Begin typing your search above and press return to search.

ఢిల్లీ కాలింగ్: మోడీ త‌ప్పిదాలు..కేసీఆర్‌ కు అవ‌కాశాలు

By:  Tupaki Desk   |   3 April 2018 11:30 PM GMT
ఢిల్లీ కాలింగ్: మోడీ త‌ప్పిదాలు..కేసీఆర్‌ కు అవ‌కాశాలు
X
దేశ‌రాజ‌కీయాల్లో గుణాత్మ‌క మార్పు రావాల‌ని ప్ర‌క‌టించడ‌మే కాకుండా అందుకు త‌గిన రీతిలో ప‌శ్చిమ‌బెంగాల్ సీఎం మ‌మ‌తాబెన‌ర్జీని - వివిధ పార్టీల నేత‌ల‌కు క‌లుస్తూ వ‌స్తున్న తెలంగాణ సీఎం కేసీఆర్‌ కు ప‌రిస్థితులు క‌లిసివ‌స్తున్నాయ‌ని అంటున్నారు. ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీపై ఎర్ర‌జెండా ఎగుర‌వేసిన సీఎం కేసీఆర్‌ కు మోడీ ప‌రోక్షంగా చాన్స్‌ ల మీద చాన్సులు ఇస్తున్నార‌ని వివ‌రిస్తున్నారు. ఒక‌దాని వెంట ఒక‌టి అన్న‌ట్లుగా ప్ర‌ధాని ఇచ్చిన చాన్స్‌ తో వెంట‌నే కేసీఆర్ రియాక్ట‌య్యార‌ని చ‌ర్చ జ‌రుగుతోంది.

ఎస్సీ - ఎస్టీల చ‌ట్టం విష‌యంలో సుప్రీం ఆదేశాల నేప‌థ్యంలో ఆ వ‌ర్గాలు ఆందోళ‌న తెలిపిన సంగ‌తి తెలిసిందే. మ‌రోవైపు తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపైనా కేసీఆర్ స్పందించారు. ఒకే రోజు ఈ రెంటినీ పేర్కొంటూ ఆయ‌న త‌న స్పంద‌న తెలిపారు. భారత్ బంద్ సందర్భంగా దళితులపై వివిధ రాష్ర్టాలలో జరిగిన దాడులను సీఎం కేసీఆర్ తీవ్రంగా ఖండించారు. తరతరాలుగా సామాజిక - ఆర్థిక - రాజకీయ వెనుకబాటుకు గురైన దళితులకు ప్రభుత్వం - సమాజం అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు సీఎం. అణచివేతకు గురైన దళితులకు అండగా ఉండడం కోసమే రాజ్యాంగంలో ప్రత్యేక హక్కులు కల్పించారని సీఎం తెలిపారు. భారత ప్రభుత్వం కూడా అనేక సందర్భాలలో దళితులకు రక్షణగా ఉండడం కోసం ప్రత్యేక చట్టాలు చేసిందని కేసీఆర్ గుర్తు చేశారు. దళితులకు కల్పించిన హక్కులు - తీసుకువచ్చిన చట్టాలను పకడ్బందీగా అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉంటుందని సీఎం పేర్కొన్నారు. ఇటీవలే సుప్రీంకోర్టు జారీ చేసిన మార్గదర్శకాలు తమ హక్కులను కాలరాసే విధంగా తమ రక్షణ కోసం తీసుకువచ్చిన చట్టాలకు తూట్లు పొడిచేలా ఉన్నాయని దళితులు భావిస్తున్నారని సీఎం అభిప్రాయపడ్డారు. భారత ప్రధానమంత్రి వెంటనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో ఈ అంశంపై మాట్లాడాలని సీఎం కేసీఆర్ సూచించారు.

ఇక జ‌ర్న‌లిస్టుల ప‌క్షాన కేసీఆర్ గ‌ళం వినిపించి దేశం దృష్టిని ఆక‌ర్షించార‌ని ప‌లువురు అంటున్నారు. తప్పుడు వార్తలు రాస్తే జర్నలిస్టుల అక్రిడేషన్ రద్దు చేస్తామని కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం సరికాదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. పౌరుల హక్కులకు భంగం కలగకుండానే పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంటుందన్నారు. నిరాధార - తప్పుడు వార్తలు ప్రచురించిన, ప్రసారం చేసిన సందర్భంలో ఎలా వ్యవహరించాలన్న దానిపై ఇప్పటికే చట్టాలున్నాయని సీఎం గుర్తు చేశారు. తప్పుడు వార్తలు రాసే జర్నలిస్టుల గుర్తింపు రద్దు చేస్తామనడం దేశంలోని వేలాది మంది జర్నలిస్టులకు ఆందోళన కలిగించే అంశమని సీఎం పేర్కొన్నారు.

తమ హక్కులకు - చట్టాలకు భంగం కలుగుతుందనే బాధలో దళితులు చేస్తున్న ఆందోళనలను ప్రభుత్వం సానుభూతితో అర్థం చేసుకోవాలని ఓవైపు ఎస్సీల వైపున కేంద్రం దృష్టికి అభ్య‌ర్థ‌న చేయ‌డం - మ‌రోవైపు ప్ర‌ధాన‌మైన వ‌ర్గంగా ఉన్న జ‌ర్న‌లిస్టుల త‌ర‌ఫున గ‌ళం వినిపించ‌డంతో కేసీఆర్ త‌న జాతీయ రాజ‌కీయాల్లోకి ఎంట్రీకి మార్గం సుగ‌మం చేస్తున్నార‌ని అంటున్నారు. ప్ర‌ధాని మోడీ ఇచ్చిన చాన్స్‌ ను ఆయ‌న వాడుకుంటున్నార‌ని వ్యాఖ్యానిస్తున్నారు.