Begin typing your search above and press return to search.

తెలంగాణ‌లో వార్త‌లు ఏంటో చెప్పిన కేసీఆర్‌

By:  Tupaki Desk   |   25 April 2017 11:20 AM GMT
తెలంగాణ‌లో వార్త‌లు ఏంటో చెప్పిన కేసీఆర్‌
X
భ‌విష్యత్‌ లో తెలంగాణలో కరెంట్‌ సమస్య ఉండదని ముఖ్యమంత్రి కేసీఆర్ జోస్యం చెప్పారు. ఇకపై ఎప్పుడైనా కరెంట్‌ పోతే, అది వార్త అవుతుందని ఆయ‌న అన్నారు. హెచ్‌ ఐసీసీలో వ్యవసాయ అధికారులతో సమావేశమైన కేసీఆర్‌ మాట్లాడుతూ కొంతమంది గిట్టని వాళ్లు రాష్ట్రం ఏర్పడితే ఏదో జరుగుతుందని దుష్ఫ్రచారం చేశారని, అయితే విభజన తరువాత కష్టపడి దేశంలోనే అత్యధికంగా 21శాతం వృద్ధి రేటును సాధించామని కేసీఆర్‌ అన్నారు. ఇక రైతులకు ఉచిత ఎరువుల పంపిణీ సంచలానాత్మక నిర్ణయమని, నీతి అయోగ్‌ సమావేశంలో ముఖ్య మంత్రులు ఈ పథకాన్ని మెచ్చుకున్నారని ఆయ‌న వివ‌రించారు. ఎక్కువ మందికి ఉపాధి కల్పించేది వ్యవసాయ రంగమని, ఇకపై వ్యవసాయ అధికారులు రైతుల భాషలలో మాట్లాడాలని అన్నారు. అలాగే రైతుల ఆత్మహత్యలు ఆగిపోవాలని, క్రాప్‌ కాలనీలుగా తెలంగాణ పంట భూముల విభజన చేస్తామని కేసీఆర్ చెప్పారు.

రైతు ఇంటికే బిడ్డను ఇస్తామనే రోజులు రావాలనేది తన ఆకాంక్షని సీఎం కేసీఆర్ అన్నారు. వ్యవసాయ రంగంలో విప్లవాత్మక మార్పులు రావాలని సీఎం కేసీఆర్‌ అధికారులకు దిశానిర్దేశం చేశారు. హైదరాబాద్‌ లోని హైటెక్స్‌ లో రైతు హిత సదస్సులో సీఎం - వ్యవసాయ - ఉద్యానశాఖ అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ మన సమాజంలో రైతులకు గౌరవం తగ్గడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో ఎరువులు పోలీస్‌ స్టేషన్‌ లో పెట్టి పంపిణీచేశారని అయితే ఇప్పుడు ఎరువులు - విద్యుత్ కొరత లేకుండా చేయగలిగామని అన్నారు. రైతు సంఘాల్లో అవినీతి లేకుండా ఏఈవోలు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. ఏఈవోలు రైతులతో మంచి సంబంధాలు కలిగి ఉండాలన్నారు.

వ్యవసాయ అధికారులకు అవసరమైతే ద్విచక్రవాహనాల కోసం వడ్డీ లేని రుణాలు ఇస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. తమ పరిధిలోని భూముల సమగ్ర వివరాలు వ్యవసాయ అధికారుల వద్ద ఉండాలన్నారు. ఏ రైతు పేరిట ఎంత భూమి, ఏ సర్వే నంబర్‌ లో ఉందో వివరాలు ఏఈవోల వద్ద ఉండాలని సూచించారు. వ్యవసాయ రంగంలో యాంత్రీకరణ తప్పనిసరి అవుతున్నది. అన్ని గ్రామాల్లో రైతులు వాడుతున్న సాగు యంత్రాల వివరాలు ఏఈవోల వద్ద ఉండాలని సీఎం సూచించారు. వర్షపాతం - భూమి రకం - నీటి వనరుల ప్రాతిపదికన పంట కాలనీలు ఏర్పాటు చేయాలని అధికారులకు నిర్దేశించారు. ఏఈవోలు తమ కోసమే ఉన్నారనే భరోసా రైతుల్లో కలిగించాలన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/