Begin typing your search above and press return to search.

య‌న‌మ‌ల‌తో ఏకాంత చ‌ర్చ‌ల సారాంశ‌మేంటి?

By:  Tupaki Desk   |   14 Dec 2015 2:15 PM GMT
య‌న‌మ‌ల‌తో ఏకాంత చ‌ర్చ‌ల సారాంశ‌మేంటి?
X
తాను నిర్వ‌హిస్తున్న అయుత చండీయాగానికి ఆహ్వానించ‌టానికి బెజ‌వాడ వ‌చ్చిన తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్‌.. పిలుపుల కార్య‌క్ర‌మం పూర్తి చేసి.. ప‌సందైన విందు భోజ‌నం చేసిన త‌ర్వాత‌.. తిరుగు ప్ర‌యాణానికి సిద్ధ‌మ‌య్యారు. దాదాపు ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుతో దాదాపు గంట‌న్న‌ర‌కు పైనే గ‌డిపిన ఆయ‌న తిరుగుముఖం ప‌ట్టారు.

హెలికాఫ్ట‌ర్ కోసం ఎదురుచూసే క్ర‌మంలో.. ఆయ‌న త‌న ప‌క్క‌నే ఉన్న మంత్రి య‌న‌మ‌ల రామ‌కృష్ణుడిని వెంట తీసుకొని దూరంగా వెళ్లారు. మిగిలిన వారితో దూరంగా వెళ్లిన వారు కాసేపు మాట్లాడుకోవ‌టం ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. కేసీఆర్‌.. య‌న‌మ‌ల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ ఏమిటన్న ఆస‌క్తి ప్ర‌తిఒక్క‌రిలో వ్య‌క్త‌మ‌వుతోంది. అయితే.. దీనికి సంబంధించి కొన్ని మీడియా సంస్థ‌లు కొన్ని వార్త‌లు ప్ర‌సారం చేస్తున్నాయి.

ఏపీ ఆర్థిక ప‌రిస్థితి ఎలా ఉంద‌ని య‌న‌మ‌ల‌ను కేసీఆర్ అడిగార‌ని.. ఆయ‌న ఏమాత్రం బాగోలేద‌ని చెప్పార‌ని చెబుతున్నారు.

లెక్క‌లు ప‌క్కాగా తెలిసిన కేసీఆర్‌.. అడ‌గ‌క‌.. అడ‌గ‌క ఆర్థిక ప‌రిస్థితి గురించే అడుగుతారా? అన్న‌ది సందేహంగా మారింది. ఏపీ ఆర్థిక ప‌రిస్థితి గురించి పుంఖాను పుంఖాలుగా మీడియాలో వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. అధికారికంగా వ‌చ్చే స‌మాచారం క‌ళ్ల ముందు క‌నిపిస్తున్న వేళ‌.. ప్ర‌త్యేకించి ఆ అంశం గురించి కేసీఆర్ వాక‌బు చేస్తారా? అన్న సందేహం వ్య‌క్త‌మ‌వుతోంది.

అయితే.. కేసీఆర్ స‌న్నిహితుల అంచ‌నా మ‌రోలా ఉంది. గ‌త రెండు.. మూడు రోజులుగా మంట పుట్టిస్తున్న కాల్ మ‌నీ వ్య‌వ‌హారం మీద అడిగి ఉండొచ్చ‌న్న మాట వినిపిస్తుంటే.. మ‌రికొంద‌రు అదేమీ కాద‌ని.. ఏపీ రాజ‌ధానికి సంబంధించి సింగ‌పూర్ ప్ర‌భుత్వం గొంత‌మ్మ కోర్కెలు కోర‌టం.. దీనికి ఏపీ స‌ర్కారు నో చెప్ప‌టం తెలిసిందే. దీనికి సంబంధించిన వివ‌రాలు అడిగి ఉండొచ్చ‌న్న మాట వినిపిస్తోంది.

ఏది ఏమైనా.. కేసీఆర్‌..య‌న‌మ‌ల మ‌ధ్య జ‌రిగిన సంభాష‌ణ వారిద్ద‌రికే తెలియాలి. కేసీఆర్ వ‌ర‌కు.. ఎవ‌రూ ఆయ‌న్ను అడిగే అవ‌కాశం లేదు. అడిగినా చెబుతార‌న్న న‌మ్మ‌క‌మూ లేదు. ఇక‌.. మిగిలింది య‌న‌మ‌ల‌. కేసీఆర్ అడిగింది అడిగిన‌ట్లు చెబుతార‌ని భావిస్తే త‌ప్పులో కాలేసిన‌ట్లే. ఏమైనా.. వారిద్ద‌రి మ‌ధ్య జ‌రిగిన ఏకాంత చ‌ర్చకు సంబంధించి విష‌యాలు ఏమైనా అంచ‌నాలే కానీ.. వాస్త‌వాలు ఎంత‌మాత్రం కాద‌న్న‌ది నిజం.