Begin typing your search above and press return to search.

రేవంత్, సంజయ్, షర్మిల వల్లే కేసీఆర్ జిల్లాల టూర్లు?

By:  Tupaki Desk   |   18 July 2021 4:00 AM GMT
రేవంత్, సంజయ్, షర్మిల వల్లే కేసీఆర్ జిల్లాల టూర్లు?
X
ప్రగతి భవన్ నే రాజకోటలా మార్చి తెలంగాణను అప్రతిహతంగా పాలిస్తున్నారని సీఎం కేసీఆర్ పై ఎన్నో ఆరోపణలున్నాయి. అయితే ఫాంహౌస్ లేదంటే ప్రగతి భవన్ లోనే కేసీఆర్ ఉంటారనే అపవాదు ఉంది. అయితే రోజులు ఎప్పుడూ ఏకపక్షంగా ఉండవు కదా.. మారిపోయాయి. తెలంగాణ రాజకీయాల్లోకి ముగ్గురు దూసుకొచ్చారు. పాదయాత్రలు, పర్యటనలో హోరెత్తిస్తున్నారు. కేసీఆర్ సర్కార్ వైఫల్యాలను క్షేత్రస్థాయిలో ఎండగడుతున్నారు. దీంతో కేసీఆర్ కూడా బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

తెలంగాణలో రాజకీయ వేడి పెరిగిపోయింది. దీంతో ముఖ్యమంత్రి కేసీఆర్ తన సహజ శైలికి భిన్నంగా జిల్లాల పర్యటనను వేగవంతం చేశారు. వరుసగా జిల్లాల పర్యటనలు పెట్టుకున్నారు. రాబోయే రెండు నెలలు కేసీఆర్ క్షేత్రస్థాయిలో పనిచేయడానికి రెడీ అయ్యాడట.. వివిధ జిల్లాల్లో టీఆర్ఎస్ కార్యాలయాలు, ఇంటిగ్రేటెడ్ కలెక్టర్లను ప్రారంభించబోతున్నట్లు చెబుతున్నప్పటికీ.. ప్రధాన కారణం టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్, వైఎస్ఆర్ టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఎఫెక్ట్ యేనని అంటున్నారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్ రాష్ట్ర వ్యాప్త పర్యటనకు ప్లాన్ చేశారు. ఇక టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వాల వైఫల్యాలపై ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

కేసీఆర్ ఇప్పటికే జూన్ లో కామారెడ్డి, సిద్దిపేట, వరంగల్ అర్బన్ లను కవర్ చేశారు. జూలైలో సిరిసిల్లలో పర్యటించారు. ఈ అన్ని జిల్లాల్లో కేసీఆర్ కలెక్టరేట్ భవనాలను ప్రారంభించి ప్రజలతో బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించాడు. ఇక ఇప్పుడు ఇతర జిల్లాలను కవర్ చేయడానికి ప్రణాళిక సిద్దం చేస్తున్నాడు. త్వరలోనే జనగాం, నిజామాబాద్, జగిత్యాల, పెద్దపల్లి, వికారాబాద్, మహబూబ్ నగర్, వనపర్తి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని సమగ్ర కలెక్టరేట్ భవనాలు పూర్తయ్యాయని.. ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయని అధికార వర్గాలు తెలిపాయి.

ఇక టీఆర్ఎస్ యువజన విభాగం ‘తెలంగాణ విద్యార్థి జేఏసీ’ త్వరలో ఉప ఎన్నికలు జరిగే హుజూరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలో 15 రోజుల పాటు బస్సుయాత్ర చేపట్టనుంది. ఈ బస్సు యాత్ర ద్వారా అనేక గ్రామాలను కవర్ చేసేలా భారీగా విద్యార్థుల బృందాలను టీఆర్ఎస్ తీసుకువెళుతోంది. హుజూరాబాద్ ప్రజల కోసం టీఆర్ఎస్ ఏం చేసిందో వివరిస్తారు.

సీఎం కేసీఆర్ ప్రతి పర్యటనలో రెండు జిల్లాలను కవర్ చేసి ప్రజా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఆగస్టు నుంచి వివిధ జిల్లాల్లోని పార్టీ కార్యక్రమాల ప్రారంభోత్సవాలు ప్రారంభమవుతాయి. ప్రస్తుతానికి సిద్దిపేట జిల్లా కార్యాలయాన్ని కేసీఆర్ ప్రారంభించారు.

కాంగ్రెస్, బీజేపీ, వైఎస్ఆర్ టీపీ యాక్టివ్ గా మారిన నేపథ్యంలోనే తెలంగాణలో తమ పట్టు జారిపోకుండా టీఆర్ఎస్ నాయకత్వం ఈ పర్యటనలు పెట్టుకుందని తెలుస్తోంది. స్వయంగా కేసీఆర్ సైతం ప్రగతి భవన్ వదిలి బయటకు వస్తున్నారు. ఇప్పటివరకు హరీష్ రావు హుజూరాబాద్ ఉప ఎన్నికలపై దృష్టి సారించగా.. ఇప్పుడు కేటీఆర్ సైతం ఫోకస్ చేయనున్నారట.. ఇక టీఆర్ఎస్ ప్రధాన సీనియర్లు మాత్రం కోవిడ్ కారణంగా టీఆర్ఎస్ భవన్ నుంచే శ్రేణులను సమాయత్తం చేసే బాధ్యతను చేపట్టినట్టు తెలిసింది.

మొత్తంగా ఇన్నాళ్లు తెలంగాణలో అసలు ఉనికి లేకుండా ఉన్న ప్రతిపక్షాల తీవ్రత వల్ల సీఎం కేసీఆర్ సైతం బయటకు రావాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. ఈ ఊపు ఇలాగే కొనసాగితే.. ప్రతిపక్షాలు సమస్యలపై పోరాడితే తెలంగాణ ప్రజలకు మేలే జరుగుతుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.