Begin typing your search above and press return to search.

ఢిల్లీలో గులాబీ బాస్ కు చేదోడు ఎవరో తెలిస్తే అవాక్కే!

By:  Tupaki Desk   |   4 March 2022 11:30 PM GMT
ఢిల్లీలో గులాబీ బాస్ కు చేదోడు ఎవరో తెలిస్తే అవాక్కే!
X
సక్సెస్ కు.. ఫెయిల్యూర్ కు మధ్య తేడా చాలా సన్నటి గీత మాత్రమే. విజయం సాధించినోడికి.. అపజయాన్ని అనుభవిస్తున్నోడికి మధ్య తేడా ఏమిటి? అన్నది చూస్తే.. దేంతో అయితే విజయం సాధిస్తామో.. దాన్ని సరిగ్గా గుర్తించి.. సరైన రీతిలో ఉపయోగించుకున్నోడికి విజయం వరిస్తుంది. నిజానికి ఎవరిని ఎప్పుడు వాడాలో చాలామందికి తెలీదు. రంగం ఏదైనా సరే.. ఈ సూత్రం తెలిసినోళ్లకు తిరుగు ఉండదు. ప్రతి ఒక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంటుంది. అలాంటి దానిని ఎప్పుడు ఎంత మోతాదులో వాడాలో బాగా తెలిసినోడు.. ప్రతి ఒక్కరిని వాడేస్తుంటారు. మిగిలిన వారంతా సదరు మాస్టర్ మైండ్ చేత్తో వాడబడుతుంటారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ కోవకు చెందిన అధినేత.

ఆయన్ను.. ఆయన పని తీరును జాగ్రత్తగా పరికిస్తే.. ఆయన ప్రధాన ఆయుధాలుగా ఆయన కుమారుడు కేటీఆర్.. మేనల్లుడు హరీశ్ రావు.. దగ్గర బంధువు సంతోష్.. కుమార్తె కవితలు కనిపిస్తారు. ఆయన చుట్టూ ఉండే తలసాని శ్రీనివాస్ యాదవ్ కానీ.. కేకే కానీ.. వినోద్ కుమార్ కానీ.. ఇలాంటి వారంతా ఉన్నా.. ఎప్పుడు ఎవరు ఉండాలన్న విషయంలో కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తుంటారు. తన కుటుంబ సభ్యులు మొదలు.. తన పార్టీకి చెందిన ముఖ్యల వరకు అందరి విషయంలో ఆయన ఒకే సూత్రాన్ని పాటించటం ఆయనకున్న ప్రత్యేకత. చాలామంది అధినేతలు ఇక్కడే తప్పులో కాలేస్తారు.

తమ సంతానం విషయంలో వారు కాసిన్ని మినహాయింపులు పాటిస్తారు. కానీ.. కేసీఆర్ ఆ విషయంలో మరింత కఠినంగా ఉంటారు. చాలామందికి తెలీని విషయం.. మంత్రివర్గ సమావేశంలో అప్పుడప్పుడు తన కొడుకు కమ్ మంత్రి అయిన కేటీఆర్ కు సైతం అక్షింతలు పడుతుంటాయి. అంటే.. కొడుకు.. తన తర్వాత తన రాజకీయ వారసుడైన కేటీఆర్ నోటి నుంచి తేడా వస్తే.. మిగిలిన మంత్రివర్గ సభ్యుల ముందు ఒక మాట అనేయటానికి అస్సలు వెనుకాడరు.కన్న కొడుకు విషయంలోనే ఇంత కచ్ఛితంగా ఉండే అధినేత విషయంలో ఎవరు మాత్రం తోక జాడించే ప్రయత్నం చేస్తారు చెప్పండి?

మళ్లీ విషయానికి వస్తే.. హైదరాబాద్ లో ఉన్నప్పుడు.. పార్టీ వ్యవహారాల విషయంలో కేటీఆర్ కు అమితమైన ప్రాధాన్యత ఇచ్చే ఆయన.. జిల్లాలకు సంబంధించిన టాస్కుల్ని క్లియర్ చేసేందుకు హరీశ్ ను అస్త్రంగా వాడుతుంటారు. రాష్ట్ర రాజకీయాల వరకు చూసినప్పుడు కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవితకు పెద్దగా అవకాశాలు ఇవ్వనట్లుగా చెబుతారు. చాలా విషయాలు ఆమె జోక్యం లేకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. అలా అని ఆమెను తక్కువ చేసి చూడటం కేసీఆర్ ఆలోచన కాదన్నది మర్చిపోకూడదు.

హైదరాబాద్ లో ఉన్నప్పుడు కుమార్తె మీద తక్కువగా ఆధారపడే కేసీఆర్.. దేశ రాజధాని ఢిల్లీలో అడుగు పెట్టినప్పటి నుంచి మాత్రం కుమార్తెకు పెద్ద పీట వేసి.. ఆమెకు.. సంతోష్ కు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వటం కనిపిస్తుంది. గతంలో ఎంపీగా వ్యవహరించిన కవిత.. తన వాగ్ధాటితో అప్పట్లోనే పలువురితో చక్కటి సంబంధాలు కలిగి ఉండటం.. జాతీయస్థాయిలో తన పార్టీకి ముఖచిత్రంగా ఉండటంతో కవిత సక్సెస్ అయ్యారని చెబుతారు.

తాజా ఢిల్లీ పర్యటనలో ఉన్న కేసీఆర్.. తనతో భేటీ అయ్యే వారికి సంబంధించిన విషయాలు చూడటంతో పాటు.. వాటిని సమన్వయం చేయటంలో కవితనే కీ రోల్ ప్లే చేస్తుంటారని చెబుతారు. హైదరాబాద్ లో పరిమితంగా ఉండే ఆమె పరిధి.. ఢిల్లీ వరకు వచ్చేసరికి మాత్రం సీన్ మొత్తం మారుతుందంటారు. ఇదంతా తెలిశాక అనిపించేది ఒక్కటే.. కేసీఆరా మజాకానా అని.