Begin typing your search above and press return to search.

వెళ్లింది పెట్టుబడులకా..కాంట్రాక్టులు ఇవ్వడానికా?

By:  Tupaki Desk   |   13 Sep 2015 5:58 AM GMT
వెళ్లింది పెట్టుబడులకా..కాంట్రాక్టులు ఇవ్వడానికా?
X
ఇంతకూ కేసీఆర్‌ మరియు ఆయన వెనుక జంబో టీం చైనా వెళ్లింది.. అక్కడినుంచి తేవడానికా... వారికి ఇవ్వడానికా...? అని ఇప్పుడు సందేహం కలుగుతోంది. రోజుకొక పారిశ్రామిక భేటీలతో.. అక్కడి పరిశ్రమల్ని తెలంగాణకు తీసుకువచ్చేస్తున్నట్లుగా ఒప్పందాలు చేసేసుకుంటున్నట్లుగా చైనా నుంచి వార్తలు పుంఖాను పుంఖాలుగా వచ్చేస్తూనే ఉన్నాయి. చైనా తరహాలో పారిశ్రామిక వాడలను కూడా తెలంగాణలో ఏర్పాటుచేసేస్తాం అని - తమ వద్ద ల్యాండ్‌ బ్యాంక్‌ కూడా పుష్కలంగా ఉన్నదని కేసీఆర్‌ అక్కడి వారికి హామీలు ఇస్తున్నారు. అంతా బాగానే ఉంది. అయితే.. అక్కడ పారిశ్రామికవేత్తలు తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఎందరు సిద్ధంగా ఉన్నారనేది మాత్రం తెలియడం లేదు. ఈలోగానే.. అక్కడి కంపెనీలకు ఇక్కడ మన తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన కాంట్రాక్టులు ఇచ్చేసేలా కూడా ఒప్పందాలు జరుగుతున్నాయి.

చైనా నిర్మాణ టెక్నాలజీ సూపర్‌.. అని అనుకుంటూ.. తెలంగాణలో పేదలకు నిర్మించి ఇస్తాం అంటున్న టూ బెడ్‌ రూం హౌస్‌ ల నిర్మాణం కాంట్రాక్టును చైనాలోని సాని అనే కంపెనీకి అప్పగించడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఇలా ఏకపక్షంగా కాంట్రాక్టులు ఇచ్చేస్తున్నారనే చెడ్డ పేరు రాకుండా.. జీహెచ్‌ ఎంసీ పరిధిలోని కొన్ని చెరువులను బాగు చేసేందుకు సహకరించాలని సానీ సంస్థను కోరుతున్నట్లుగా కూడా సెలవిస్తున్నారు. ఒకవైపు చెరువుల బాగుకు వారి సహకారం తీసుకుంటూ - అందుకు ప్రతిగా.. వారికి టూబెడ్‌ రూం ఇళ్ల నిర్మాణం కాంట్రాక్టు అప్పగించాలనేది ప్లాన్‌ గా కనిపిస్తోంది.

చాలా భారీ ఎత్తున చైనా నుంచి పెట్టుబడులను ఆకర్షించడానికి కేసీఆర్‌ తన బృందాన్ని వెంటబెట్టుకుని వెళ్లారు. తన వంతు ప్రయత్నలోపం లేకుండా చేస్తూనే ఉన్నారు. కానీ ప్రత్యేకించి చైనా ఆర్థికరంగమే దారుణంగా ఉండగా.. అక్కడినుంచి పెట్టుబడులు రావడం - మన ప్రభుత్వ ంకోరుతున్నట్లుగా.. చెరువుల శుద్ధి లాంటి కార్యక్రమాలకు సహకారం రావడం అనేది కల్లగా కనిపిస్తోంది. అయితే.. అక్కడి కంపెనీలకు మన సొత్తును కాంట్రాక్టుల రూపంలో ఇవ్వదలచుకుంటే మాత్రం తీసుకోవడనికి వారికి అభ్యంతరం ఉండకపోవచ్చు. సానీ కంపెనీ కార్యకలాపాలు తెలంగాణలో మొదలైనా కావొచ్చు. కాకపోతే.. ఏదో తేవడానికి వెళ్లి, ఇచ్చి వచ్చినట్లుగా మనం అనుకోవాలి.