Begin typing your search above and press return to search.

కేసీయార్ అసలు వ్యూహం ఇదేనా ?

By:  Tupaki Desk   |   5 Aug 2021 5:30 AM GMT
కేసీయార్ అసలు వ్యూహం ఇదేనా ?
X
అన్నీ వైపుల నుండి పెరిగిపోతున్న వ్యతిరేకత నుండి బయటపడేందుకే కేసీయార్ ప్రత్యేకంగా ఓటుబ్యాంకును ఏర్పాటు చేసుకుంటున్నట్లే ఉంది. లేకపోతే హఠాత్తుగా దళిబంధు పథకంపై ఎందుకింతగా దృష్టిపెట్టారు ? ఒకవైపు ఈనెల 16వ తేదీన హుజూరాబాద్ నియోజకవర్గం పర్యటనలో పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు గతంలోనే కేసీయార్ చెప్పారు. అయితే ఉన్నట్టుండి భువనగిరి-యాదాద్రి జిల్లాలోని వాసాలమర్రి గ్రామంలో బుధవారంమే పథకాన్ని ప్రారంభించేసినట్లు ప్రకటించారు.

తాను దత్తత తీసుకున్న వాసాలమర్రి గ్రామంలోనే దళితబంధు పథకాన్ని ప్రారంభించినట్లు చెప్పిన కేసీయార్ హుజూరాబాద్ లో ప్రారంభమన్నది కేవలం లాంఛనమే అని సమర్ధించుకున్నారు. వాసాలమర్రిలోని 76 కుటుంబాలకు పథకాన్ని వర్తింపచేస్తున్నట్లు చెప్పారు. గురువారం వారి ఖాతాల్లోకి తలా రు. 10 లక్షలు పడతాయని కూడా ప్రకటించారు. ముందేమో హుజూరాబాద్ లోని దళితుల్లో 100 మందికి పైలెట్ ప్రాజెక్టుగా దళితబంధు పథకాన్ని ప్రారంభింస్తున్నట్లు గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా వ్యవహరించారు.

సర పథకాన్ని ఎక్కడ ప్రారంభించాలి ? ఎంతమందికి వర్తింపచేయాలనేది పూర్తిగా సీఎం ఇష్టమనటంలో సందేహంలేదు. అయితే వాసాలమర్రిలో మాట్లాడుతు పథకం అమలుకు లక్ష కోట్ల అవసరమని చెప్పారు. లక్ష కోట్లే కాదు ఇంకా ఎంతైనా తీసుకొచ్చి దళితుల అభవృద్ధికి కష్టపడతానని చెప్పటమే విచిత్రంగా ఉంది. దళితులందరు వ్యాపారాలు చేసుకుని అభివృద్ధిలోకి రావాలన్నదే తన లక్ష్యంగా చెప్పుకున్నారు. పేదలు, వ్యాపారాలు చేసుకుని అభివృద్ధిలోకి రావాలని అనుకుంటున్న వారు అన్నీ సామాజికవర్గాల్లోను ఉన్నారన్న విషయాన్ని కేసీయార్ పట్టించుకోవటంలేదు.

మిగిలిన సామాజికవర్గాలను పక్కనపెట్టేసి పూర్తిగా దళితుల గురించే మాట్లాడుతున్నారంటే వారిని ఓటుబ్యాంకుగా చేసుకోవాలనే ప్లాన్ లో కేసీయార్ ఉన్నట్లు ఆరోపణలు మొదలైపోయాయి. రాష్ట్రం మొత్తం జనాభాలో ఎస్సీలే ఎక్కువని కాబట్టే వారి ఓట్లపై కేసీయార్ కన్నేసినట్లు ప్రతిపక్షాలు ఇప్పటికే ఆరోపణలు మొదలుపెట్టేశాయి. దళితబంధు పథకంలో లబ్దిదారులు నిధులను దుర్వినియోగం చేస్తే ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటునే విషయంలో ఎవరకీ క్లారిటిలేదు.

నిజానికి దళితులకు ఆర్ధికసాయం అందించేందుకు దశాబ్దాలుగా ఎస్సీ కార్పొరేషన్ ఉంది. దానిద్వారా నిధులందుకున్న దళితులు ఏ మేరకు సక్సెస్ అయ్యారు ? ఎంతమంది ఫైల్ అయ్యారు ? అనే విషయాలను ప్రభుత్వం ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చు. అసలు ఎస్సీ కార్పొరేషన్ కు ఇప్పటివరకు కేటాయించిన నిధులన్నీ ఏమయ్యాయో కూడా ఎవరికీ లెక్కలు తెలీదు. ఇదిలా ఉండగానే కొత్తగా దళితబంధు పథకం అన్నారంటేనే పూర్తిగా ఓటుబ్యాంకు ఏర్పాటే లక్ష్యంగా కేసీయార్ పావులు కదుపుతున్నట్లు అర్ధమైపోతోంది. మరి భవిష్యత్తులో ఏమి జరుగుతుందో చూడాల్సిందే.