ఎన్నికల ముందు వరాలు ప్రకటించటం అందరి స్టైల్. కానీ.. అందుకు భిన్నంగా.. ఎలాంటి కారణం లేకుండానే వరుస పెట్టి వరాలు ఇచ్చేయటం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు మాత్రమే సాధ్యమయ్యే వ్యవహారంగా చెప్పాలి. ఇటీవల కాలంలో.. వివిధ వర్గాల వారిని తనఅధికార నివాసానికి పిలిపించుకొని వారితో చర్చల మీద చర్చలు.. జరిపి ఊహించని రీతిలో వరాలు ఇచ్చేస్తున్న సీఎం కేసీఆర్.. తాజాగా మరో భారీ వరాన్ని ప్రకటించేశారు.
చిరు ఉద్యోగులు తమ కలలో కూడా ఊహించని రీతిలో భారీగా వేతనాల్ని పెంచేయటం ద్వారా.. వేలాది మంది మనసుల్ని ఒక్క నిర్ణయంతో దోచేసుకున్నారని చెప్పాలి. ఇప్పటికే పలు వరాల్ని ప్రకటించిన కేసీఆర్.. తాజాగా గ్రామీణ సంస్థ సహాయకులు.. అదేనండి వీవోఏల వేతనాల్ని భారీగా పెంచేస్తూ నిర్ణయం తీసుకున్నారు. అత్యంత తక్కువ వేతనానికి విధులు నిర్వర్తించే ఉద్యోగులకు భారీగా పెంచేసిన వైనం ఇప్పుడు ఆసక్తకిరంగా మారింది.
వీవోఏలకు ప్రస్తుతం రూ.500 నుంచి రూ.1500 మాత్రమే వేతనం లభిస్తోంది. ఇంత తక్కువ వేతనంతో విధులు నిర్వర్తించటంపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రియాక్ట్ అవుతూ.. వారి వేతనాల్ని ఒక్కసారిగా రూ.3500 పెంచేలా చర్యలు తీసుకుంటామని చెప్పేశారు. కేసీఆర్ తాజా వరంతో వీవోఏల వేతనం ఏకంగా రూ.5వేలకు చేరుకోనుంది. అయితే.. ఈ పెంచిన వేతనంలో గ్రమైక్య సంఘాల ద్వారా రూ.2వేలు.. రాష్ట్ర సర్కారు రూ.3వేలు చెల్లిస్తుందని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో ఏన్నో ఏళ్లుగా తమ వేతనం గురించి మొత్తుకున్నా.. ఎవరూ తమను పట్టించుకోలేదని చెబుతున్న వీవోఏలు.. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ వరంపై ఆనందంతో ఉబ్బితబ్బుబ్బి పోతున్నారు.
తాజాగా ప్రకటించిన వరంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీవోఏలుగా పని చేస్తున్న 18405 మందికి ప్రయోజనం చేకూరనుంది. ఒక్క నిర్ణయంతో దాదాపు 19వేల కుటుంబాల్ని ఆనందంతో నింపేసిన కేసీఆర్ నిర్ణయం.. వారి అభిమానాన్ని ఎంతలా కొల్లగొడుతుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం ఉండదేమో. మరి.. భారీగా పెంచుతూ తీసుకున్న తాజా నిర్ణయంపై రాష్ట్ర సర్కారుపై ఎంత మేర అదనంగా భారం పడనుందన్న లెక్క విషయంలో స్పష్టత రావాల్సి ఉంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/