Begin typing your search above and press return to search.

కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్? ఇప్పుడు సన్ స్ట్రోక్ కూడా మొదలైందా?

By:  Tupaki Desk   |   24 Aug 2022 6:31 AM GMT
కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్? ఇప్పుడు సన్ స్ట్రోక్ కూడా మొదలైందా?
X
రాజకీయ అధినేత అన్న తర్వాత ఎప్పుడూ పైచేయి ఒకరిదే ఉండదు. ఎత్తుపల్లాలు మామూలే. అందులోకి అనిశ్చితికి కేరాఫ్ అడ్రస్ గా నిలిచే రాజకీయాల్లో మరింత ఎక్కువగా ఉంటుంది. మిగిలిన రాజకీయ అధినేతలకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక వ్యత్యాసం ఉంది. తెలంగాణ ఉద్యమం ఒక మోస్తరుగా ఉన్నప్పుడు ఆయన తిన్నన్ని ఎదురుదెబ్బలు మరెవరూ తినలేదు. దెబ్బలు తినేందుకే ఆయన ఉన్నారా? అన్నట్లుగా ఆయన రాజకీయ ప్రస్థానం సాగేది. దివంగత మహానేత వైఎస్ అనూహ్య మరణం తర్వాత మారిన రాజకీయ సమీకరణలతో మొదలైన కేసీఆర్ ప్రభ.. అప్పటి నుంచి ఇటీవల కాలం వరకు ఎదురులేనట్లుగా మారింది.

ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. కేసీఆర్ కు సంబంధించిన విషయాల్ని చూసినప్పుడు అది బాధ అయినా.. సంతోషమైనా ఫుల్ ప్యాక్ అన్నట్లుగా ఉంటుంది. ఎదురుదెబ్బల పర్వానికి పుల్ స్టాప్ పడిన నాటి నుంచి ఆయనకు రాజయోగం మొదలైంది. ఒక దశలో ఆయన్ను ఉద్దేశించి చిన్నపాటి విమర్శ చేయటానికైనా తెలంగాణలోని అన్ని పార్టీల నేతలు వణికేవారు. ఆచితూచి అన్నట్లుగా మాట్లాడారు. అలాంటి పరిస్థితి నుంచి ఆయనకు ఇప్పుడు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో చూస్తున్నదే.

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా విమర్శలతో ఉతికి ఆరేస్తున్నారు. ఇప్పటివరకు తెలంగాణలో కేసీఆర్ దే పెద్ద గొంతు అనుకునే స్థాయి నుంచి.. ఆయనకు మించినోళ్లు చాలామందే ఉన్నారన్న విషయాన్ని సోషల్ మీడియా సాక్షిగా తమను తాము ప్రదర్శించుకుంటున్నారు. ఇటీవల కాలంలో సీఎం కేసీఆర్ మీద వస్తున్న విమర్శలను చూసినోళ్లు ఎవరైనా.. ఎలాంటి కేసీఆర్.. ఎలాంటి మాటలు పడాల్సి వస్తోంది? అన్న భావన కలిగే పరిస్థితి. ఢిల్లీలో వెలుగు చూసిన లిక్కర్ స్కాంలో అనూహ్యంగా సీఎం కేసీఆర్ కుమార్తె కమ్ ఎమ్మెల్సీ కవిత పేరు తెర మీదకు రావటం తెలిసిందే. ఢిల్లీకి చెందిన బీజేపీ నేతలు ఆమెపై తీవ్ర ఆరోపణలు చేయటం.. దీనిపై ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ.. పరువు నష్టం దావాలను వేశారు కవిత. అయితే.. ఈ ఎపిసోడ్ కు సంబంధించిన సీఎం కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ తగిలినట్లేనన్న మాట సోషల్ మీడియాలో వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే.. వరుస పెట్టి వాసవి.. ఫినిక్స్ రియల్ ఎస్టేట్ సంస్థల్లో భారీగా సాగుతున్న ఐటీ దాడులు కూడా 'టార్గెట్' చేసి చేస్తున్నవే తప్పించి.. నార్మల్ కాదన్న మాట వినిపిస్తోంది. ఈ రెండు బడా రియల్ ఎస్టేట్ సంస్థలకు సంబంధించి మంత్రి కేటీఆర్ కు లింకులు ఉన్నాయన్న దానిపై బోలెడన్ని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కాంగ్రెస్ సీనియర్ నేత.. ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే.. ఫినిక్స్ కంపెనీ యజమాని చుక్కపల్లి సురేశ్ కల్వకుంట్ల కుటుంబానికి బినామీ. రాజకీయ ప్రముఖులు.. ఉన్నతాధికారులతో ఆయనకు సంబంధాలు ఉన్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నికల వేళ చుక్కపల్లి అక్కడున్న సిమెంట్ కంపెనీలకు ఫోన్ చేసి మరీ.. టీఆర్ఎస్ కు మద్దతు ఇవ్వాలని బెదిరించినట్లుగా ఆరోపించారు.

చుక్కపల్లి సురేష్ కు.. కల్వకుంట్ల కుటుంబానికి మధ్యనున్న సంబంధాలపై తన వద్ద పూర్తి ఆధారాలు ఉన్నాయంటూ బాంబు పేల్చారు. ఇదిలా ఉంటే.. అక్రమ మద్యం వ్యాపారంపై చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. తెలంగాణ నేతలే ఢిల్లీ లిక్కర్ స్కాంకు ఆద్యులని ఆరోపించారు. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలోనే నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నాయని.. ఇదంతా చూస్తే తెలంగాణ మద్యం అమ్మకాల్లో ఎంతో స్కాం జరిగిందన్న అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ విమర్శలు.. ఆరోపణలు చూస్తున్న వారంతా..

సీఎం కేసీఆర్ కు ఎప్పుడూ ఎదురుకాని కొత్త అనుభవం ఎదురైందన్న మాట వినిపిస్తోంది. ఇంతకాలం రాజకీయ అధినేతలకు సన్ స్ట్రోక్ మాత్రమే తగులుతుందని.. తాజాగా సీఎం కేసీఆర్ కు డాటర్ స్ట్రోక్ కూడా తగిలిందన్న వ్యాఖ్యలు చేస్తున్నారు. మరి.. ఇందులో నిజానిజాలేమిటన్నది కాలమే సరైన సమాధానం ఇవ్వగలదు.