Begin typing your search above and press return to search.

మోడీ గుట్టు విప్పిన కేసీఆర్

By:  Tupaki Desk   |   29 Jan 2016 11:30 AM GMT
మోడీ గుట్టు విప్పిన కేసీఆర్
X
ఏపీ నూతన రాజధాని అమరావతి కేంద్రం ఇస్తున్న సాయం అంతంతమాత్రమేనని ఎవరిని అడిగినా చెబుతారు.. చంద్రబాబు నాయుడు మాత్రం అమరావతి శంకుస్థాపన సందర్భంగానైనా మోడీ మనసు కరిగి నిధులో.. ఇంకొకటో ఇంకొకటో అనౌన్సు చేస్తారని ఆశించి ఆయన్ను పిలిచారు. అయితే... మోడీని పిలవడం వల్ల వచ్చిన లాభం కంటే పోయిన నష్టమే ఎక్కువని అప్పుడే అనుకున్నారు. తాజాగా తెలంగాణ సీఎం కేసీఆర్ మాటలతో ఆ విషయం నిజమని తేలింది. అమరావతి శంకుస్థాపనకు చంద్రబాబు పిలుపు మేరకు వెళ్లిన తాను తెలంగాణ ప్రజల తరఫున అమరావతికి విరాళం ప్రకటించాలని అనుకున్నానని.. కానీ, మోడీయే ఉత్తచేతులతో రావడంతో తాను ప్రకటిస్తే బాగుండదని చెప్పి ఆగిపోయానని ఆయన అన్నారు. ఇంతకీ ఇన్ని రోజుల తరువాత ఆయన ఈ విషయం ఎందుకు వెల్లడించారో తెలుసా... గ్రేటర్ ఎన్నికల నేపథ్యంలో టీడీపీ నేతల ప్రచారానికి కౌంటర్ గా ఆయన ఈ మాట ఇప్పుడు బయటపెట్టారు.

గ్రేటర్ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తే హైదరాబాద్ మరింత అభివృద్ధి చెందుతుందని టీడీపీ నేతలు ప్రచారం చేస్తుండడంతో తెలంగాణ సీఎం కేసీఆర్ వారిని ఎద్దేవా చేశారు. అమరావతికే దిక్కులేదు.. ఇక హైదరాబాద్‌ కు నిధులెక్కడి నుంచి తెచ్చి అభివృద్ధి చేస్తారని టీడీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఈ సందర్భంగా అమరావతి శంకుస్థాపన రోజు జరిగిన సంఘటనను కేసీఆర్ గుర్తు చేశారు. కొత్తగా కడుతున్న రాజధానికి తెలంగాణ ప్రభుత్వం తరపున విరాళం ప్రకటించాలనుకునే శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్లానని చెప్పారు. అయితే అక్కడి పరిస్థితి చూసిన తర్వాత వెనక్కు తగ్గానని చెప్పారు. వేదిక మీద ఉండగా ప్రధాని మోదీ రెండు కుండలు తెచ్చి టీపాయ్‌ మీద పెట్టారని.. అందులో ఏముందని తాను పక్కనే ఉన్న వెంకయ్యనాయుడిని అడిగానని... అందులో మట్టి - నీరు ఉన్నాయని ఆయన చెప్పడంతో మొత్తం విషయం అర్థమైందని... వెంకయ్య కూడా ప్రధాని ప్రసంగానికి ముందే ఆయన సాయమేమీ చేయరని తనతో చెప్పారని.. దాంతో తాను విరాళం చేయాలన్న ఆలోచన మానుకున్నానని చెప్పారు.

ప్రధానే ఏమీ ప్రకటించనప్పుడు తాను ప్రకటిస్తే అస్సలు బాగుండదని... అందుకనే ఆగిపోయానని... పైగా తన మనసులోని మాటను అదే రోజు చంద్రబాబు, ఏపీ మంత్రి యనమలతో చెప్పానని కూడా కేసీఆర్ బయటపెట్టారు. తాను ఆ సంగతి చెప్పగానే వారు కూడా నవ్వారని కేసీఆర్ అన్నారు. అలా అమరావతికి నిధులు తెచ్చుకోలేనివారు హైదరాబాద్ కోసం ఏం నిధులు తెస్తారని ఆయన ఎద్దేవా చేశారు. ఇంతకీ కేసీఆర్ విరాళం ఎంత ప్రకటించాలనుకున్నారో తెలుసా..? ఆయన తన నోటితో తాను ఇప్పుడు చెప్పలేదు కానీ అప్పట్లో బయటకొచ్చిన సమాచారం ప్రకారం ఆయన 200 కోట్లు ఇవ్వాలని అనుకున్నారట. మొత్తానికి అప్పటి ముచ్చట్లు చెప్పి కేసీఆర్ ఒకేసారి మోడీ, చంద్రబాబు ఇద్దరి పరువూ తీశారు కేసీఆర్.