అనూహ్యంగా మంత్రివర్గ విస్తరణ కార్యక్రమాన్ని తెర మీదకు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. మరిన్ని ఆసక్తికర నిర్ణయాలు తీసుకున్నారని చెప్పాలి. గడిచిన కొద్దికాలంగా ప్రభుత్వం ఎలాంటి పని చేయకుండా నిద్రాణంగా ఉన్నట్లు కనిపించిన దానికి భిన్నంగా వరుస పెట్టి నిర్ణయాల మీద నిర్ణయాలు తీసుకుంటున్నారు కేసీఆర్. ఓపక్క విస్తరణకు ముహుర్తం డిసైడ్ చేసిన ఆయ... అసెంబ్లీ చీఫ్ విప్ గా వినయ్ భాస్కర్ ను..మండలికి బోడకుంటి వెంకటేశ్వర్లను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. మరో ఆరుగురికి విప్ బాధ్యతల్ని కట్టబెడుతున్నారు.
ఇక.. మండలి ఛైర్మన్ గా గుత్తా సుఖేందర్ రెడ్డికి చోటు కల్పించనున్నారు. మొదట్లో గుత్తాను మంత్రివర్గంలో తీసుకుంటారన్న ప్రచారం సాగింది. అందుకు భిన్నంగా ఆయన్ను మండలికి ఛైర్మన్ గా నియమించాలని కేసీఆర్ డిసైడ్ చేసినట్లుగా తెలుస్తోంది. అంతేకాదు.. ఇప్పటికే ఖాళీగా ఉన్న బోలెడన్ని నామినేట్ పదవుల్ని కూడా భర్తీ చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక.. పార్టీ సీనియర్లు అయిన సిరికొండ మధుసూదనాచారి.. జూపల్లి..కడియం.. నాయిని.. పద్మా దేవేందర్.. పల్లాకు పదవుల్ని కేటాయించనున్నట్లు చెబుతున్నారు. ఇవే కాకుండా మరో 12 మంది ఎమ్మెల్యేలను వివిధ కార్పొరేషన్ పదవుల్ని కట్టబెట్టనున్నట్లు చెబుతున్నారు.
ఇదంతా ఒక ఎత్తు అయితే.. కీలక శాఖల్లో మార్పులు చేయనున్నారా? అంటే అవునని చెబుతున్నారు. ఇప్పటివరకూ హోంమంత్రిగా వ్యవహరిస్తున్న మహమూద్ అలీ స్థానంలో సబితకు హోం పగ్గాలు ఇచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇక.. ఐటీ మంత్రిగా మంచి పేరు తెచ్చుకున్న కేటీఆర్ కు ఆ శాఖతో పాటు.. మున్సిపల్ శాఖను కట్టబెడతారని తెలుస్తోంది. ఆర్థికమంత్రిగా హరీశ్ కు గతంలో ఆయన నిర్వహించిన ఇరిగేషన్ శాఖకు బదులుగా ఆర్థిక శాఖను కేటాయిస్తారని చెబుతున్నారు. ఇలా పలు మార్పులకు కేసీఆర్ శ్రీకారం చుట్టినట్లుగా తెలుస్తోంది.