Begin typing your search above and press return to search.

కేసీఆర్ స్పీడును బాబు అందుకోలేరంతే!

By:  Tupaki Desk   |   15 April 2017 7:26 AM GMT
కేసీఆర్ స్పీడును బాబు అందుకోలేరంతే!
X
తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్ర‌బాబునాయుడు - క‌ల్వ‌కుంట్ల చంద్ర‌శేఖ‌ర‌రావుల్లో ఎవ‌రికి స్పీడెక్కువ‌? వాస్త‌వానికి పాల‌న‌లో అపార అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబే కేసీఆర్ కంటే కాస్తంత స్పీడుగా ఉంటార‌ని ఎవ‌రైనా అనుకుంటారు. కానీ... కేసీఆర్ స్పీడు ముందు బాబు బ‌లాదూరేన‌ట‌. ఇదేదో అదాటుగా చెబుతున్న మాట కాదు... లెక్క‌కు మిక్కిలి విశ్లేష‌ణ‌ల త‌ర్వాత ఈ విష‌యాన్ని చెబుతున్నామంటున్నారు రాజ‌కీయ విశ్లేష‌కులు. అయినా తొలి సారి చ‌ట్ట‌స‌భ‌లో అడుగుపెట్టిన నాడే చంద్రబాబును మంత్రి ప‌ద‌వి వ‌రించింది. ఆ త‌ర్వాత స్వ‌ర్గీయ నంద‌మూరి తార‌క‌రామారావుకు అల్లుడిగా మారి - టీడీపీలో చేరిన చంద్రబాబు... త‌ద‌నంత‌రం ఎన్టీఆర్ కేబినెట్ లో కీల‌క మంత్రిగా వ్య‌వ‌హ‌రించారు. నాడు ఎన్టీఆర్ పాల‌న‌లో కీల‌క నిర్ణ‌యాల‌న్నీ దాదాపుగా బాబు దిశానిర్దేశంలోనే జ‌రిగేవ‌న్న ప్ర‌చారం కూడా లేక‌పోలేదు.

ఇక ఆ త‌ర్వాత టీడీపీని - నాడు ఉమ్మ‌డి రాష్ట్ర పాల‌నా ప‌గ్గాల‌ను హ‌స్త‌గ‌తం చేసుకున్న చంద్ర‌బాబు ఏకంగా ప‌దేళ్ల పాటు సీఎంగా వ్య‌వ‌హ‌రించి ఉమ్మ‌డి రాష్ట్రాన్ని అత్య‌ధిక కాలం ఏలిన సీఎంగా రికార్డులకెక్కారు. ఈ క్ర‌మంలో ఏనాడూ కేబినెట్‌ లో అంత‌గా ప్రాధాన్యం ద‌క్క‌ని కేసీఆర్‌ తో పోలిస్తే... చంద్ర‌బాబుకే అపార అనుభవం ఉన్న‌ట్లు లెక్క‌. మ‌రి కేసీఆర్ విష‌యానికి వ‌స్తే... టీడీపీలో సీనియ‌ర్ నేత‌గా వ్య‌వ‌హ‌రించిన కేసీఆర్ అప్పుడెప్పుడో కార్మిక శాఖ మంత్రిగా ప‌నిచేశారు. అది కూడా సింగిల్ టెర్మ్ మాత్ర‌మే. ఆ త‌ర్వాత కేసీఆర్‌ కు మంత్రి ప‌ద‌వి ఇవ్వ‌ని చంద్ర‌బాబు... అసెంబ్లీ డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వి ఇచ్చారు. అయితే ఆ ప‌ద‌విని కూడా కేసీఆర్ పూర్తిగా అనుభ‌వించ‌లేద‌నే చెప్పాలి. ఎందుకంటే... నాడు త‌న‌కు కేబినెట్ లో అవకాశం క‌ల్పించేద‌న్న కోపంతో టీడీపీకి గుడ్ బై చెప్పిన కేసీఆర్‌... డిప్యూటీ స్పీక‌ర్ ప‌ద‌వికి కూడా రాజీనామా చేశారు.

టీడీపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన ఆయ‌న తెలంగాణ ప్ర‌జ‌ల చిర‌కాల వాంఛ అయిన ప్ర‌త్యేక రాష్ట్ర నినాదాన్ని భూజానికెత్తుకుని టీఆర్ ఎస్ పేరిట సొంత కుంప‌టి పెట్టుకున్నారు. ఈ క్ర‌మంలో అధికారానికి దూరంగా 14 ఏళ్ల పాటు ఉద్య‌మాన్ని న‌డిపిన కేసీఆర్‌ కు పాల‌న‌లో చంద్ర‌బాబుకున్న అనుభవంలో లేశ‌మాత్రమే ఉంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. మ‌రి ఈ ఈక్వేష‌న్ల‌ను ప‌రిశీలిస్తే.. పాల‌నాప‌ర‌మైన నిర్ణ‌యాల్లో కేసీఆర్ కంటే కూడా చంద్రబాబు దూకుడు క‌న‌బ‌డాలి. అయితే అందుకు విరుద్ధంగా కేసీఆర్ స్పీడుగా దూసుకెళుతుంటే... సుదీర్ఘ అనుభ‌వ‌మున్న చంద్ర‌బాబు మాత్రం కేసీఆర్ స్పీడును అందుకునేందుకు ఎంత య‌త్నించినా కూడా సాధ్య‌ప‌డ‌టం లేద‌న్న వాద‌న వినిపిస్తోంది.

అయినా కేసీఆర్ స్పీడు చంద్ర‌బాబు స్పీడు క‌న్నా సూప‌ర్ డూప‌ర్‌గా ఉంద‌నేందుకు ఏమైనా ఉదాహ‌ర‌ణ‌లు ఉన్నాయా? అంటే... ఎందుకు లేవంటున్నారు విశ్లేష‌కులు. మొన్న కేసీఆర్ తీసుకున్న సింగిల్ నిర్ణ‌యాన్ని ప‌రిశీలిస్తేనే ఎవ‌రి స‌త్తా ఏ పాటిదో ఇట్టే అర్థ‌మైపోతుంద‌ని కూడా వారు చెబుతున్నారు. ఆ వివ‌రాల్లోకెళితే.. రైతుల‌కు ఎరువుల‌ను ఉచితంగా అందివ్వాల‌ని కేసీఆర్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసిన సంగ‌తి తెలిసిందే. దేశంలోనే ఈ త‌ర‌హా నిర్ణ‌యం తీసుకున్న సీఎంగా కేసీఆర్ రికార్డుల‌కెక్క‌గా... ఆ నిర్ణ‌యం తీసుకోవ‌డానికి కేసీఆర్ కు ప‌ట్టిన స‌మ‌యం వింటే షాక‌వ్వాల్సిందే. ఏడాదికి రూ.4 వేల కోట్ల విలువ చేసే ఈ నిర్ణ‌యాన్ని తీసుకునేందుకు కేసీఆర్ కేవ‌లం ఒక్క‌టంటే ఒక్క గంట మాత్ర‌మే కేటాయించార‌ట‌.

ఎన్నిక‌ల్లో ప్ర‌క‌టించిన రైతుల‌కు రుణ‌మాఫీ పూర్తి అయిన నేప‌థ్యంలో ముంచుకు వ‌స్తున్న ఎన్నిక‌ల త‌రుణంలో రుణ‌మాఫీ నిధుల‌కు స‌రిప‌డే ఏ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెడితే బాగుంటుంద‌ని ఆలోచించిన కేసీఆర్ మ‌దిలో... ఉచిత ఎరువుల పంపిణీ మెదిలింద‌ట‌. అనుకున్న‌దే త‌డ‌వుగా అధికారుల‌ను పిలిపించుకున్న కేసీఆర్ ప‌క్కాగా లెక్కలేసుకుని గంట‌లోనే నిర్ణ‌యం తీసేసుకున్నార‌ట‌. మ‌రి అక్క‌డ అమ‌రావ‌తిలో చంద్ర‌బాబు మాత్రం ఏ చిన్న నిర్ణ‌యం తీసుకోవాల‌న్నా కూడా రోజుల త‌ర‌బ‌డి తర్జ‌న భ‌ర్జ‌న‌లు ప‌డుతున్న వైనాన్ని చూస్తే... కేసీఆర్ స్పీడును అందుకోవ‌డం చంద్ర‌బాబుకు సాధ్య‌ప‌డ‌ద‌న్న వాద‌న‌ను విశ్లేష‌కులు బ‌ల్ల‌గుద్ది మ‌రీ చెబుతున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/