Begin typing your search above and press return to search.

సీఎంగా కేటీఆర్.. కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ అయ్యారా?

By:  Tupaki Desk   |   4 Jan 2020 5:05 AM GMT
సీఎంగా కేటీఆర్.. కేసీఆర్ ఇప్పటికే డిసైడ్ అయ్యారా?
X
సంచలన విషయం ఒకటి బయటకు వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమించేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు తెర వెనుక జరుగుతున్నాయా? అంటే అవునని చెబుతున్నారు. ఒక ప్రముఖ మీడియా సంస్థ పబ్లిష్ చేసిన ప్రత్యేక కథనంలో దీనికి సంబంధించిన ఆసక్తికర అంశాల్ని ప్రస్తావించారు. తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి కేటీఆర్ అన్న మాట అందరికి తెలిసిందే అయినా.. అదెప్పుడో కాదు మున్సిపోల్స్ తర్వాతనే అన్న కొత్త విషయాన్ని తాజా కథనంలో పేర్కొన్నారు. దీనికి కారణాలు ఏమిటన్న విషయాన్ని అందరూ ఆమోదించే లాజిక్కుల్ని తెర మీదకు తీసుకొచ్చారు.

అంతేకాదు.. కేటీఆర్ ను సీఎం చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఎందుకు ఉన్నారు? తనకు అత్యంత సన్నిహితుల వద్ద కేసీఆర్ ఈ అంశంపై ఎలాంటి వాదనను వినిపిస్తున్నారన్నది చెప్పుకొచ్చారు. ఇటీవల కాలంలో మంత్రులు పువ్వాడ అజయ్.. శ్రీనివాసగౌడ్.. తలసాని.. ఎర్రబెల్లి.. ఇలా ఒక్కొక్కరు కేటీఆర్ తమకు కాబోయే సీఎం అన్న విషయాన్ని ప్రస్తావించటం తెలిసిందే. సీఎం పదవిని చేపట్టే విషయంలో ఇప్పటికిప్పుడు ఎలాంటి అవకాశాల్లేవని మంత్రి కేటీఆర్ స్పష్టం చేసిన తర్వాత కూడా మంత్రి ఎర్రబెల్లి నోటి నుంచి వచ్చిన వ్యాఖ్యలన్ని ఒక వ్యూహం ప్రకారం వస్తున్నాయా? అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారుతున్నాయి.

రెండో దఫా పవర్లోకి వచ్చి ఏడాది మాత్రమే అయిన వేళ.. కేటీఆర్ ను ముఖ్యమంత్రి చేయాలన్న ఆలోచనలో కేసీఆర్ ఎందుకు ఉన్నారన్న దానికి ఆసక్తికర అంశాల్ని ప్రస్తావిస్తున్నారు. యూపీఏ ప్రభుత్వంలో రెండో దఫా అధికారం చేపట్టిన కొద్ది కాలానికే రాహుల్ ను ప్రధాని చేసి ఉంటే బాగుండదేని.. ఆ మాటకువస్తే యూపీఏ 1లోనే రాహుల్ కు ఏదైనా మంత్రిత్వ శాఖను అప్పగించి ఉంటే.. తన సత్తాను ప్రదర్శించి ఉండేవారని.. తర్వాతి కాలంలో ఆయన్ను ప్రధాని చేసి ఉంటే.. ఇప్పటి గడ్డు పరిస్థితిని కాంగ్రెస్ ఎదుర్కొనేది కాదన్న మాటను కొందరు సన్నిహితుల వద్ద కేసీఆర్ ప్రస్తావించినట్లు చెబుతున్నారు.

ప్రస్తుతం మారిన రాజకీయ పరిస్థితుల్లో కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రావటం.. రాహుల్ ప్రధాని కావటం కత్తి మీద సామేనన్నది కేసీఆర్ వాదన. సమయం తనకు అనుకూలంగా ఉన్న వేళలో అధికారాన్ని అప్పజెప్పి ఉంటే.. పని తీరుతో ఒక ఛరిష్మా వచ్చేదని.. అది విమర్శలకు చెక్ పెట్టేదన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. రాహుల్ విషయంలో సోనియా చేసిన తప్పును తాను చేయకుండా ఉండేందుకు వీలుగా.. సరైన సమయంలో సరైన రీతిలో కేటీఆర్ ను ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చోబెట్టాలన్న ఆలోచనలో సీఎం ఉన్నట్లుగా చెబుతున్నారు.

రాష్ట్రంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో మున్సిపోల్స్ లో అధికార టీఆర్ఎస్ పార్టీకి తిరుగు ఉండదని.. ఇలాంటి సానుకూలత మెండుగా ఉన్న సమయంలోనే కేటీఆర్ కు ముఖ్యమంత్రిపదవీ పట్టాభిషేకాన్ని పూర్తి చేయాలన్నది కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. విన్నంతనే ఓకే అనే లాజిక్ బాగానే ఉన్నా.. కేటీఆర్ కు ఇప్పటికిప్పుడు సీఎం పదవిని అప్పగిస్తారా? అన్నది మరో క్వశ్చన్. మరేం జరుగుతుందో కాలమే చెప్పాలి.