Begin typing your search above and press return to search.

లీక్ దెబ్బ‌తో ఫోటో వ‌ద్దంటే వ‌ద్ద‌న్న కేసీఆర్‌

By:  Tupaki Desk   |   10 Feb 2018 5:20 AM GMT
లీక్ దెబ్బ‌తో ఫోటో వ‌ద్దంటే వ‌ద్ద‌న్న కేసీఆర్‌
X
చేసింది చెప్పుకోవ‌టంలో ఇప్ప‌టి అధినేత‌ల తీరు భిన్నంగా ఉంటుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. త‌మ‌ను తాము దైవాంశ సంభూతులుగా అభివ‌ర్ణించేలా ప్ర‌చారం చేయించుకోవ‌టానికి ప‌లువురు నేత‌లు ఆస‌క్తి ప్ర‌ద‌ర్శించ‌టం తెలిసిందే. మ‌రికొద్ది నెల‌ల్లో ఎన్నిక‌ల ఫీవ‌ర్ మొద‌లు కానున్న నేప‌థ్యంలో అధినేత‌లు ఆ దిశ‌గా త‌మ ప్ర‌చారాన్ని ముమ్మ‌రం చేయించాల‌ని భావిస్తున్నారు.

రైతుల‌కు స‌రికొత్త‌గా ఇవ్వ‌నున్న ఎల‌క్ట్రానిక్ టైటిల్ డీడ్ క‌మ్ ప‌ట్టాదార్ పాస్ పుస్త‌కంపై త‌న ఫోటోను ప్రింట్ చేయొద్ద‌ని తేల్చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌. రైతుల‌కు ఇచ్చే పాస్ పుస్త‌కం మీద కేసీఆర్ ఫోటో వేసేందుకు ప్ర‌య‌త్నాలు జ‌ర‌గ‌టం.. ఇందుకు సంబంధించిన స‌మాచారం బ‌య‌ట‌కు పొక్క‌టంతో మీడియాలో హైలెట్ అయ్యింది. రైతుల పాస్ పుస్త‌కాల‌పై ముఖ్య‌మంత్రి పోటో ఉండ‌టం బాగోద‌న్న భావ‌న‌ను ప‌లువురు వ్య‌క్తం చేశారు.

ఈ విష‌యం కేసీఆర్ వ‌ద్ద‌కు చేరింది. దీంతో.. ప‌ట్టాదారు పుస్త‌కంపై రైతు ఫోటో త‌ప్పించి మ‌రెవ‌రి ఫోటో ఉండొద్ద‌ని ఫైన‌ల్ చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 72 ల‌క్ష‌ల పాస్ పుస్త‌కాల్ని ప్రింట్ చేయించ‌నున్నారు. ఈ ప్రింటింగ్ ప‌నిని జాతీయ సెక్యురిటీ ప్రింటింగ్ ప్రెస్ కు అప్ప‌గిస్తున్న ఫైలుపై సంత‌కం చేసిన కేసీఆర్‌.. పాస్ బుక్ పై రైతు ఫోటో.. తెలంగాణ ప్ర‌భుత్వ ముద్ర మాత్ర‌మే త‌ప్పించి.. మ‌రింకేమీ ఉండ‌కూడ‌ద‌ని తేల్చి చెప్పారు.

పాస్ బుక్ పై త‌న ఫోటో ఉన్న ప‌క్షంలో రాజ‌కీయ కోణంలో విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతాయ‌ని.. పాస్ బుక్ అన్న‌ది ఎవ‌రికి వారికి సొంత వ్య‌వ‌హార‌మ‌ని.. అందుకే ఫోటో వ‌ద్ద‌ని స్ప‌ష్టం చేసిన‌ట్లుగా తెలుస్తోంది. పాస్ బుక్ పై కేసీఆర్ ఫోటో వ్య‌వ‌హారం లీక్ అయితే అయ్యింది కానీ ప్ర‌భుత్వానికి న‌ష్టం జ‌ర‌గ‌కుండా అడ్డుకుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ పాస్ పుస్త‌కాల ముద్ర‌ణ పూర్తి అయి.. రైతుల‌కు పంపిణీ కార్య‌క్ర‌మాన్ని వ‌చ్చే నెల 11న స్టార్ట్ చేద్దామ‌ని సీఎం కేసీఆర్ డిసైడ్ చేశారు.