Begin typing your search above and press return to search.

గమనించారా: ‘జెండా పాతేశాం’ అని మళ్లీ అనలేదు

By:  Tupaki Desk   |   31 Jan 2016 11:30 AM GMT
గమనించారా: ‘జెండా పాతేశాం’ అని మళ్లీ అనలేదు
X
గ్రేటర్ ఎన్నికల సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మొదలుకొని తెలంగాణలోని వివిధ రాజకీయ పక్షాలకు చెందిన నేతలంతా పదుల సంఖ్యలో ఎన్నికల ప్రచార సభల్ని నిర్వహించారు. రోడ్ షోలు చేపట్టారు. పలు వార్డుల్ని సందర్శించారు. వీరందరికి భిన్నంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రం కేవలం రెండంటే రెండు కార్యక్రమాల్ని మాత్రమే చేపట్టారు. మీడియాతో దాదాపు రెండున్నర గంటలకు పైగా సుదీర్ఘ సమావేశం.. అరగంట పాటు సికింరదాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో భారీ బహిరంగ సభ.

ఈ రెండింటి ద్వారా కేసీఆర్ తానేం చెప్పదలుచుకున్నానన్న విషయాన్ని చెప్పేశారు. కేవలం రెండు రోజుల తేడాతో జరిగిన ఈ రెండు కార్యక్రమాల్లో కేసీఆర్ మాట తీరు.. ప్రస్తావించిన అంశాల్లో గణనీయమైన మార్పు కనిపించటం ఒక విశేషంగా చెప్పాలి. మీడియా సమావేశంలో ఆయన గ్రేటర్ పై గులాబీ జెండా పాతేశామని.. గెలిచిపోయామంటూ విజయం మీద అంతులేని ధీమాను వ్యక్తం చేశారు. గ్రేటర్ ను గెలిచినట్లుగా తేల్చిసన కేసీఆర్.. సికింద్రాబాద్ సభలో మాత్రం అలాంటి వ్యాఖ్యలు చేయకపోవటం గమనార్హం.

గ్రేటర్ తమ వశం అయ్యిందంటూ ఒకటికి రెండుసార్లు చెప్పేసిన కేసీఆర్.. మీడియా సమావేశంలోనూ ఎన్ని సీట్లు సాధిస్తామన్న విషయాన్ని చెప్పలేదు. అదే తీరులో పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించిన సభలోనూ ఇదే తీరును ప్రదర్శించారు. ఆ మాటకు వస్తే.. గ్రేటర్ లో తాము ఎన్ని స్థానాలు సొంతం చేసుకుంటామన్న విషయంపై కేసీఆర్ మాట వరసకు వ్యాఖ్య చెప్పిందే లేదు.

అన్నింటికి మించి మజ్లిస్ తమకు మిత్రుడనే మాటను మీడియా సమావేశంలో ప్రస్తావించిన కేసీఆర్.. పరేడ్ గ్రౌండ్స్ లో మజ్లిస్ తో మిత్రత్వం గురించి అస్సలు ప్రస్తావించకపోవటం గమనార్హం. మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన కేసీఆర్.. పరేడ్ గ్రౌండ్స్ సభలో తెలుగుదేశం.. బీజేపీల మీదనే ఎక్కువ గురి పెట్టటం కనిపిస్తుంది. మొత్తంగా చూస్తే రెండు రోజుల వ్యవధిలోనే కేసీఆర్ మాటలో తేడా చాలా స్పష్టంగా కనిపించక మానదు.