Begin typing your search above and press return to search.

వారి కంటే కేసీఆర్ వందరెట్లు నయం

By:  Tupaki Desk   |   14 July 2015 5:29 PM GMT
వారి కంటే కేసీఆర్ వందరెట్లు నయం
X
గొడ్డు గోతిలో పడితే తలో రాయి వేశారన్నది సామెత... ఏపీలో రాజకీయ నాయకుల పద్ధతి నూటికి నూరు శాతం ఇలాగే ఉంది. ప్రభుత్వం తప్పా... ప్రజల తొందరపాటా అనేది పక్కనపెడితే రాజమండ్రిలో 27 మంది భక్తులు పుష్కరాలకొచ్చి తొక్కిసలాటలో మృతిచెందడం అందరినీ కలచివేసింది. అయితే... ఈ సంఘటన కొందరు రాజకీయ నాయకుల్లో మాత్రం కొత్త ఉత్సాహం తెచ్చింది. రాజధాని.. పరిశ్రమలు.. పెట్టుబడులు.. ప్రాజెక్టులు అంటూ రోజురోజుకూ స్థాయి పెంచుకుంటున్న చంద్రబాబు ఈ పుష్కరాలను కూడా భారీ స్థాయిలో విజయవంతంగా నిర్వహిస్తే ఆయనకు మరింత పేరొస్తుందని ఇతరపార్టీల నేతలు ఎంతగానో కుళ్లుకున్నారు. అయితే దురదృష్టవశాత్తు పుష్కరాల్లో అనుకోని సంఘటన జరగడంతో వారందరికీ నోటికి పని దొరికినట్టయింది. దీన్ని అడ్డంపెట్టుకుని చంద్రబాబును విమర్శించడం ప్రారంభించారు. కానీ.. నిత్యం చంద్రబాబును విమర్శించే కేసీఆర్ మాత్రం ఈ విషయంలో చంద్రబాబును పల్లెత్తి మాట కూడా అనకుండా కేవలం సంఘటనపైనే మాట్లాడారు. ఈ విషాదం పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ఆయన పుష్కరాల మిగిలిన 11 రోజులూ ఎలాంటి ప్రమాదాలు లేకుండా సజావుగా సాగాలని కూడా కోరుకున్నారు. ఒక అనుభవఙుడైన రాజకీయ నేతగా ఎప్పుడు విమర్శించాలి.. ఎప్పుడు అండగా ఉండాలి.. ఎప్పుడు ఆత్మవిశ్వాసం కల్పించాలి...ఎప్పుడు ధైర్యమివ్వాలి.. పార్టీలకతీతంగా బాసటగా నిలవాల్సిన సమయమేదన్నది ప్రతి రాజకీయ నాయకుడికీ తెలియాలి.. కేసీఆర్ ఆ విఙత చూపించి ఏపీలోని నాయకులకంటే వంద రెట్లు నయం అనిపించుకున్నారు.

జరిగిన సంఘటనకు కారణమేదైనా కావొచ్చు.. ప్రభుత్వ వైఫల్యం కావొచ్చు... సీఎం వైఫల్యం కావొచ్చు కాకపోవచ్చు.. ఏమైనా కావొచ్చు కానీ ఇలాంటి సమయంలో.. ఇంకా 11 రోజుల పాటు ఈ భారీ కార్యక్రమం నిర్వహించాల్సిన సమయంలో జరిగిన సంఘటనతో షాక్ కు గురయిన ముఖ్యమంత్రికి అండగా నిలిచి మిగిలిన 11 రోజుల్లో ధైర్యంగా సాగేలా చేయాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. దీనికి పార్టీలతో సంబంధం లేదు.. ఎందుకంటే ఇది ప్రజలకు సంబంధించిన కార్యక్రమం కాబట్టి... రాజకీయ విభేదాలు, వివాదాలతో సంబంధం లేకుండా ప్రవర్తించాలి. కానీ... మన నాయకులు ఆ విషయం మర్చిపోయారు. చిరంజీవి, రఘువీరారెడ్డి, జగన్... చివరకు చెవిరెడ్డి భాస్కరరెడ్డి కూడా చంద్రబాబుపై నిప్పులు చెరిగేశారు. చంద్రబాబును రాజీనామా చేయమని డిమాండ్లు చేశారు. ఇలాంటి సమయంలో ఆయన రాజీనామా చేసి రాజకీయ అనిశ్చితి ఏర్పడితే ఏమవుతుంది. మరిన్ని ప్రమాదాలు జరగుతాయి. ఇవేమీ ఆలోచించకుండా చంద్రబాబు దొరికాడు కదా అని ఆడుకుంటున్నట్లుగా ఉంది వీళ్ల వ్యవహారం.

మరీ ముఖ్యంగా ఇన్నాళ్లు ఎక్కడున్నాడో కూడా తెలియని చిరంజీవి సంఘటన జరిగిన నిమిషాల్లో మీడియా ముందుకొచ్చి మాట్లాడడం విచిత్రమే. ఇవన్నీ చూస్తే వీరందరికంటే కేసీఆరే కరెక్టని ఎవరికైనా అనిపిస్తుంది. రాష్ట్రాల మధ్య వివాదాల విషయంలో చంద్రబాబును నానారకాలుగా విమర్శించే ఆయన ఈ విషయంలో ఏమీ అనలేదు ఎందుకు? ఇది సమయం కాదని... అలా చేయడం వల్ల అమాయక ప్రజలకు మరిన్ని ఇబ్బందులు ఏర్పడతాయని ఆయనకు తెలుసు కాబట్టే చాలా జాగ్రత్తగా వ్యవహరించారు. మన నాయకులు మాత్రం తమ బుద్ధి చూపించుకున్నారు.