మాణశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి ఈ జిల్లాకు చెందిన నేత కావ‌డంతో ఇక్క‌డే ఇళ్ల నిర్మాణం త్వ‌ర‌గా పూర్త‌వుతుంద‌ని అంద‌రూ అనుకున్నారు. కానీ, ఇక్క‌డే ప‌రిస్థితి ఎక్క‌డ వేసిన గొంగ‌ళి అక్క‌డే అన్న‌చందంగా ప‌రిణ‌మించింది.

నిర్మల్‌..ఖానాపూర్‌.. బెల్లంపల్లి... చెన్నూరు.. ఆసిఫాబాద్‌ నియోజకవర్గాలలో 881 ఇళ్లను 23 ప్యాకేజీలుగా విభజించి టెండర్లు పిలిచారు. ఒక్కరంటే ఒక్క కాంట్రాక్టర్‌ కూడా దీనిలో పాల్గొనేందుకు ముందుకు రాలేదు. ఇళ్ల నిర్మాణ వ్యయం రోజురోజుకీ పెరుగుతుండటంతో పాటు తమకు లాభంగా ఉండే 13.61 శాతాన్ని టెండర్ల నుంచి తొలగించడంతో కాంట్రాక్ట‌ర్లు భీష్మించారు. దీంతో ప‌థ‌కం ముందుకు సాగ‌డం లేదు. మ‌రోప‌క్క‌, డబుల్‌ బెడ్‌ రూమ్‌ ఇళ్ల విషయంలో ప్రజాప్రతినిధులు పెద్దగా ఇంట్రస్ట్‌ చూపడం లేదు.

వేల సంఖ్యలో దరఖాస్తులు రావడం.. ప్రభుత్వం కేవ‌లం నియోజకవర్గానికి 400 ఇళ్లు మంజూరు చేయడంతో వాటిని ఎవరికి ఇవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. దీంతో ఇళ్ల నిర్మాణ వ్యయాన్ని పెంచితేకానీ కాంట్రాక్టర్లు.. ఇళ్ల సంఖ్యను పెంచితేకానీ ప్రజాప్రతినిధులు డబుల్ బెడ్‌రూమ్‌ పథకంపై ఆసక్తి చూపించేలా లేరు. ఫ‌లితంగా కేసీఆర్ త‌ల‌పెట్టిన బృహ‌త్ య‌జ్ఞం ఇప్ప‌ట్లో నెర‌వేరేలా క‌నిపించ‌డం లేదు. మ‌రి ఈ ప‌థ‌కం ఎప్ప‌టికి ప‌ట్టాలెక్కేనో? ఎప్ప‌టికి ప్ర‌జ‌ల ఆశ‌లు నెర‌వేరేనో? అని అంద‌రూ అనుకుంటున్నారు.