Begin typing your search above and press return to search.

జానాను ట‌చ్ చేసి త‌ప్పు చేశారా?

By:  Tupaki Desk   |   14 March 2018 10:03 AM GMT
జానాను ట‌చ్ చేసి త‌ప్పు చేశారా?
X
రెండు రోజుల క్రితం తెలంగాణ అసెంబ్లీలో జ‌రిగిన ర‌చ్చ తెలిసిందే. ర‌ణ‌రంగంగా మారిన స‌భ‌లో అనూహ్య ప‌రిణామాలు చోటు చేసుకున్నాయి. తీవ్ర ఆగ్ర‌హంతో చేతికి అందిన హెడ్ ఫోన్ ను వేదిక మీద‌కు విసిరేయ‌టం.. అది కాస్తా మండ‌లి చైర్మ‌న్ స్వామిగౌడ్‌కు కంటికి తాక‌టం.. స్వ‌ల్ప గాయం కావ‌టం తెలిసిందే.

ఈ తీరుపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన తెలంగాణ సర్కారు సంచ‌ల‌న నిర్ణ‌యాన్ని తీసుకుంది. ఇద్ద‌రు ఎమ్మెల్యేల శాస‌న‌స‌భా స‌భ్య‌త్వాల్ని ర‌ద్దు చేయ‌టంతో పాటు.. ప‌ద‌కొండు మంది స‌భ్యుల‌పై స‌స్పెన్ష‌న్ విధించింది. ఎమ్మెల్సీ స‌భ్యుల‌పైనా స‌స్పెన్ష‌న్ వేటు వేశారు.

ఈ నిర్ణ‌యం అంతా ఒక ఎత్తు అయితే.. పెద్ద మ‌నిషిగా వ్య‌వ‌హ‌రిస్తూ పాత‌కాల‌పు రాజ‌కీయాల‌కు నిలువెత్తు రూపంగా నిలిచే కాంగ్రెస్ శాస‌న‌స‌భాప‌క్ష నేత జానారెడ్డిని సైతం స‌స్పెన్ష‌న్ వేటు వేయ‌టంపై స‌ర్వ‌త్రా ఆగ్ర‌హం వ్య‌క్త‌మ‌వుతోంది. జానాపై వేటు వేసిన తీరును ప్ర‌శ్నిస్తే.. గులాబీ నేత‌లు మండి ప‌డుతూ.. ఆయ‌నే వ్యూహం ప‌న్నారంటూ ఆరోపిస్తున్నారు. అయితే. .టీఆర్ ఎస్ నేత‌ల తీరును ప‌లువురు త‌ప్పు ప‌ట్టారు.

జానారెడ్డికి అలాంటి తెలివే ఉంటే.. బీఏసీ స‌మావేశంలో త‌మ వారు త‌ప్పు చేశార‌ని.. పొరపాటు జ‌రిగింద‌న్న వివ‌ర‌ణ ఇచ్చుకోరు క‌దా? అని ప్ర‌శ్నిస్తున్నారు. దూకుడు రాజ‌కీయాల్లో కింద ప‌డ్డా త‌మ‌దే పైచేయి అన్న‌ట్లుగా వ్య‌వ‌హ‌రించే నేత‌ల‌కు.. పార్టీల‌కు భిన్నంగా జానారెడ్డి వ్య‌వ‌హ‌రిస్తార‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ప‌లుమార్లు త‌మ పార్టీ నేత‌లకు స‌ర్దిచెప్పే క్ర‌మంలో ఆయ‌న అధికార టీఆర్ ఎస్ కు వ‌త్తాసు ప‌లుకుతున్నారంటూ సొంత పార్టీ నేత‌ల చేత మాట అనిపించుకోవాల్సి వ‌చ్చింద‌న్న‌ది మ‌ర్చిపోకూడ‌ద‌ని గుర్తు చేస్తున్నారు.

క‌ఠిన నిర్ణ‌యాలు తీసుకోవ‌టం త‌ప్పు కాద‌ని.. కానీ.. దానికో ప‌ద్ద‌తి ఉంటుంద‌ని ప‌లువురు వ్యాఖ్యానిస్తున్నారు. ఈ రోజు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ నేత‌లు.. భ‌విష్య‌త్తులో త‌మ‌కు తామే ప‌రిమితులు విధించుకుంటున్నార‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెబుతున్నారు. ఏ ప్ర‌భుత్వం ఎల్ల కాలం ప‌వ‌ర్ లో ఉండ‌కూడ‌ద‌ని..ఒక‌వేళ మ‌రో ఐదేళ్లు టీఆర్ ఎస్ అధికారంలో ఉన్నా.. ఆ త‌ర్వాత అయితే ప్ర‌తిప‌క్షంలో కూర్చోవాల్సి ఉంటుంద‌ని.. అప్పుడు దీనికి అంత‌కంతా అనుభ‌వించాల్సి ఉంటుంద‌న్న మాట‌ను ప‌లువురు హెచ్చ‌రిక రూపంలో చెబుతున్నారు.

అధికార‌ప‌క్షం శాంతంగా.. విపక్షం కొంత ఆగ్ర‌హంగా ఉండ‌టం మామూలేన‌ని.. ఇప్పుడు కాంగ్రెస్ నేత‌లు చేస్తున్న ప్ర‌తి నిర‌స‌న‌ను త‌ప్పు ప‌డుతున్న టీఆర్ ఎస్ నేత‌లు.. రేపొద్దున తాము ప్ర‌తిప‌క్షంలో ఉన్న‌ప్పుడు గ‌తంలో తాము చెప్పిన మాట‌లే త‌మ‌కు బంధ‌నాలుగా మార‌తాయ‌న్న విష‌యాన్ని మ‌ర్చిపోకూడ‌ద‌ని చెబుతున్నారు. ఏమైనా.. పెద్ద‌మ‌నిషి లాంటి జానాపై వేటు వేసేందుకు కేసీఆర్ ఎలాంటి మొహ‌మాటం ప‌డ‌కుండా.. క‌ర‌కుగా వ్య‌వ‌హ‌రించ‌టం ఆయ‌న ఇమేజ్ ను డ్యామేజ్ చేసింద‌న్న మాట ప‌లువురు నేత‌ల నోటి నుంచి రావ‌టం గ‌మ‌నార్హం.