Begin typing your search above and press return to search.

ఎన్‌జీటీలో కేసీఆర్ ధిక్కార పిటిష‌న్‌.. సీమ ఎత్తిపోత‌ల‌పై ఫిర్యాదు

By:  Tupaki Desk   |   6 July 2021 5:34 AM GMT
ఎన్‌జీటీలో కేసీఆర్ ధిక్కార పిటిష‌న్‌.. సీమ ఎత్తిపోత‌ల‌పై ఫిర్యాదు
X
ఏపీ సీఎం జ‌గ‌న్‌కు తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ గ‌ట్టి కౌంట‌ర్ ఇచ్చారు. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జ‌ల‌వివాదాన్ని తార‌స్థాయికి తీసుకువెళ్లే నిర్ణ‌యం తీసుకుని.. ఆదిశ‌గా అడుగులు వేశారు. జాతీయ హరిత ట్రైబ్యునల్‌ ఆదేశాలను ధిక్కరిస్తూ రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఏపీ సర్కారు కొనసాగిస్తోందంటూ ట్రైబ్యునల్‌లో ధిక్కార పిటిషన్‌ వేసింది. మరోపక్క ఆ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు ఇవ్వరాదంటూ కేంద్ర ప్రభుత్వంలోని సంబంధిత శాఖలను కోరుతూ లేఖ రాశారు.

కృష్ణా బోర్డు 9వ తేదీన తలపెట్టిన త్రిసభ్య కమిటీ సమావేశాన్ని ఏపీ ఫిర్యాదులకే పరిమితం చేయడాన్ని సవాలు చేస్తూ బోర్డుకు కూడా లేఖ రాశారు. తెలంగాణ లేవనెత్తిన అంశాలను కూడా ఎజెండాలో చేర్చి, 20వ తేదీ తర్వాత పూర్తిస్థాయి బోర్డు సమావేశాన్ని ఏర్పాటు చేయాలని కోరింది. అంతేకాదు, ఏపీ సర్కారు అక్రమంగా నిర్మిస్తున్న ప్రాజెక్టులకు వ్యతిరేకంగా అన్నిచోట్లా వాదనలు వినిపించాలని అధికారులను సీఎం కేసీఆర్ ఆదేశించారు. జల విద్యుదుత్పత్తిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపవద్దన్నారు.

ఈ నెల 12న విచారణకు రానున్న రాయలసీమ ఎత్తిపోతల పథకంపై జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో బలంగా గళం విప్పాలని సూచించారు. ఈ క్ర‌మంలో తెలంగాణ నీటిపారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్‌ కుమార్‌ సోమవారం జాతీయ హరిత ట్రైబ్యునల్‌లో ఏపీ సర్కారుపై ధిక్కార పిటిషన్‌ దాఖలు చేశారు. రాయలసీమ ఎత్తిపోతల పనులు నిలిపివేయకపోతే జైలుకు వెళతారని ఇటీవలే ఎన్జీటీ హెచ్చరికలు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 12న ఎన్జీటీలో ఈ కేసు విచారణకు రానుంది.

ఈలోగా పనులను పరిశీలించి, నివేదిక ఇవ్వాలని కేఆర్‌ఎంబీని ఎన్జీటీ ఆదేశించింది. ఇదే క్రమంలో తెలంగాణ కూడా అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో పనులు నిలిపివేయాలంటూ ఏపీని కేఆర్‌ఎంబీ కూడా కోరింది. తమ పర్యటన కోసం నోడల్‌ అధికారిని నియమించాలని బోర్డు సభ్య కార్యదర్శి లేఖలు కూడా రాశారు. అయితే, నోడల్‌ అధికారి నియామకానికి ఏపీ విముఖత చూపుతూ సహాయ నిరాకరణ చేస్తోంది. ఆ లేఖ ప్రతులతో పాటు ప్రాజెక్టు నిర్మాణం ఫొటోలు, ప్రాజెక్టు టెండర్లను కేటాయిస్తూ ఏపీ ఈ-ప్రొక్యూర్‌మెంట్‌ వెబ్‌సైట్‌లో పొందుపరిచిన వివరాలను కూడా తెలంగాణ ప్రభుత్వం ధిక్కార పిటిషన్‌కు అనుబంధంగా సమర్పించింది.

వన్యప్రాణుల అభయారణ్యానికి, పర్యావరణానికి గొడ్డలిపెట్టుగా మారిన రాయలసీమ ఎత్తిపోతలకు ఎట్టి పరిస్థితుల్లోనూ పర్యావరణ అనుమతులు ఇవ్వరాదంటూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. నీటి కేటాయింపులు, కేంద్ర జలవనరుల సంఘం (సీడబ్ల్యూసీ) అనుమతులు లేకుండా ఈ ప్రాజెక్టును కడుతున్నారని ఫిర్యాదు చేశారు. పోతిరెడ్డిపాడుకు కూడా కేంద్ర జల వనరుల సంఘం అనుమతి లేదని నివేదించారు. కేంద్ర జల వనరుల శాఖ కూడా సీడబ్ల్యూసీ అనుమతి తీసుకోకుండా చేపట్టరాదని ఆదేశించిన విషయాన్ని గుర్తు చేశారు. ఫిర్యాదుతో పాటు అభయారణ్యాల పరిధిని, ఫొటోలను జత చేశారు.

తెలంగాణ ఎత్తిపోతలు నడవాలంటే, వానాకాలం సీజన్‌కు నీరందించాలంటే విద్యుత్‌ అవసరమని, దీని కోసమే ఉత్పాదన చేస్తున్నామని తెలిపారు. సాగర్‌ ఆయకట్టు, తెలంగాణ తాగు, సాగునీటి అవసరాల కోసమే శ్రీశైలంలో విద్యుదుత్పత్తి చేస్తూ, నీటిని సాగర్‌కు వదులుతున్నామని వివరించారు. పూర్తి స్థాయి బోర్డు సమావేశం పెడితే చర్చించాల్సిన అంశాలను లేఖలో పొందుపరిచారు. మొత్తంగా చూస్తే.. జ‌గ‌న్‌కు కౌంట‌ర్ గా కేసీఆర్ దాఖ‌లు చేసిన ధిక్కార పిటిష‌న్‌తో వివాదం మ‌రింత ముద‌ర‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.