Begin typing your search above and press return to search.

ముంబయికి రోజు ముందే కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?

By:  Tupaki Desk   |   9 March 2016 4:26 AM GMT
ముంబయికి రోజు ముందే కేసీఆర్ ఎందుకు వెళ్లినట్లు?
X
ఈ మధ్య కాలంలో కొన్ని అంశాలకు వచ్చి పడుతున్న ప్రచారం చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. విషయం పెద్దగా లేకున్నా.. విపరీతమైన హైప్ క్రియేట్ చేయటం ఈ మధ్యకాలంలో కామన్ గా మారింది. తాజాగా తెలంగాణ రాప్ష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మహారాష్ట్రకు వెళ్లి చారిత్రక తీర్మానాలు చేసుకొచ్చినట్లుగా ప్రచారం జరిగింది. దీనికి లభించిన ప్రచారం చూసినోళ్లకు మతి పోయిన పరిస్థితి.

ఒక రాష్ట్రానికి వెళ్లి ఒప్పందాలు చేసుకొని రావటమే విజయలక్ష్యంగా ఫీలైపోవటం టీఆర్ ఎస్ లోనే కనిపిస్తుంది. ఈ ఇష్యూలో ఇదో కోణం అయితే.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ తో చారిత్రక ఒప్పందం మంగళవారం మధ్యాహ్నం జరిగితే.. సోమవారం సాయంత్రానికే కేసీఆర్ అండ్ కో ముంబయికి ఎందుకు వెళ్లినట్లు అన్నది ఆసక్తికరంగా మారింది. ఒకపట్టాన ఇంటి నుంచి బయటకు (పక్క రాష్ట్రాలకు.. విదేశాలకు) వెళ్లటానికి సుతారం ఇష్టపడని కేసీఆర్.. తాజాగా మహారాష్ట్రకు మాత్రం ఒక రోజు ముందే ఎందుకు వెళ్లినట్లు? అన్న ప్రశ్నకు జవాబు వెతికితే కాస్తంత ఆసక్తికరమైన అంశమే బయటకు వస్తుంది.

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్.. మహారాష్ట్ర గవర్నర్ కమ్ బీజేపీ సీనియర్ నేత విద్యాసాగరరావు మధ్య అనుబంధం గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. మహారాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఆయన్ను హైదరాబాద్ కు పిలిపించుకొని మరీ పౌరసన్మానం చేసిన విషయాన్ని మర్చిపోకూడదు. మరి.. అంత జిగిరీ దోస్త్ రాష్ట్రానికి వెళ్లినప్పుడు ఒక పూట ముందు వెళ్లకుంటే ఎలా? అందుకే.. ముందురోజు సాయంత్రానికే మహారాష్ట్రకు కేసీఆర్ పయనమయ్యారు. ఆ రోజు రాత్రి రాజ్ భవన్ లో ఘనమైన విందులో పాల్గొన్నారు. తాను మిత్రుడి మనసు దోచుకునేలా గవర్నర్ విందు ఉందన్న మాట వినిపిస్తోంది. చారిత్రకఒప్పందంతో పాటు.. పసందైన విందును కేసీఆర్ ఎంజాయ్ చేశారన్న మాట బలంగా వినిపిస్తోంది.