Begin typing your search above and press return to search.

మోడీ ద‌గ్గ‌ర బాబు గుట్టు విప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   25 April 2017 8:10 AM GMT
మోడీ ద‌గ్గ‌ర బాబు గుట్టు విప్పిన కేసీఆర్‌
X
ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఆంధ్రప్ర‌దేశ్ సీఎం చంద్రబాబు నాయుడుపై తెలంగాణ సీఎం కే చంద్రశేఖరరావు ఫిర్యాదు చేశారు. ఏపీలో సచివాలయం - శాసనసభలను నిర్మించుకున్న సీఎం చంద్రబాబు ప్రభుత్వం - కోర్టు భవనం నిర్మించకుండా దురుద్దేశంతో హైకోర్టు విభజనను ఆపుతున్నారని తెలంగాణ సీఎం కె చంద్రశేఖరరావు ప్రధాని నరేంద్ర మోడీకి ఫిర్యాదు చేశారు. ఈ విష‌యంలో మీరు జోక్యం చేసుకోవాల‌ని కోరారు. ప్ర‌ధానితో సుమారు గంటన్నరపాటు ముఖాముఖి చర్చలు జరిపిన సందర్భంగా హైకోర్టు విభజన-విభజన హామీల అమలు-కేంద్ర సహాయం తదితర అంశాలను ప్రస్తావించారు.

చంద్రబాబు సార‌థ్యంలోని ఏపీ ప్రభుత్వం కొత్త భవనం నిర్మించి ఇచ్చిన మరుక్షణం హైకోర్టును విభజించి ఏపీకి ప్రత్యేక హైకోర్టు ఏర్పాటు చేస్తామని కేంద్ర న్యాయ శాఖ చెబుతోంది. కొత్త సచివాలయం, శాసన సభలను నిర్మించుకున్న ఏపీ ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటుకు మాత్రం భవనాన్ని నిర్మించటం లేదని చంద్రశేఖరరావు ప్రధాని దృష్టికి తెచ్చారు.సచివాలయం - శాసన సభను నిర్మించుకున్నవారు హైకోర్టు కోసం కొత్త భవనం నిర్మించుకోలేరా? అని కేసీఆర్ ప్రధానితో అన్నట్టు తెలిసింది. ``హైదరాబాద్ ప్రస్తుతం పేరుకే ఉమ్మడి రాజధాని. ఏపీ ప్రభుత్వం తెలంగాణ సచివాలంలోని అన్ని కార్యాలయాలు ఖాళీ చేసి వెళ్లిపోయింది. హైదరాబాద్‌ లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి ఎలాంటి కార్యాలయం లేదు. అన్నింటినీ తరలించుకున్నా, హైకోర్టును హైదరాబాద్‌ లోనే పెట్టుకోవటం వెనుక ఎదో మతలబు ఉంది. ఏపీకి సంబంధించిన హైకోర్టు కూడా అమరావతిలో ఉండటం మంచిది కదా? అయినా ఎందుకు త‌ర‌లించ‌డం లేదే! `` అనే అభిప్రాయాన్ని ప్రధాని వద్ద కేసీఆర్ వ్యక్తం చేసినట్టు తెలిసింది.

ఈ సంద‌ర్భంగానే హైకోర్టు ఏర్పాటుకు సంబంధించిన నోటిఫికేషన్ జారీ చేయాలని ప్ర‌ధాన‌మంత్రి కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. వెనుకబడిన తరగతుల విభాగంలో ఉన్నవారికి కల్పించిన రిజర్వేన్లను అనుమతించాలని ప్రధానిని కేసీఆర్ కోరారు. గిరిజనుల రిజర్వేషన్ల పెంపు, ఎస్సీ వర్గీకరణ అంశాన్నీ నరేంద్ర మోడీ దృష్టికి తెచ్చినట్టు తెలుస్తోంది. ఏపీకి చెందిన పోలవరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించినట్టే, తెలంగాణకు చెందిన కాళేశ్వరం లేదా కృష్ణాపై నిర్మిస్తున్న పాలమూరు ఎత్తిపోతల పథకానికి జాతీయ ప్రాజెక్టుగా గుర్తింపు ఇవ్వాలని కేసీఆర్ ప్రధానిని కోరారు. కేంద్రం వద్ద పెండింగ్‌లో ఉన్న తెలంగాణ నిధులను వీలైనంత త్వరగా విడుదల చేయించాలని కూడా ప్రధానిని కేసీఆర్ కోరారు.

ప్రధానితో చంద్రశేఖరరావు జరిపిన చర్చల వివరాలను తెరాస సీనియర్ నేత, ఎంపీ వినోద్ మీడియాకు వెల్లడించారు. అసెంబ్లీ, సెక్రటేరియట్‌ ను నిర్మించుకున్న ఏపీ సర్కారు - కోర్టు భవనం ఎందుకు నిర్మించటం లేదని ప్రశ్నించారు. కేసీఆర్ ఇదే అంశాన్ని ప్రధానితో చర్చించారని వెల్లడించారు. తెలంగాణకు ప్రత్యేక హైకోర్టు ఏర్పాటును గత రెండున్నరేళ్లుగా కావాలనే జాప్యం చేస్తున్నారని వినోద్ ఆరోపించారు. ఉమ్మడి హైకోర్టు విభజన వీలైనంత త్వరగా పూర్తి చేయాలని కెసిఆర్ ప్రధానిని కోరినట్టు వినోద్ తెలిపారు. హైకోర్టు విభజన అత్యంత ముఖ్యమైన హామీ. ఇది అమలుకాకుండా చేసేందుకు కోర్టుల్లో కేసులు వేయటం తదితర వ్యవహారాలతో జాప్యం చేస్తున్నారు అన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/